సింగరేణి కార్మికుల ఆశలు...
కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక తమ కలలు సాకారమవుతాయని, వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తారని సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి వారి ఆశలు రెట్టింపయ్యాయి. సీఎం ఎప్పుడు సానుకూల నిర్ణయం తీసుకుంటారోనని ఎదురుచూస్తున్నారు. రెండు, మూడేళ్లలో ఉద్యోగ విరమణ పొందే కార్మికులు 12వేల నుంచి 15వేల వరకు ఉంటారు. వీరంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.
శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్.. సింగరేణిలో పర్యటించిన ప్రతీసారి కార్మికుల కలలను నెరవేర్చుతానని హామీ ఇస్తూ వచ్చారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి అన్నట్టుగానే అమలు చేశారు. లాభాల్లో వాటాశాతాన్ని పెంచేలా చర్యలు చేపట్టారు. అలాగే వారసత్వ ఉద్యోగాలను ఇప్పిస్తామని భరోసా ఇచ్చిన కేసీఆర్... ఆ హామీని నెరవేర్చాలని కార్మికులు కోరుతున్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ కూడా ఈ అంశంపైనే కార్మికులకు మాటిచ్చిందని, ఆ మేరకు ఇటు ప్రభుత్వం, అటు సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చి కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వెక్కిరిస్తున్న ఖాళీలు
సింగరేణిలో ఇప్పటివరకు ఏర్పడిన ఉద్యోగ ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. కంపెనీలో 35 భూ గర్భ గనులు, 15 ఓసీపీలు ఉన్నాయి. 62 వేల పైచిలుకు కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో 55 ఏళ్ల వయసు ఉన్నవారు 70 శాతం మంది ఉంటారు. దీనికి తోడు ఇతర కేటగిరీల్లో ఇప్పటికే ఖాళీలు ఉన్నాయి. మైనింగ్ స్టాఫ్ నుంచి మొదలు కొని ట్రేడ్స్‌మెన్ వరకు కొరత తీవ్రం గా ఉంది. సూపర్‌వైజర్ సిబ్బంది పోస్టులే 1,500 వరకు ఖాళీ ఉన్నాయి. క్లర్కులు, ఆఫీస్ బాయ్‌లు కూడా సరిపడా లేరు. ఈ క్రమంలో వారసత్వ ఉద్యోగ హక్కును పునరుద్ధరిస్తే, ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా కార్మిక కుటుంబాలకు ఆధారం లభించినట్లవుతుందనే చర్చ సాగుతోంది.