
నా బర్త్ డే రోజు ఆ పని చేయండి: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ నేతలకు ఓ విజ్ఞప్తి చేశారు. తన పుట్టినరోజున హంగు ఆర్భాటాలకు డబ్బు వృథా చేయడం కంటే.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు పాల్గొనడం ఉత్తమమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తమ పార్టీ నేతలకు కేటీఆర్ సూచించారు. పుట్టినరోజు వేడుకలను సామాన్యులైనా తమ బంధుమిత్రులతో జరుపుకోవాలనుకుంటారు. సెలబ్రిటీల పుట్టినరోజులంటే ఇక చెప్పనక్కర్లేదు.. పూర్తిగా సందడి వాతావరణం నెలకొంటుంది.
కానీ తెలంగాణలో కీలకనేత, రాష్ట్రమంత్రి అయినప్పటికీ తన పుట్టినరోజు వేడుకలను సామాన్యుడిలా జరుపుకోవాలని కేటీఆర్ భావిస్తున్నారు. ఫ్లెక్సీలు, హోర్డింగులు, బొకేలు, ప్రకటనలంటూ హడావుడి చేయవద్దని.. అందుకోసం డబ్బు ఖర్చు చేయవద్దని, అందరికీ మంచి జరిగే హరిత హారంలో పాల్గొంటే ఉత్తమమని టీఆర్ఎస్ నేతలకు ఆయన సూచించారు. జూలై 24న కేటీఆర్ పుట్టినరోజన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ తమ పార్టీ నేతలను హరితహారం కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రోత్సహించేలా ట్వీట్ చేశారు. పని చేయడమే ముఖ్యమంటూ తన ఉద్దేశాన్ని కేటీఆర్ స్పష్టంచేశారు. కేటీఆర్ ట్వీట్ పై నేతల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Request TRS leaders NOT to waste money on Bouquets, Hoardings, Flexis or Advertisements on my birthday. Instead participate in #HarithaHaram
— KTR (@KTRTRS) 19 July 2017