రిటైరైనా.. కొలువులు పదిలం!
కొత్తగూడెం: వారు సింగరేణిలో అత్యున్నత స్థాయిలో పదవులు చేపట్టి ఉద్యోగ విరమణ చేసినవారు. అయినా వారి కొలువులు మాత్రం భద్రంగానే ఉంటున్నాయి. పాతవారి స్థానంలో కొత్తవారిని నియమించాల్సిన సంస్థ.. రిటైర్డ్ అధికారుల సేవలను మాత్రం వదులుకోవడం లేదు.. దీంతో రిటైర్ అయ్యాక కూడా వారికి లక్షల రూపాయల వేతనాలు అందుతున్నాయి. ఉద్యోగ విరమణ పొందిన వారి స్థానంలో కొత్తవారిని నియమించి నిరుద్యోగులకు భృతి కల్పించాల్సిన సింగరేణి యాజమాన్యం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.
సింగరేణి సంస్థలో అత్యున్నత జీఎంస్థాయి పోస్టుల్లో రిటైరైన అధికారుల సేవలను ఆ తర్వాత కూడా వినియోగించుకుంటున్నారు. దీంతో ప్రతి నెలా సంస్థపై రూ.3 కోట్ల మేరకు భారం పడుతోంది. కొత్తవారికి అవకాశం ఇవ్వకుండా రిటైర్డ్ అధికారుల సేవలనే వినియోగించుకోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కొత్త కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలు అడియాశలే అవుతున్నాయి.
14 మంది అధికారులు.. రూ. 3 కోట్ల ఖర్చు
ప్రస్తుతం సింగరేణిలో 14 మంది రిటైర్డ్ అధికారులు పనిచేస్తున్నారు. వీరి సేవలకు గాను ఒక్కొక్కరికి నెలకు రూ.50 వేల నుంచి లక్ష వరకు సంస్థ చెల్లిస్తోంది. దీంతోపాటు టీఏ, డీఏ ఖర్చులు కలుపుకొని ప్రతి నెలా రిటైర్డ్ అధికారుల సేవలకు రూ.3 కోట్ల ఖర్చవుతోంది. ఈ మొత్తంతో ఎంతోమందికి ఉద్యోగావకాశాలు కల్పించవచ్చు. అయినా యాజమాన్యం ఆ దిశగా ఆలోచించడం లేదు. ఇప్పటికే 14 మంది సేవలను వినియోగించుకుంటున్న సింగరేణి.. కొద్ది రోజుల్లో రిటైరయ్యే మరికొందరి సేవలను కూడా తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
కొత్త ఉద్యోగాల కల్పనకు గండిగా మారిన ఈ పద్ధతిని వ్యతిరేకించేందుకు సింగరేణి జేఏసీ సమాయత్తమవుతోంది. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని సింగరేణి జేఏసీ కన్వీనర్ డాక్టర్ శంకర్ నాయక్ పేర్కొన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం ఈ విషయంపై దృష్టి సారించి కొత్తవారికి ఉపాధికి అవకాశం కల్పించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.