
హైదరాబాద్: రెడ్డి కులస్తులంతా ఏకం కావాలని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్‌లోని మేకల జంగారెడ్డి గార్డెన్‌లో రెడ్డి సామాజిక సార్వజనిక సంక్షేమ సంఘం 3వ వార్షికోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న నాయిని మాట్లాడుతూ ఎవరికి వారు వేర్వేరు సంఘాలు పెడుతూ వాటిని రాష్ట్ర స్థాయి సంఘాలుగా చెప్పడం ప్రధాన సంఘాన్ని పలుచన చేయడమేనని అభిప్రాయపడ్డారు. ఐకమత్యం లేకుండా ఇలా వీధికో సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడంతో చులకనభావం ఏర్పడుతుందన్నారు.
ఒకటే సంఘంగా ఏర్పాటై సమస్యలను పరిష్కరించుకునే మార్గంలో ముందుకు నడవాలని సూచించారు. సంఘ ప్రతినిధుల వినతి మేరకు రెడ్డి సంఘానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఇప్పటికే అసెంబ్లీలో రైతు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి పంటకు, రైతుకు రూ. 4 వేల చొప్పున పెట్టుబడి ఇవ్వడం ప్రభుత్వ ఘనతేనని గుర్తు చేశారు. పేద రెడ్డి కులస్తులను ఆదుకుంటామని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి హామీ ఇచ్చారు.
కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కంసాని సత్తిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్‌రెడ్డి, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఉప్పల్ కార్పొరేటర్ మేకల అనలారెడ్డి, రెడ్డి హాస్టల్ అధ్యక్షుడు ఎడ్ల రఘుపతిరెడ్డి, కొంపల్లి మోహన్‌రెడ్డి, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment