- జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నూతన వీసీ ప్రవీణ్‌రావు వెల్లడి
- వర్సిటీలో అడుగడుగునా నిఘా... సీసీ కెమెరాల ఏర్పాటు
- అవినీతికి పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని హెచ్చరిక
- ప్రతీ రైతు వద్దకు అధికారిని పంపలేం... టెక్నాలజీని ఉపయోగిస్తామని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్
వైద్య ప్రవేశాలకు వచ్చే ఏడాది నుంచి ఎంసెట్‌కు బదులు కేవలం నీట్ ర్యాంకులపైనే ఆధారపడే అవకాశం ఉండటంతో ఇక వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు సొంతంగా ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తామని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ప్రవీణ్‌రావు వెల్లడించారు. వైస్ ఛాన్స్‌లర్‌గా బాధ్యతలు స్వీకరించాక సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఇప్పటివరకు వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ మెడికల్ ర్యాంకులపైనే ఆధారపడ్డామని... నీట్ వస్తే సొంతంగా ప్రవేశ పరీక్ష నిర్వహించడమా మరో విధంగా వెళ్లడమా అనే అంశంపై కసరత్తు చేస్తామన్నారు. విశ్వవిద్యాలయంలో అవినీతికి సాధారణ ఉద్యోగి మొదలు... ప్రొఫెసర్ స్థాయి వ్యక్తి వరకు ఎవరు పాల్పడినా ఉపేక్షించబోమన్నారు. ఆర్థిక నిర్వహణ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుందన్నారు. విశ్వవిద్యాలయంలోనూ... ఆరుబయటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వర్సిటీ పరిపాలనా భవనంతోపాటు పోలీస్ స్టేషన్‌కూ ఈ సీసీ కెమెరాలు అనుసంధానమై ఉంటాయన్నారు.
ఇదంతా విద్యార్థుల సంరక్షణను దష్టిలో పెట్టుకొనే చేస్తున్నామన్నారు. అలాగే పరిశోధన కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. జవాబుదారీతనం, పారదర్శకతగా విశ్వవిద్యాలయాన్ని నడిపిస్తానన్నారు. అడ్మిషన్ల ప్రక్రియలో ప్రక్షాళన చర్యలు తీసుకుంటామన్నారు. విశ్వవిద్యాలయంలోని పరిజ్ఞానాన్ని రైతుల వద్దకు తీసుకెళ్తామన్నారు. విద్య, పరిశోధన, విస్తరణే లక్ష్యంగా విశ్వవిద్యాలయాన్ని ముందుకు తీసుకెళ్తానన్నారు. ప్రతీ రైతు వద్దకు అధికారిని లేదా ఉద్యోగులను పంపలేమని... వారికి అవసరమైన పరిజ్ఞానాన్ని అందజేసేందుకు టెక్నాలజీని ఉపయోగిస్తామన్నారు. అందుకోసం ప్రత్యేకమైన యాప్‌లను అభివృద్ధి చేస్తామన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేస్తామన్నారు.
ఇప్పటివరకు తెలంగాణ సోనా విత్తనాలను 2 లక్షల ఎకరాల వరకు సరఫరా చేశామని... వచ్చే ఏడాది నుంచి 10 లక్షల ఎకరాలకు బ్రీడర్ సీడ్‌ను ఇస్తామన్నారు. పప్పుధాన్యాల విత్తన హబ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణను కేవలం దున్నడం ఇతరత్రా వరకే పరిమితం చేయకుండా విత్తడం, మొక్కల సంరక్షణ వరకు కూడా ఉపయోగించాలన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చేరే విద్యార్థుల్లో 40 శాతం మంది గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తున్నారన్నారు. వారికి ఇంగ్లీషులో ప్రావీణ్యం కల్పించి సివిల్ సర్వీసెస్ వంటి పోటీ పరీక్షల్లో రాటుదేలేలా చేస్తామన్నారు. స్మార్ట్ క్లాస్‌రూంలను ఏర్పాటు చేస్తామన్నారు.
అధ్యాపకులకు శిక్షణ ఇస్తామన్నారు. వర్సిటీలో పరిశోధనను బలోపేతం చేస్తామన్నారు. ఇదిలావుండగా వినాయక విగ్రహాలకు సహజ రంగులు అద్దితే పర్యావరణానికి అనుకూలంగా ఉంటుందన్నారు. అందుకోసం హోంసైన్స్ కాలేజీ విద్యార్థులు తయారుచేసిన సహజరంగులను మార్కెట్లోకి ప్రవేశ పెడుతున్నామన్నారు. ఈసారి ఖైరతాబాద్ భారీ వినాయక విగ్రహానికి కూడా సహజరంగులతో తీర్చిదిద్దుతామన్నారు. ఈ ఏడాది 2 లక్షల చిన్న విగ్రహాలకు, 10 వేల భారీ విగ్రహాలకు సహజరంగులు సరఫరా చేస్తామన్నారు. వచ్చే మూడు నాలుగేళ్లల్లో హైదరాబాద్‌లోని అన్ని విగ్రహాలకూ అవసరమైన సహజ రంగులను సరఫరా చేస్తామన్నారు. తాము రూపొందించిన సహజ రంగులకు పేటెంట్ హక్కు కోసం కూడా ప్రయత్నిస్తున్నామన్నారు.
బాధ్యతల స్వీకారం...
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ ప్రవీణ్‌రావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వులు జారీ అయిన వె ంటనే ఆయన మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సచివాలయంలోని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారధి వద్ద బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విశ్వవిద్యాలయానికి వెళ్లారు. 2014 సెప్టెంబర్‌లో వ్యవసాయ వర్సిటీ ఏర్పడినప్పటి నుంచీ ఆయనే ప్రత్యేకాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.