రిమోట్ సెన్సింగ్‌తో భూయాజమాన్య పరీక్షలు | Remote spinning | Sakshi
Sakshi News home page

రిమోట్ సెన్సింగ్‌తో భూయాజమాన్య పరీక్షలు

Published Sat, Apr 25 2015 2:40 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Remote spinning

వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రత్యేకాధికారి డాక్టర్ ప్రవీణ్‌రావు
 జగిత్యాల అగ్రికల్చర్: తెలంగాణ రాష్ట్రంలో ప్రయోగత్మకంగా రిమోట్ సెన్సింగ్ పరిజ్ఞానంతో భూ యాజమాన్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేకాధికారి డాక్టర్ ప్రవీణ్‌రావు చెప్పారు. జగిత్యాల మండలం పొలాస వ్యవసాయ కళాశాల, వ్యవసాయ పరిశోధన స్థానాన్ని డాక్టర్ ప్రవీణ్‌రావు శుక్రవారం సందర్శించారు.
 
 తొలుత ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి, మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజిపేట, మెదక్ జిల్లా గజ్వేల్ ప్రాంతాల్లో అంతరిక్ష పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, ఆ ప్రాంతాల్లోని భూమికి సంబంధించిన అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుంటామని చెప్పారు. రాబోయే  నాలుగేళ్లలో ప్రతి గ్రామంలోని భూమిని రిమోట్ సెన్సింగ్‌తో పరిశీలన చేయనున్నట్లు చెప్పారు. సిరిసిల్ల, తోర్నాల, జమ్మికుంట, మాల్ తుమ్మెద ప్రాంతాల్లో వ్యవసాయ పాలిటెక్నిక్‌లు  ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మొక్కజొన్న పరిశోధన కేంద్రాన్ని సిద్దిపేట ప్రాంతంలోని దోర్నాల వద్ద, ఫుడ్ సైన్స్ కళాశాలను నిజమాబాద్ జిల్లా రుద్రూర్‌లో, వేరుశెనగ ప్రాజెక్టును మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. చాల దేశాల్లో సాంకేతిక పరిజ్ఞానం బదాలియింపు వంటి అంశాలపై వ్యవసాయ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంటున్నటు తెలిపారు. ప్రతి వ్యవసాయ పరిశోధనస్థానంలో రైతులకు అవసరమయ్యే అన్ని పనిముట్లను అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
 
 ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ. 324 కోట్ల బడ్జెట్ ఉంటే, 290 కోట్లు జీతాలకే ఖర్చు అయ్యేదని, కేవలం అభివృద్ధికి కేటాయించిన రూ.34 కోట్లలో, తెలంగాణ ప్రాంతానికి రూ. 14.5 కోట్లు వచ్చేవని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-15లో రూ. 89 కోట్ల బడ్జెట్ ఇచ్చారని, 2015-16 బడ్జెట్‌లో రూ. 89 కోట్లకు అదనంగా మరో రూ. 30 కోట్లు ఇచ్చారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ యువ రైతు సాగుబడి కింద ఇప్పటివరకు 330 మందితో మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తయిందని అన్నారు.
 
 వ్యవసాయ విద్యార్థులు తమకు నచ్చిన అంశంపై ప్రతిరోజూ రేడియో ద్వారా రైతులను చైతన్య పరుస్తున్నారని చెప్పారు.  కొత్త ప్రణాళికలను యూనివర్సిటీకి అన్వయించుకుని పరిశోధన ప్రగతిలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. జగిత్యాల, అశ్వరావుపేట, రాజేంద్రనగర్‌లలో ఉన్న వ్యవసాయ కళాశాలలతో పాటు, వరంగల్, పాలెం, పొలాస వ్యవసాయ పరిశోధన స్థానాలను సైతం మరింతగా అభివృద్ధి చేయనున్నామని చెప్పారు.
 
 ఉద్యోగుల ఆప్షన్లు పూర్తయిన వెంటనే ఖాళీగా ఉన్న శాస్త్రవేత్తల పోసులు భర్తీ చేస్తామని తెలిపారు. అనంతరం ప్రవీణ్‌రావు కళాశాలలోని ల్యాబ్‌లను పరిశీలించారు. కార్యక్రమంలో డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ టీవీకే సింగ్, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్ డాక్టర్ వాసుదేవ్, డెరైక్టర్ ఆఫ్ పాలిటెక్నిక్ డాక్టర్ ధర్మారెడ్డి, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జానయ్య, వ్యవసాయ పరిశోధన స్థానం డెరైక్టర్ డాక్టర్ లక్ష్మన్, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు  మల్లారెడ్డి, ఉపేందర్, వెంకటయ్య, రాజేశ్వరి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement