జాతీయ జెండాను ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌ | Republic Day Celebrations In YSRCP Office | Sakshi
Sakshi News home page

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

Published Sat, Jan 26 2019 11:07 AM | Last Updated on Sun, Jan 27 2019 3:41 AM

Republic Day Celebrations In YSRCP Office - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/విజయవాడ సిటీ: హైదరాబాద్‌లోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కేంద్ర కార్యాలయంలో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. సీనియర్‌ నేతలు, పార్టీ శ్రేణుల సమక్షంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. అంతకుముందు ఆయన ప్రతిపక్ష నేత హోదాలో పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమానికి ముందు ఆయన జాతిపిత మహాత్మాగాంధీ, భారత రాజ్యాంగ రూపశిల్పి బీఆర్‌ అంబేడ్కర్, జాతీయోద్యమ నేతలు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్, బాబూ జగజ్జీవన్‌ రామ్‌ల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా హాజరైన పార్టీ శ్రేణులకు, ఉభయ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు వైఎస్‌ జగన్‌ రిపబ్లిక్‌ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత పార్టీ కార్యాలయంలో కొద్ది సేపు గడిపి కార్యకర్తలను, నేతలను పలకరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీలు వైఎస్‌ వివేకానందరెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌ యాదవ్, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున, రాష్ట్ర మైనారిటీల విభాగం అధ్యక్షుడు ఖాదర్‌బాషా, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, నేతలు వాసిరెడ్డి పద్మ, హెచ్‌ఏ రెహ్మాన్, విజయచందర్, కంతేటి సత్యనారాయణరాజు, పీఎన్వీ ప్రసాద్, ఎస్‌.దుర్గాప్రసాదరాజు, ఎం.కిష్టప్ప, మహ్మద్‌ ఇక్బాల్, కొండా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు వై.శివరామిరెడ్డి, పి.సుబ్బారెడ్డితో సహా పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
విజయవాడలో ఘనంగా వేడుకలు 

విజయవాడలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. దేశం కోసం పోరాడిన మహనీయుల చిత్ర పటాలకు పార్టీ నేతలు పూల మాలలతో ఘనంగా నివాళులర్పించారు. పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగఫలంగా మనకు రాజ్యాంగం, దాని ద్వారా హక్కులు సంక్రమిస్తే.. రాష్ట్రంలో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడుగడుగునా వాటికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. వెలంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ చంద్రబాబుకు దేశమన్నా, రాష్ట్రమన్నా, ప్రజలన్నా కూడా గౌరవం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బండి పుణ్యశీల, బొప్పన భవకుమార్, మనోజ్‌ కొఠారి, ఎంవీఆర్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement