సాక్షి, హైదరాబాద్: జ్యోతిరావు పూలే జయంతి వేడుకల దుర్వినియోగ అభియోగాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిధుల దుర్వినియోగం రిట్‌లో కౌంటర్ దాఖలు చేయాలని గత జనవరిలో హైకోర్టు నోటీసులు జారీ చేస్తే నాలుగు నెలలైనా ఇప్పటివరకూ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. కౌంటర్ దాఖలుతోపాటు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి/కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది.
తదుపరి విచారణను జూన్ 15కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్రంలో పూలే జయంతి వేడుకల నిర్వహణకు బీసీ సంక్షేమ శాఖ రూ.11.25 లక్షలు మంజూరు చేస్తే హైదరాబాద్‌లో చేసిన ఖర్చులో సుమారు 70 శాతం వరకు దుర్వినియోగం అయిందని ఆరోపిస్తూ హైదరాబాద్‌కు చెందిన శివుపల్లి రాజేశం పిల్ దాఖలు చేశారు.
18 నుంచి అన్ని కేసులనూ విచారించనున్న హైకోర్టు
లాక్‌డౌన్ కారణంగా అత్యవసర కేసుల్ని మాత్రమే విచారిస్తున్న హైకోర్టు ఈ నెల 18వ తేదీ సోమవారం నుంచి అన్ని రకాల కేసులనూ విచారించాలని నిర్ణయించింది. రిట్లు, క్రిమినల్, సివిల్ కేసులను ఆన్‌లైన్‌లో ఏ విధంగా దాఖలు చేయాలో హైకోర్టు వెబ్‌సైట్‌లో వివరాలను పొందుపర్చినట్లు రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment