తేలేదెప్పుడో..? | Red-tapism hits AIS officers' distribution too | Sakshi
Sakshi News home page

తేలేదెప్పుడో..?

Published Mon, Sep 29 2014 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 PM

తేలేదెప్పుడో..?

తేలేదెప్పుడో..?

- ముంపు ఉద్యోగుల విభజన ప్రక్రియకు మరో ఆరునెలలు!
- కమలనాథన్ కమిటీకి అప్పగించడంతో అనివార్య జాప్యం
- రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీకే మరో మూడు నెలలు
- ఆ తరువాతే ముంపు మండలాలపై దృష్టి
- జనవరిలో తొలి సమావేశం ఉండొచ్చని అంచనా
- కమలనాథన్ కమిటీ కూడా పర్యటించే అవకాశం

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కమలనాథన్ కమిటీ కోర్టులోకి బంతి వెళ్లడంతో ముంపు మండలాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ కొంత జాప్యం కానుంది. ఆయా మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎవరిని తెలంగాణలో ఉంచాలి, ఎవరిని ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించాలనే దానిపై నిర్ణయం తీసుకునేందుకు మరో ఆరునెలలు పడుతుందని జిల్లా ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజనకే మరో మూడునెలల సమయం పడుతుందన్న వార్తల నేపథ్యంలో ముంపు మండలాల సమస్య తీరాలంటే మరో మూడు నెలల సమయం అదనంగా పడుతుందని వారంటున్నారు. ఈలోపు ఆయా మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెల్లించనుంది.
 
అది తేలిన తర్వాతే...
రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన కసరత్తు చేసేందుకు గాను కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ ఇప్పుడు దానిపై దృష్టి సారించింది. ముందుగా రాష్ట్రస్థాయి ఉద్యోగులను పంపిణీ చేసే పనిలో పడ్డ కమిటీ అక్టోబర్14న విస్తృత స్థాయి సమావేశాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. అంతకంటే ముందే వివిధ శాఖల అధిపతులతో (హెచ్‌వోడీ) కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశాల అనంతరం రాష్ట్రస్థాయి ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో రెండు నెలలకు పైగా పడుతుందని అంచనా.

ఈ పరిస్థితుల్లో ఆ ఉద్యోగుల పంపిణీ అనంతరమే ముంపు మండలాలపై కమిటీ దృష్టి సారిస్తుందని అధికారులంటున్నారు. ఎందుకంటే ముంపు ఉద్యోగుల భవితవ్యాన్ని తేల్చే బాధ్యతను కమలనాథన్ కమిటీ చేతిలో పెట్టారు కానీ ఇంతవరకు కమిటీ దానిపై దృష్టి సారించలేదు. కనీసం జిల్లా ఉన్నతాధికారుల నుంచి సమాచారం కూడా సేకరించలేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రస్థాయి ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ముంపు మండలాలపై కమిటీ దృష్టి సారిస్తుందని, అవసరమైతే ఓ సారి ముంపు మండలాల్లో కమిటీ సభ్యులు పర్యటిస్తారని జిల్లా ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు.

వాస్తవానికి భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో 2,280, మిగిలిన కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు (ఆరు రెవెన్యూ గ్రామాలు మాత్రమే) మండలాల్లో 447 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగుల్లో 80 శాతం మంది తెలంగాణనే ఆప్షన్‌గా ఎంచుకున్నారు. అంటే దాదాపు రెండు వేల మంది తెలంగాణకు వస్తారు. ఆ మేరకు తెలంగాణలో ఉద్యోగాలు పోతాయి. అదే కోటాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉద్యోగులు అవసరం అవుతారు. ఈ పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాలు నష్టపోకుండా కమలనాథన్ కమిటీ ఏం నిర్ణయిస్తుందో, సూపర్‌న్యూమరీ పోస్టుల ఏర్పాటుకు అనుమతిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.
 
టీచర్లను ఏం చేస్తారు?
విద్యాశాఖకు సంబంధించి 600 మందికిపైగా టీచర్లు ముంపు మండలాల్లోని వివిధ గ్రామాల్లో పనిచేస్తున్నారు. వీరిలో 200 మంది ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు సిద్ధపడుతుండగా, మరో 400 మంది తెలంగాణలోనే ఉంటామంటున్నారు. ఈ 400 మందిని తెలంగాణకు తీసుకువస్తే 400 టీచర్ ఉద్యోగాలను ఈ ప్రాంత వాసులు కోల్పోతారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు డీఎస్సీ పడినా ఆ మేరకు ఉద్యోగాల సంఖ్యలో కోత పడే అవకాశం ఉంది. మరోవైపు ఈ ముంపు మండలాలన్నీ ఏజెన్సీలో ఉండటంతో అక్కడి టీచర్ ఉద్యోగాలను కేవలం గిరిజనులతోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ, ముంపు పంపిణీలో ఎవరైనా గిరిజనేతర టీచర్లుంటే వారిని ఏం చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారనుంది. ఒకవేళ వారిని మైదాన ప్రాంతాలకు తెచ్చే వెసులుబాటున్నా ఆ మేరకు మైదాన ప్రాంత నిరుద్యోగులు నష్టపోనున్నారు.
 
రిటైరయ్యే వారి పరిస్థితి ఏమిటి?
ఇదిలా ఉంటే.. పంపిణీ ప్రక్రియ పూర్తయ్యేలోపు రిటైరయ్యే ఉద్యోగుల పరిస్థితి ఏమిటనేది అంతుపట్టడం లేదు. ఒకవేళ ఇలా రిటైరయ్యే వారిలో ఎవరైనా ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వెళ్లాలనుకుంటే మరో రెండేళ్లు సర్వీసు వస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్‌కు 58 ఏళ్ల వయోపరిమితి ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో దానిని 60 ఏళ్లకు పెంచారు. ఇకపోతే రిటైరయ్యే ఉద్యోగులకు ఇచ్చే అదనపు బెనిఫిట్లను ఎవరు చెల్లించాలనేది కూడా సమస్యగా మారనుంది.

ఇటీవలే చింతూరు మండలానికి చెందిన ఓ ఉద్యోగి తాను త్వరలోనే రిటైర్ అవుతున్నానని, తాను ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండాలని అనుకుంటున్నందున తన సర్వీసును పొడగించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ను కోరినట్టు సమాచారం. దీనికి స్పందించిన అక్కడి అధికారులు ఏం చేయాలనే దానిపై సీసీఎల్‌ఏను సంప్రదించినట్టు తెలిసింది. ఇదే అంశంపై ఖమ్మం కలెక్టరేట్‌కు వచ్చిన లేఖను కూడా సీసీఎల్‌ఏ నిర్ణయం కోసం పంపి అక్కడి నుంచి వచ్చే సమాచారం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement