రైల్వే చార్జీలను తగ్గించాలి | Reduce the railway fares : congress leaders | Sakshi
Sakshi News home page

రైల్వే చార్జీలను తగ్గించాలి

Published Thu, Jun 26 2014 4:04 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

రైల్వే చార్జీలను తగ్గించాలి - Sakshi

రైల్వే చార్జీలను తగ్గించాలి

- కాంగ్రెస్ నాయకుల డిమాండ్
- రైల్వేస్టేషన్ ఎదుట ధర్నా
- ప్రధాని దిష్టిబొమ్మ దహనం

 నిజామాబాద్ సిటీ : పెంచిన రైలు చార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ జిల్లా, నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం  జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఎన్డీఏ ప్రభుత్వం 14 శాతం రైలు చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాహెర్, నగర అధ్యక్షుడు కేశవేణు, మున్సిపల్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు  పార్టీ కార్యాలయం నుంచి  రైల్వేస్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు.

 స్టేషన్ ఎదుట బైఠాయించి పెంచిన రైలు చార్జీలను వెంటనే తగ్గించాలని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు తాహెర్ మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు చెప్పేది ఒకటని, చేసేది ఒకటని  చెప్పడానికి రైలు చార్జీల పెంపు ఒక నిదర్శనమన్నారు.
 
రైల్వే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టక ముందే  రైలు చార్జీలు పెంచి బడుగు, బలహీన వర్గాల ప్రజలపై ఎనలేని భారం మోపడం సరికాదన్నారు.  పెంచిన రైలు చార్జీలను వెంటనే తగ్గించి, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని  ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు రైల్వేస్టేషన్ లోపలకు వెళ్ళకుండా స్థానిక ఒకటో టౌన్ పోలీసులు అడ్డుకున్నారు. ధర్నా అనంతరం రైల్వే పోలీసులు నాయకుల వద్దకు చేరుకుని ధర్నాలో పాల్గొన్నవారి వివరాలు సేకరించారు.

ధర్నాలో టీపీసీసీ సహాయ కార్యదర్శి రత్నాకర్, కార్పొరేటర్లు దారం సాయిలు, మాయావార్ సాయిరాం, డీసీసీ ప్రధాన కార్యాదర్శి పోలా ఉషా, కోశాధికారి మీసాల సుధాకర్, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రామకృష్ణ, అర్బన్ అధ్యక్షుడు బంటురాము, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు సుమన్, మాజీ కార్పొటర్ బంటు శంకర్, నాయకులు ఫయాజుద్దీన్, సిర్పరాజ్, రాజేష్, పార్ధసారధి,హరికిరణ్ తదితరులు  పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement