10 వేల ర్యాంకు వరకు రీయింబర్స్‌మెంట్ సవరణ | Reimbursement to amends for 10 thousand rank | Sakshi
Sakshi News home page

10 వేల ర్యాంకు వరకు రీయింబర్స్‌మెంట్ సవరణ

Published Thu, Jul 9 2015 2:09 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

10 వేల ర్యాంకు వరకు రీయింబర్స్‌మెంట్ సవరణ - Sakshi

10 వేల ర్యాంకు వరకు రీయింబర్స్‌మెంట్ సవరణ

* ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
* ఎస్సీ, ఎస్టీలకు ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి ఫీజు
* 5వేల ర్యాంకు వరకే పరిమితం చేస్తూ జూన్ 30న జారీ చేసిన మెమో రద్దు
* పాత విధానాన్నే కొనసాగించాలని సీఎంను కోరిన మంత్రులు, ఎమ్మెల్యేలు
* పథకాన్ని కుదిస్తే విపక్షాలు వ్యతిరేక ప్రచారం చేస్తాయని వెల్లడి
* అంగీకరించిన సీఎం .. సవరణ ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశం

 
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో చేరే విద్యార్థుల్లో 10 వేల ర్యాంకు వరకు వచ్చిన వారికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించనుంది. ఎస్సీ, ఎస్టీలకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజులను ప్రభుత్వమే భరించనుంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా సవరణ ఉత్తర్వులు (మెమో నంబర్: 568-3/ఎస్‌సీడీ. ఎడ్యుకేషన్/2014-6)ను జారీ చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను 5 వేల ర్యాంకు వచ్చిన విద్యార్థుల వరకే పరిమితం చేస్తూ జూన్ 30న ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి మెమో జారీ చేశారు. దీనిపై ‘సాక్షి’ ఇటీవల కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఫీజుల పథకాన్ని కుదించడంపై వివిధ రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఈ అంశాన్ని కొందరు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. నిర్ణయాన్ని మార్చాలని కోరారు.
 
 గతంలో మాదిరి 10 వేల ర్యాంకు వరకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ కొనసాగించినా రూ.200 కోట్లు మాత్రమే అదనపు భారం పడుతుందని, అందువల్ల పాతవిధానాన్నే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. 5 వేల ర్యాంకు వరకే పరిమితం చేస్తే బీసీ, ఈబీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఫలాలు అందడం లేదని ప్రతిపక్షాలు ప్రచారం చేసే అవకాశాలున్నాయని కేసీఆర్‌కు వివరించినట్టు తెలిసింది. దీంతో 10 వేల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులకు కూడా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చేలా సవరణ ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి.
 
 స్థానిక తెలంగాణ విద్యార్థులకే
 రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి 371(డి) ప్రకారం తెలంగాణకు చెందిన స్థానిక విద్యార్థులకే పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం క్వాలిఫై అయిన కోర్సుకు ముందు విద్యార్థులు గత ఏడేళ్ల విద్యాభ్యాసానికి సంబంధించిన రికార్డులను సమర్పించాలని, అప్పుడే స్కాలర్‌షిప్‌లకు అర్హులవుతారని పేర్కొంది. స్కాలర్‌షిప్‌లకు అర్హులైన విద్యార్థుల అలాట్‌మెంట్ లెటర్లపై ఎంసెట్ కన్వీనర్  ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని తెలిపింది. సీట్ల కేటాయింపు సందర్భంగా ఈ నిబంధనను పాటించాలని ఎంసెట్ కన్వీనర్‌ను ఆదేశించింది.
 
 ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపు ఇలా...
 - ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరికీ ర్యాంకుతో సంబం ధం లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్.
 - కార్పొరేట్ కాలేజీ స్కీమ్‌లో భాగంగా ప్రభుత్వం స్పాన్సర్ చేసిన విద్యార్థులతోపాటు ప్రభుత్వ, రెసిడెన్షియల్ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులందరూ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందేందుకు అర్హులు.
- ఎస్సీ, ఎస్టీలు, 10 వేల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులు కాకుండా మిగతా విద్యార్థులకు.. ఆయా కాలేజీల్లో వసూలు చేసే ఫీజుతో నిమిత్తం లేకుండా గరిష్టంగా రూ.35 వేల ఫీజు లేదా కాలేజీ ఫీజు (ఏది తక్కువ అయితే అది) రీయింబర్స్‌మెంట్ కింద ప్రభుత్వం చెల్లిస్తుంది.
 - ఈసెట్ ద్వారా ఇంజనీరింగ్ సెకండియర్ అడ్మిషన్లు పొందే వారిలో వెయ్యిమంది విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్ చేస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement