58 ఏళ్లే..
► పదవీ విరమణ వయసు పెంపు లేదు
► 60 ఏళ్లకు పెంచాలన్న ఫైలును తిప్పి పంపిన ముఖ్యమంత్రి
► నిరుద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకతతోనే నిర్ణయం
► రిటైర్మెంట్ వయసు పెంచితే వారి ఆందోళన
► మరింత తీవ్రమవుతుందని ప్రభుత్వం అంచనా
► కొత్త ఉద్యోగాల భర్తీపైనా ప్రభావం.. అందుకే పెంపునకు విముఖత
సాక్షి, హైదరాబాద్
ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును మరో రెండేళ్ల పాటు పొడిగించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంది. ప్రస్తుతమున్న 58 ఏళ్లకు రిటైర్మెంట్ విధానాన్ని యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో నిరుద్యోగుల నుంచి పెల్లుబుకుతున్న నిరసనలు, వ్యతిరేకత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రిటైర్మెంట్ వయసును పెంచేది లేదని ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా అధికారులకు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆర్థిక శాఖ పంపించిన 60 ఏళ్ల రిటైర్మెంట్ ఫైలును సైతం సీఎంవో కార్యాలయం వెనక్కి పంపించినట్లు తెలిసింది. మూడేళ్లుగా పదవీ విరమణ వయోపరిమితి పొడిగించే అంశంపై ఉద్యోగ వర్గాలు ఆశలు పెంచుకున్నాయి. రాష్ట్ర పునర్విభజన కాగానే ఏపీ ప్రభుత్వం అక్కడి ఉద్యోగుల పదవీ కాల పరిమితిని 60 ఏళ్లకు పెంచింది. దాంతో తెలంగాణ ఉద్యోగుల్లోనూ ఆశలు చిగురించాయి. ఉద్యోగ సంఘాలు, ప్రధానంగా రెవెన్యూ వర్గాలన్నీ రిటైర్మెంట్ వయసును పొడిగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రిని కలసి వినతిపత్రాలు అందించాయి. అదే సమయంలో పదో పీఆర్‌సీతో పెరిగిన పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులు ప్రభుత్వానికి ఆర్థికంగా భారమయ్యాయి. వీటన్నింటి దృష్ట్యా రిటైర్మెంట్ వయసును 60 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం సైతం పరిశీలనకు స్వీకరించింది. దీనిపై ఆరు నెలల కిందటే ప్రతిపాదిత ఫైలును ఆర్థిక శాఖ సీఎం కార్యాలయానికి పంపించింది.
తొలుత ఆసక్తి చూపిన సర్కారు..
రాష్ట్రంలో మొత్తం 4 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వచ్చే ఏడాది నవంబర్‌లోగా దాదాపు 50 వేల మంది ఉద్యోగులు రిటైరవుతున్నారు. రాబోయే రెండేళ్లలో లక్షల మందికి పైగా రిటైరవుతారని ఆర్థికశాఖ అంచనా వేసింది. రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపులకు ఏటా దాదాపు రూ. 5 వేల కోట్లు అవసరమవుతాయని లెక్కలేసుకుంది. ఉద్యోగుల రిటైర్మెంట్‌ను మరో రెండేళ్లకు పెంచితే.. భారీ ఆర్థిక భారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని అంచనాలేసింది. మరోవైపు ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా ఇప్పటివరకు ఉద్యోగ వర్గాల్లో ఉన్న పేరును నిలబెట్టుకున్నట్లుగా ఉంటుందని భావించింది. కానీ.. క్రమంగా కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం కావటం, జారీ చేసిన నోటిఫికేషన్లు సైతం సక్రమంగా ముందుకు సాగకపోవటం.. కొన్ని కోర్టు కేసుల్లోకెక్కడంతో నిరుద్యోగ వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. కొన్ని చోట్ల ఆందోళనలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును పెంచటం సరికాదని, నిరుద్యోగుల ఆందోళనను మరింత రెచ్చగొట్టినట్లుగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త ఉద్యోగావకాశాలపై ప్రభావం చూపే అంశం కావటంతో ఈ ప్రతిపాదనకు దూరంగా ఉండటమే సరైందని గుర్తించాయి. ఉద్యోగ వర్గాలను ఆకట్టుకునేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించే విషయంలోనే చిత్తశుద్ధితోనే ఉందని, అందుకే రిటైర్మెంట్ వయసును పెంచే ప్రసక్తి లేదని సీఎం ఈ ఫైలుపై సీఎం అధికారులకు స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది.