increments
-
సుమారు 5 వేలమంది సీనియర్లకు షాకిచ్చిన ఈ కామర్స్ దిగ్గజం
సాక్షి,ముంబై: వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఈ-కామర్స్ దిగ్గజం వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. గ్లోబల్‌గా లేఫ్స్ ఆందోళనల మధ్య ఉద్యోగుల జీతాల పెంపుపై ఫ్లిప్‌కార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. టెక్ కంపెనీలు తమ లాభదాయకతను పెంచుకోవడానికి ఖర్చులను తగ్గించుకుంటున్న తరుణంలో ఫ్లిప్‌కార్ట్ వార్షిక వేతనాల పెంపును కేవలం 70 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించింది, అంటే ఈ ఏడాది దాదాపు 5వేల మంది సీనియర్ సిబ్బంది వేతనాల్లో ఎటువంటి పెంపుదల ఉండదు. కేవలం 70 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే బేసిక్ జీతాల పెంపును పరిమితం చేస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితంగా సుమారు 5000 ఉద్యోగులకు ప్రభావితం కానున్నారని సమాచారం. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ ఫిబ్రవరి 22 మెయిల్లో గ్రేడ్ 10 అంతకంటే ఎక్కువ ఉన్నవారి వేతనాల్లో ఎలాంటి పెంపుదల ఉండదని పేర్కొంది. అయితే సంస్థ ఉద్యోగుల కోసం బోనస్ చెల్లింపులు ,ద్యోగుల స్టాక్ ఆప్షన్ కేటాయింపులు ప్లాన్ ప్రకారం ఉంటాయని స్పష్టం చేసింది. -
పిల్లల్ని కనండి ఇంక్రిమెంట్ పొందండి.. ఉద్యోగులకు సిక్కిం సీఎం వరాలు!
భారత దేశ జనభా ఇప్పటికే దాదాపు 140 కోట్లు క్రాస్ చేసింది. జనాభా నియంత్రణ విషయంలో పలు ప్రభుత్వాలు ఇప్పటికే ఒక్కరు ముద్దు.. ఇద్దరు వద్దు అంటూ ప్రకటనలు చేశాయి. కానీ, ఇందుకు భిన్నంగా ఈశాన్య రాష్ట్రం సిక్కిం సీఎం మాత్రం కొత్త పాలసీకి తెరలేపారు. జనాభాను పెంచాలన్నారు. పిల్లల్ని కంటే ఇంక్రిమెంట్ ఉంటుందని భరోసా ఇచ్చారు. వివరాల ప్రకారం.. సిక్కింలో మాఘే సంక్రాంతి సందర్బంగా సీఎం ప్రేమ్‌సింగ్ తమాంగ్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమాంగ్ మాట్లాడుతూ సిక్కింలో తమ జాతి జనాభాను పెంచాలన్నారు. మూడో పిల్లాడ్ని కంటే డబుల్ ఇంక్రిమెంట్ ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధంగా చేస్తున్నట్టు తెలిపారు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగినులు ఎక్కువ మంది పిల్లల్ని కంటారో వారికి ఎక్కువ ప్రోత్సాహకాలు అందుతాయని ఆఫర్ ఇచ్చారు. అలాగే.. ఇద్దరు పిల్లల్ని కంటే ఒక ఇన్సెంటీవ్, ముగ్గురు పిల్లల్ని కన్నవారికి డబుల్ ఇక్రిమెంట్‌తో పాటు ఎక్కువ సెలవులు తీసుకునేందుకు కూడా అనుమతి ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే, సిక్కింలో ఇటీవలి కాలంలో సంతనోత్పత్తి రేటు చాలా తగ్గిపోయిందన్నారు. అందుకే తమ జాతి జనాభాను పెంచాలని సూచించారు ఇదే క్రమంలో ఐవీఎఫ్ ద్వారా తల్లి అయ్యేందుకు అవసరమైన డబ్బును కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనే ఉద్యోగినులకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని సీఎం తమాంగ్ వెల్లడించారు. ఐవీఎఫ్ సౌకర్యం ద్వారా ఇప్పటివరకు 38 మంది మహిళలు గర్భం దాల్చారని, కొందరు తల్లులు కూడా అయ్యారని తెలిపారు. కాగా, సర్వీసులో ఉన్న మహిళలకు 365 రోజుల ప్రసూతీ సెలవులు ఇస్తున్నారు. మగ ఉద్యోగులకు 30 రోజుల పితృత్వ సెలవులు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాగా, సీఎం హామీలపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. -
విప్రో ఉద్యోగులకు దసరా కానుక, 96 శాతం కవర్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థల్లో ఒకటైన విప్రో ఉద్యోగులకు తీపి కబురు అందించింది.విప్రోయిట్ల వార్షిక జీతాల పెంపును తాజాగా ప్రకటించింది. 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి అర్హులైన ఉద్యోగులకు వార్షిక ఇంక్రిమెంట్స్ ప్రకటించింది. ఈ సెప్టెంబర్ నెల జీతంతో దీన్ని ఉద్యోగులకు అందించనుంది. ఈమేరకు ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారాన్ని అందించింది. ఈ రౌండ్ వార్షిక ఇంక్రిమెంట్లు లేదా మెరిట్ జీతాల పెంపుదల (MSI) ప్రయోజనాలను దాదాపు 96 శాతం మంది ఉద్యోగులకుఅందించనుంది. (వాళ్లంతా అలా వచ్చినవారేగా! మూన్ లైటింగ్‌పై సంచలన వ్యాఖ్యలు) గత త్రైమాసికంలో ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, తాము గణనీయమైన విస్తృత కవరేజీని, మార్కెట్‌తో సమానంగా జీతం పెరుగుదలను అందిస్తున్నామని కంపెనీ హెచ్ఆర్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ ఇమెయిల్ ద్వారా తెలిపారు. రానున్న రోజుల్లో ఈ జీతం పెరుగుదలకు సంబంధించిన లేఖలను ఆయా ఉద్యోగులకు అందిస్తామని తెలిపారు. అలాగే జీతం పెరుగుదల పనితీరు అర్హత ప్రమాణాల ఆధారంగా 96 శాతం మంది ఉద్యోగులకు ప్రయోజనం లభిస్తుందని పేర్కొన్నారు. (మూన్‌లైటింగ్: 300 విప్రో ఉద్యోగులపై వేటు, ఐటీ ఉద్యోగుల్లో వణుకు) -
ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్!
ఐటీ ఉద్యోగులు బ్యాడ్ న్యూస్. ఐటీ ఉద్యోగులంటే వారి జీత భత్యాలు, ఆ తర్వాతే వారి కార్యకలాపాలు గుర్తుకు వస్తాయి. ఇప్పుడా ఆ విషయంలో ఐటీ సంస్థలు ఆచుతూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కంపెనీలు ఉద్యోగులకు భారీ ఎత్తున పెంచే ఇంక్రిమెంట్స్ వచ్చే ఏడాది తగ్గించనున్నట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారికి కారణంగా అన్నీ రంగాలు కుప్పకూలితే ఒక్క ఐటీ రంగం భారీ లాభాల్ని గడించాయి. రానున్న రోజుల్లో ఆ రంగం వృద్ధి బాగుంటుందని సంబరపడే లోపే ఆర్ధిక మాంద్యం, ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం, ది గ్రేట్ రిజిగ్నేషన్, రిటెన్షన్ వంశాలు ఆయా దిగ్గజ సంస్థల్ని కలవరానికి గురి చేస్తున్నాయి. ఈ తరుణంలో వచ్చే ఏడాది ఐటీ ఉద్యోగులు ఇంక్రిమెంట్లు 12శాతం నుంచి 9శాతానికి తగ్గి ప్రీ కోవిడ్ లెవల్స్ చేరుకుంటాయంటూ ప్రముఖ స్టాఫింగ్ సర్వీసెస్ అండ్ హెచ్ఆర్ రిక్రూట్మెంట్ సీఈవో సునీల్ చెమ్మన్ కోటిల్ తెలిపారు. గత కొన్ని నెలలుగా టెక్ సంస్థలు ఐటీ ఉద్యోగులకు 70శాతం నుంచి 80శాతం ఇంక్రిమెంట్స్ ఇచ్చాయి. కానీ వచ్చే ఏడాది ఈ పరిస్థితి మారనుంది. ఐటీ సర్వీస్‌లు అందించేందుకు స్టార్టప్స్ నుంచి దిగ్గజ కంపెనీలకు వరకు ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటితో పాటు రిటెన్షన్ సమయంలో ఉద్యోగులకు చెల్లించే వేతనాల్ని తగ్గించి..వారిని పూర్తి స్థాయిలో వినియోగించుకోనున్నాయి. ముఖ్యంగా యూఎస్, అమెరికా, యూరప్ దేశాల టెక్ సంస్థలు ప్రయత్నాల్లో ఉన్నాయి. వాటి ప్రభావం దేశీయ కంపెనీలు, ఉద్యోగులపై పండనుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు చదవండి👉 ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం,వరస్ట్ ఇయర్‌గా 2022 -
ఉద్యోగుల్ని ఊరిస్తున్న ఇంక్రిమెంట్లు..ఎంతపెరగనున్నాయంటే!!
ఈ ఏడాది దేశంలో పెరగనున్న ఉద్యోగుల జీతాలపై డెలాయిట్ టచ్ తోమట్సు ఇండియా Deloitte Touche Tohmatsu ఎల్ఎల్పీ (డీటీటీఐఎల్‌ఎల్‌పీ) స్పందించింది. 2021తో పోలిస్తే ఈ ఏడాది 92శాతంతో వేతనాలు పెరుగుతున్నట్లు తెలిపింది. ఇక గతేడాది పెరిగిన జీతాలు 8శాతం నుంచి 9.1శాతానికి పెరగనున్నట్లు అంచనా వేసింది. సర్వే ఫలితాల ప్రకారం, దాదాపు అన్ని సంస్థలు 2022లో ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాయి. 2020, 2021పెరిగిన జీతాలు 60శాతంతో పోలిస్తే 2022లో 92శాతం పెరగనున్నట్లు తెలిపింది. 2022లో పెరగనున్న 2021లో 8.0శాతం పోలిస్తే 9.1శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. 2022 అంచనా వేసిన ఇంక్రిమెంట్ 2019లో కోవిడ్-19కి ముందు పెరిగిన ఇంక్రిమెంట్ల కంటే 50 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) ఎక్కువగా ఉంది. స్టడీ వర్క్ ఫోర్స్ అండ్ ఇంక్రిమెంట్ ట్రెండ్స్ సర్వే -2022 మొదటి దశ అంచనా ప్రకారం 34శాతం సంస్థలు రెండంకెల సగటు ఇంక్రిమెంట్లను ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాయి. 2021లో 20శాతం ఉండగా..2020లో 12శాతం మాత్రమే ఉన్నాయి. లైఫ్ సైన్సెస్, ఐటీ రంగాలు 2022లో అత్యధిక ఇంక్రిమెంట్లను అందించే అవకాశం ఉంది. ఫిన్‌టెక్, ఐటీ-ఉత్పత్తి కంపెనీలు,డిజిటల్/ఇ-కామర్స్ సంస్థలు 2022లో రెండంకెల ఇంక్రిమెంట్లను ఇస్తాయని భావిస్తున్నారు. జూనియర్ మేనేజ్మెంట్లోని ఉద్యోగులు సగటున 2022లో రెండంకెల పెంపును అందుకోవచ్చని భావిస్తున్నారు. 92శాతం సంస్థలు వ్యక్తిగత పనితీరును బట్టి ఉద్యోగుల మధ్య ఇంక్రిమెంట్లను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది. పనితీరు బాగున్న ఉద్యోగులకు నామమాత్రంగా పని చేసే ఉద్యోగుల కంటే 1.7రెట్లు ఇంక్రిమెంట్ పొందవచ్చని భావిస్తున్నారు. పదోన్నతి పొందే ఉద్యోగుల శాతం 2021లో 11.7శాతం నుండి 2022లో 12.4శాతానికి పెరుగుతుందని, 2022లో పదోన్నతి పొందిన వారికి సగటు అదనపు ఇంక్రిమెంట్ 7.5శాతం ఉండనుంది. చదవండి: ప్రైవేట్ ఉద్యోగుల పంట పండింది!! భారీగా పెరగనున్న జీతాలు! -
‘ఉద్యోగులకు కార్ల కంపెనీలు బంపర్ ఆఫర్’
ముంబై: కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను నియంత్రించేందుకు అన్ని దేశాలు లాక్డౌన్లు ప్రకటించాయి. కానీ కార్ల తయారీ కంపెనీలు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లతో ఉద్యోగులను ఆశ్చర్యపరుస్తున్నాయి. టయోటా కిర్లోస్కర్, హుండాయ్ మోటార్ ఇండియా, మారుతీ సుజుకీ తదితర కంపెనీలు ఉద్యోగులకు భారీ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ప్రకటించాయి. లాక్‌డౌన్‌లోను హోండా, టయోటా తదితర కంపెనీలు 4నుంచి 14శాతం ఉద్యోగులకు వేతనాలు పెంపెను ప్రకటించాయి. వేతనాల పెంపుపై హుండాయి మోటార్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ స్టీఫన్ సుధాకర్ స్పందిస్తు.. తమ కంపెనీలో బ్లు కాలర్ ఉద్యోగులకు నైపుణ్యం ఆధారంగా ప్రమోషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. అయితే త్వరలోనే జూనియర్, మిడిల్(మధ్యస్థాయి), సీనియర్ లెవల్ ఉద్యోగులకు వేతనాల విషయంలో ప్రణాళిక రచిస్తున్నట్లు స్టీఫన్ సుధాకర్ తెలిపారు. కాగా ఎమ్జీ మోటార్ ఇండియా కంపెనీకి చెందిన రాజీవ్ చాబా స్పందిస్తు.. కంపెనీ వృద్ధి సాధారణ స్థాయికి వస్తే రాబోయే రెండు, మూడు నెలల్లో ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు మహీంద్ర చీప్ హెచ్ ఆర్ రాజేశ్వర్ తిరుపతి స్పందిస్తూ.. ప్రస్తుతం వేతన తగ్గంపు ఉండదని, సాధారణంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నట్లే ఈ సంవత్సరం కూడా ఉద్యోగులకు ప్రయోషన్లు, ఇంక్రిమెంట్లు కల్పించనున్నట్లు తెలిపారు. అయితే దేశంలో లాక్డౌన్ సడలించి రెండు నెలలు అయినందున ప్రముఖ కార్ల కంపెనీలు 85శాతం అమ్మకాలతో జోరుమీదున్నాయి. లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు తమ గ్రామాలకు వెళ్లడం వల్ల సిబ్బంది కొరత వేదిస్తున్నట్లు కార్ల కంపెనీ అధికారులు పేర్కొంటున్నారు -
వారికి భారీ ఊరట : వేతనాల పెంపు
సాక్షి, ముంబై : కరోనా సంక్షోభ కాలంలో కార్పొరేట్ దిగ్గజాలు సైతం ఉద్యోగాలు తీసివేత, వేతనాల్లోకోత లాంటి నిర్ణయాలు తీసుకుంటోంటే దేశీయ బహుళజాతి సంస్థ, ఆసియన్ పెయింట్స్ మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. కష్టకాలంలో తమ ఉద్యోగులకు మరింత భరోసా కల్పించాలనే ఉద్దేశంతో వేతనాల పెంపునకు నిర్ణయించింది. తద్వారా తమ సిబ్బందిలో ఆత్మస్థెర్యాన్ని నింపుతోంది. ప్రస్తుత త్రైమాసికంలో ఆదాయాలు చాలా బలహీనంగా ఉండనున్నాయని తెలుసు, అయినా జీతాల పెంపుతో ముందుకు సాగాలని ఎంచుకుంది. ఖర్చులను తగ్గించుకునేందుకు, ఉద్యోగులపై భారం కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుండటం విశేషం. (ఉచితంగా వెంటిలేటర్లు : ట్రంప్ కీలక ప్రకటన) లాక్డౌన్ అనిశ్చితి సమయంలో తమ ఉద్యోగుల మనోస్థైర్యాన్ని పెంచడానికి బోర్డు అంతటా ఈ సంవత్సరానికి ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని నిర్ణయించామని సంస్థ అధికారికంగా ప్రకటించింది. కోవిడ్-19 కారణంగా పలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఉద్యోగులను తొలగించలేం, వారిని కష్టపెట్టలేమని స్పష్టం చేసింది. ఉద్యోగులు, భాగస్వాములందరి బాగోగులు చూసుకొనే సంస్థగా నిజమైన నాయకత్వానికి ఉదాహరణగా నిలవాలని భావించామనీ, ఇందుకోసం చేపట్టిన చర్యలన్నింటినీ ఎప్పటికప్పుడు తమ బోర్డు డైరెక్టర్లతో సమీక్షించి, వారి ఆమోదం పొందామని ఆసియన్ పెయింట్స్ ఎండీ, సీఈవో అమిత్ సింగ్లే వెల్లడించారు. మొదటి త్రైమాసికంలో ఎలాంటి ఆశలు లేవనీ, నిజానికి క్యూ 1లో లాభాలు తుడిచిపెట్టుకుపోయాయని ఆయన చెప్పారు. అయితే చాలా సంవత్సరాలుగా రుణరహితంగా ఉన్న తమకి మరో నాలుగు నెలలు ఎలాంటి సమస్య ఉండబోదని తెలిపారు. (గుడ్ న్యూస్: జియో అదిరిపోయే ప్లాన్) తన వర్కింగ్ క్యాపిటల్ సైకిల్‌ను నిర్వహించడానికి అమ్మకందారుల నుంచి చెల్లింపులకు గడువు ఇచ్చింది. సంస్థకు చెల్లించాల్సిన చెల్లింపులపై 45 రోజుల గడువునిచ్చింది. ఒక వేళ ఈ45 రోజుల్లోపు చెల్లింపు చేస్తే 2 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఇంకా కంపెనీ తన కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి రూ.40 కోట్లు బదిలీ చేసింది ముఖ్యంగా ఉచితంగా పెయింట్ షాపుల శానిటైజేషన్, షాప్ అటెండెంట్స్, పెయింటర్లకు ఉచిత వైద్య బీమా సౌకర్యాలను కూడా కల్పించింది సంబంధిత వివరాలను గత వారం డీలర్లకు రాసిన లేఖలో ఆసియన్ పెయింట్స్ పేర్కొంది. కొవిడ్-19 సహాయ నిధులకు ఈ సంస్థ ఇప్పటికే రూ.35 కోట్ల విరాళమిచ్చింది. ఆసక్తికరంగా, ఆసియా పెయింట్స్ కరోనా పోరాటంలో భాగంగా శానిటైజర్లను తయారు చేయడం ప్రారంభించింది. -
చందాకొచర్ నుంచి రూ.9 కోట్లు వెనక్కి..!
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందాకొచర్ సుమారు రూ.9 కోట్లకు పైగా ఆర్థిక ప్రయోజనాలను కోల్పోనున్నారు. వీడియోకాన్ గ్రూపునకు రుణాల జారీలో కొచర్ బ్యాంకు నిబంధనలు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడినట్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ట కమిటీ నిర్ధారించిన నేపథ్యంలో, కొచర్‌ను తొలగించినట్టేనని, ఆమెకు గతంలో ఇచ్చిన బోనస్‌లు, పెండింగ్‌లో ఉన్నవి, ఇంక్రిమెంట్లు ఇతర ప్రయోజనాలను సైతం రద్దు చేస్తామని బ్యాంకు బుధవారమే ప్రకటించింది. బోనస్‌లతోపాటు అన్‌ఎక్సర్‌సైజ్డ్ స్టాక్ ఆప్షన్లను కూడా వదులుకోవాల్సి ఉంటుందని బ్యాంకు వర్గాలు తెలిపాయి. 2009 మే నెలలో ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా నియమితులైన కొచర్, తనపై ఆరోపణల కారణంగా గతేడాది పదవికి రాజీనామా చేశారు. గత రెండేళ్లకు సంబంధించి కొచర్‌కు ఇవ్వదలిచిన పనితీరు ఆధారిత బోనస్‌లకు ఆర్బీఐ ఆమోదం తెలియజేయలేదని, దీంతో ఈ బోనస్‌లను కొచర్‌కు ఇచ్చినట్టు పరిగణించబోమని బ్యాంకు వర్గాలు స్పష్టం చేశాయి. కాగా, కొచర్‌కు ఇప్పటిదాకా బ్యాంకు 94 లక్షల షేర్లను(స్టాక్ ఆప్షన్స్) బ్యాంకు మంజూరు చేసింది. వీటిలో ఎన్ని ఆమె వినియోగించుకున్నారనే సమాచారం లేదు. వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం చందాకొచర్‌కు ముట్టిన ఆర్థిక ప్రయోజనాలు రూ.340 కోట్ల మేర ఉంటాయని బ్యాంకు వర్గాల సమాచారం. -
వర్సిటీ కాంట్రాక్టు లెక్చరర్లకు భారీగా వేతనాలు
సాక్షి, హైదరాబాద్ : విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ లెక్చరర్ల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం స్థిరీకరించింది. వేతన స్థిరీకరణ, ఉద్యోగ భద్రత అంశంపై కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ లెక్చరర్లు కొన్నేళ్లుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. విధులు బహిష్కరించి దీర్ఘకాలిక సమ్మె సైతం చేపట్టారు. దీంతో స్పందించిన ఉన్నత విద్యాశాఖ.. గతేడాది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. విస్తృతంగా అధ్యయనం చేసిన ఆ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా.. తాజాగా వేతన స్థిరీకరణ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో దాదాపు 1,562 మంది కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నారు. వీరితోపాటు పలువురు పార్ట్‌టైమ్ లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. వారందరికీ సీనియారిటీ ప్రాతిపదికన వేర్వేరుగా గౌరవ వేతనాలను నిర్ణయించారు. కాంట్రాక్టు లెక్చరర్లకు గౌరవమిది: యూటీఏసీటీఎస్ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ అధ్యాపకుల వేతన పెంపుపై యూనివర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్ కాంట్రాక్ట్–తెలంగాణ స్టేట్ (యూటీఏసీటీఎస్) హర్షం ప్రకటించింది. వేతనాల పెంపుతో కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ అధ్యాపకుల గౌరవం పెరిగిందని పేర్కొంటూ.. అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఏ.పరశురామ్, బి.నిరంజన్ ఒక ప్రకటన విడుదల చేశారు. వేతనాలను స్థిరీకరించినందుకు సీఎం కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు. కాంట్రాక్టు అధ్యాపకులకు.. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నెట్, స్లెట్, పీహెచ్డీ లేదా ఎంటెక్, ఎంఈ, ఫార్మా(ఇంజనీరింగ్ స్ట్రీమ్) లేని అధ్యాపకులకు నెలకు రూ.21,600 ఇస్తుండగా.. ఈ వేతనాలను 75శాతం పెంచాలని ప్రత్యేక కమిటీ సిఫార్సు చేసింది. దీంతో వేతనం రూ.37,800కు పెరగనుంది. నెట్, స్లెట్, పీహెచ్డీ లేదా ఎంటెక్, ఎంఈ, ఫార్మా (ఇంజనీరింగ్ స్ట్రీమ్) అర్హత ఉన్న అధ్యాపకులకు ప్రస్తుతం నెలకు రూ.24,840 చొప్పున ఇస్తుండగా.. 75 శాతం పెంపుతో రూ.43,470 చొప్పున చెల్లిస్తారు. ఈ అర్హతలు ఉన్న/లేని లెక్చరర్లందరికీ కూడా అదనంగా సర్వీసు, సీనియారిటీ ఆధారంగా ఏడాదికి 3 శాతం చొప్పున పెంపు ఉంటుంది. అంటే అర్హతలు లేని వారికి ఏడాది సర్వీసుతో రూ.38,930 వేతనం అందుతుంది. అర్హతలున్న వారికి ఏడాది సర్వీసుతో రూ.44,700 వేతనం వస్తుంది. ఇలా ఏటా సీనియారిటీ పెరిగిన కొద్దీ వేతనం పెరుగుతుంది. ఇక అదనపు అర్హతలున్న అధ్యాపకులకు ఏటా ఒకసారి రూ.3 వేలు చొప్పున అందజేస్తారు. పార్ట్‌టైమ్ అధ్యాపకులకు.. ఇక ఉస్మానియా వర్సిటీలో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ అధ్యాపకుల్లో నెట్, సెట్, స్లెట్, పీహెచ్డీ లేదా ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మా లేనివారికి ప్రస్తుతం థియరీ క్లాసుకు రూ.475 చొప్పున, గంట పాటు ప్రాక్టికల్ క్లాసుకు రూ.220 చొప్పున గౌరవ వేతనంగా ఇస్తున్నారు. కమిటీ ప్రతిపాదనల మేరకు.. థియరీ క్లాసుకు రూ.600 చొప్పున, గంట ప్రాక్టికల్ క్లాసుకు రూ.300 చొప్పున ఇవ్వనున్నారు. అదే అర్హతలున్న పార్ట్‌టైమ్ అధ్యాపకులకు థియరీ క్లాసుకు రూ.700, గంట ప్రాక్టికల్ క్లాసుకు రూ.350 చొప్పున అందజేస్తారు. -
విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతాంగానికి 24 గంటలపాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందించడం మూడున్నరేళ్ల వయసున్న తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్భుత విజయమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభివర్ణించారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగాన్ని గట్టెక్కించి అన్ని రంగాలకు 24 గంటల నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేలా తీర్చిదిద్దిన ఘనత విద్యుత్ సంస్థల ఉద్యోగులకే దక్కుతుందని సీఎం కితాబునిచ్చారు. దేశమంతా తెలంగాణవైపు చూసే విధంగా విద్యుత్ రంగంలో విప్లవాత్మక విజయాలు సాధించారని అభినందించారు. తెలంగాణ రాష్ట్రానికి ఇంత గొప్ప ఖ్యాతిని సముపార్జించి పెట్టిన విద్యుత్ ఉద్యోగులకు అభినందనపూర్వకంగా ఈ నెల నుంచి వర్తించేలా ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణ ప్రజలంతా విద్యుత్‌శాఖ పనితీరుపట్ల తృప్తిగా, ఆనందంగా ఉన్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా అవుతున్న నేపథ్యంలో జెన్కో, ట్రాన్స్‌కో సంస్థల సీఎండీ డి.ప్రభాకర్‌రావు, ఇతర విద్యుత్ అధికారులతో సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ప్రభాకర్‌రావును ఆలింగనం చేసుకుని అభినందించారు. విద్యుత్ సంస్థల డైరెక్టర్లు, సీనియర్ ఉద్యోగులను పేరు పేరునా పలకరించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. విద్యుత్‌శాఖ ఉద్యోగులు రాష్ట్రంలోని రైతులతోపాటు అన్ని వర్గాల నూతన సంవత్సర ఆనందాన్ని రెట్టింపు చేశారని, అందుకోసం విద్యుత్ ఉద్యోగులకు నూతన సంవత్సర కానుకగా ఒక ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇస్తున్నట్లు విద్యుత్ అధికారుల హర్షధ్వానాల మధ్య íసీఎం ప్రకటించారు. ‘‘వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయడంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ అందిస్తున్న రాష్ట్రంగా చరిత్రలో నిలిచిపోతుంది. దశాబ్దాలపాటు రైతులు అనుభవించిన కరెంటు కష్టాలకు శాశ్వత విముక్తి కలిగించాలనే లక్ష్యంతో వ్యయ, ప్రయాసలకోడ్చి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించాలని నిర్ణయించాం. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇవ్వలేదు. అయినా రైతులకు అత్యంత అవసరమని భావించి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించాం. 2018 ఫిబ్రవరి లేదా మార్చి నుంచి 24 గంటల సరఫరా చేయాలని మొదట భావించినా జనవరి 1 నుంచే యాసంగి పంటలు చేసుకునేలా 24 గంటల సరఫరా ప్రారంభించడం సంతోషకరం. సాగుకు 24 గంటలపాటు ఉచితంగా కరెంటు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప దేశంలో మరేదీ లేదు. పక్కా ప్రణాళికతో, పకడ్బందీ కార్యాచరణతో ముందుకుపోవడం వల్లే ఈ విజయం సాధ్యమైంది.’’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సీఎంను కలసిన వారిలో టీఎస్ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, జెన్కో డైరెక్టర్లు అశోక్ కుమార్, వెంకటరాజం, లలిత్ కుమార్, టీఎస్ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ కమాలుద్దీన్ అలీఖాన్, ట్రాన్స్‌కో డైరెక్టర్ జి.నర్సింగ్‌రావు, పీజీసీఎల్ ఈడీ వి.శేఖర్, జీఎం ఎస్.రవి తదితరులున్నారు. సీఎం కేసీఆర్‌కు ట్రాన్స్‌కో సీఎండీ కృతజ్ఞతలు విద్యుత్‌శాఖ ఉద్యోగులందరికీ ఒక ప్రత్యేక ఇంక్రిమెంట్ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ నిర్ణయం విద్యుత్‌శాఖ ఉద్యోగుల్లో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపుతుందని, వారంతా రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి దార్శనికత, మార్గదర్శకంలో విద్యుత్ సంస్థలు రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని మెరుగుపరచగలిగాయన్నారు. -
'పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేస్తాం'
హైదరాబాద్: పంచాయతీ కార్యదర్శులకు త్వరలో పదోన్నతులు కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ ఎన్నికలు పూర్తయినందున ఇకపై పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడంపై దృష్టి సారిస్తానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ (టీపీఎస్ఏ) రూపొందించిన నూతన సంవత్సరం డైరీని మంత్రి కేటీఆర్ మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో పంచాయతీ కార్యదర్శులు కీలక భూమిక పోషిస్తున్నారని అభినందించారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు టి.ఇంక్రిమెంట్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు తమ సర్వీసు కాలంలో చివరిసారిగా పొం దిన దానికి సమానమైన ఇంక్రిమెంటును మంజూరు చేస్తూ రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో టీఎస్ ఆర్టీసీలో వివిధ దశల్లో పని చేస్తున్న 58,770 మంది అధికారులు, ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. -
రిటైర్డ పవర్
విశ్రాంత ఉద్యోగులా..మజాకా? అర్బన్ ఠాణాలో అడ్డా అవినీతికి నిలయంగా పోలీస్‌స్టేషన్ పైసలిస్తేనే ఫైళ్లకు మోక్షం వారంటే అధికారులకు హడల్ డీఎస్పీ స్థారుు వ్యక్తులకు కూడా ముచ్చెమటలు ఎస్పీ దృష్టిసారిస్తే మేలు మచ్చుతునక.. గీసుకొండ ఠాణాలో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్‌కు రైల్వేశాఖకు బదిలీ అరుుంది. ఇది ఇష్టం లేని సదరు కానిస్టేబుల్ రిటైర్డ్ ఉద్యోగులను ఆశ్రయించాడు. రూ.10 వేలు తీసుకుని పోస్టింగ్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. మరో స్టేషన్‌లోని కాని స్టేబుల్‌ను రైల్వేశాఖకు బదిలీ చేశారు. పోస్టుకో డిమాండ్.. ఇంక్రిమెంట్‌కు రూ.1000 నుంచి రూ.2 వేలు, పనిష్మెంట్ చార్జిషీట్‌కు రూ.5 వేల నుంచి రూ.10 వేలు, పేబి ల్స్‌కు రూ. 2వేల నుంచి రూ.5 వేలు, బదిలీల్లో పోస్టింగ్ డిమాండ్‌ను బట్టి డబ్బు వసూలు చేస్తున్నారు. వరంగల్ క్రైం : హన్మకొండ అర్బన్ పోలీసు కార్యాల యం విశ్రాంత ఉద్యోగులకు అడ్డాగా మారిం ది. అవినీతికి ఆలవాలంగా తయారైంది. వారు ఎంత చెబితే అంతే. బదిలీలు, ఇంక్రిమెంట్లు, పనిష్మెంట్, పేబిల్స్ కావాలన్నా వారి చేయి తడపాల్సిందే. వారు పదవీ విరమణ పొందినా తాత్కాలిక ఉద్యోగులు పవర్ చూపిస్తున్నారు. కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. జిల్లాలో ‘ఎవర్ విక్టోరియస్’గా ఉన్న పోలీసు సిబ్బందికి కూడా చుక్కలు చూపిస్తున్నారు. అటువంటి అవిశ్రాంత ఉద్యోగులపై కథనం.. ఠాణాలో 15 మంది.. వరంగల్ అర్బన్ పోలీసు కార్యాలయంలో రిటైర్డ్ ఉద్యోగులు సుమారు 15 మంది వరకు పనిచేస్తున్నారు. వీరికి గతంలో సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వంటి వివిధ హోదాల్లో పనిచేశారు. డ్రాఫ్టింట్ విభాగంలో వీరిది అందవేసిన చేరుు. నిబంధనల ప్రకారం ఈ పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేయూలి. అపార అనుభవంతో విశ్రాంత ఉద్యోగులు లాబీయింగ్ చేసి కీలక విభాగాల్లో అడ్డా వేశారు. వీరు రావడం అప్పట్లో వివాదాస్పదం అరుునప్పటికీ తర్వాత సద్దుమణగడంతో కొనసాగుతున్నారు. ప్రతీ పనికి పైకం అర్బన్ పోలీసు కార్యాలయంలోని కీలక విభాగాలైన బదిలీలు, ఇంక్రిమెంట్లు, పనిష్మెంట్, పేబిల్స్ పనికోసం వీరు నియమితులయ్యారు. ఇవి సిబ్బందికి సర్వీసు పరంగా కీలకంగా నిలుస్తాయి. వీటిలో ప్రతీ ఉద్యోగి రిమార్కులు లేకుండా చూసుకోవాలని చూస్తారు. దీనిని ఆసరా చేసుకుని రిటైర్డ్ ఉద్యోగులు పైలసివ్వనిదే పనిచేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. 65 నుంచి 70 ఏళ్ల వయసు ఉండి.. నెలకు రూ.40 వేల వరకు పింఛన్ తీసుకుంటున్న ఈ రిటైర్డ్ ఉద్యోగులు కానిస్టేబుల్ స్థాయి నుంచి హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై, సీఐ, డీఎస్పీ వ్యక్తులు పని కావాలంటే చేరుు తడపాల్సిందే. కాగా, జిల్లాలోని వివిధ ఠాణాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఈ పోలీసు కార్యాలయూనికి వచ్చే సరికి రక్షణ లేకుండా పోతుంది. ఎస్సై, సీఐ ఇంక్రిమెంట్లు, జీపీఎఫ్ చెల్లింపులలో చేతివాటం ప్రదర్శిస్తూ పోలీసు శాఖను అవినీతికి చిరునామాగా మారారనే విమర్శలు వ్యక్తమవుతున్నారుు. ఇప్పటికైనా అర్బన్ కార్యాలయంలో నెలకొన్ని అవినీతిని ప్రక్షాళన చేయాల్సిన అవరసం ఎస్పీ అంబర్ కిషోర్ఝాపై ఉందని సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. -
ఎన్డీఎస్ఎల్లో సమ్మెకు సిద్ధం
బోధన్ : కార్మికుల వేతన సవరణ మూడేళ్లకొకసారి జరుగుతోంది. ఎన్డీఎస్ఎల్లో 2010లో వేతన సవరణ జరుగగా, 2013 సెప్టెంబర్ 30తో ముగిసింది. 2013 అక్టోబర్1 నుంచి కొత్త వేతన సవరణ జరుగాల్సి ఉండగా, ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉంది. 2013-14 క్రషింగ్ సీజన్ ప్రారంభంలో కార్మిక సంఘాలు 2013 నవంబర్18న ఫ్యాక్టరీ అధికారులకు వేతన సవరణ చేపట్టాలని సమ్మె నోటీసు ఇచ్చాయి. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించక పోవడంతో అప్పట్లో చర్చలు సఫలం కాలేదు. సమ్మె వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటామని రైతులు కోరగా కార్మిక సంఘాలు వెనక్కు తగ్గాయి. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ యాజమాన్యం క్రషింగ్ సీజన్ ముగియగానే వేతన సవరణ పై చర్చలు జరుపుతామని, వేతన సవరణకు చర్యలు తీసుకుంటామని రాత పూర్వకంగా హామీ ఇచ్చిందని కార్మిక సంఘాల ప్రతినిధులు అంటున్నారు. కాగా ఆ తర్వాత వేతన సవరణ అంశం మూలపడింది. ఫ్యాక్టరీ యాజమాన్యం పట్టించుకోలేదు. కార్మిక సంఘాలు కార్మిక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం దక్కలేదు. ఎన్డీఎస్ఎల్లో 125 మంది వరకు పర్మినెంట్ కార్మికులు, సీజనల్ పర్మినెంట్ కార్మికులు 60 మంది వరకు ఉంటారు. పర్మినెంట్ కార్మికులకు నెలకు రూ. 15 వేల నుంచి రూ. 16 వేల వరకు వేతనం ఉంటుంది. దీనిపై 50 శాతం పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వీరి డిమాండ్‌ను ఫ్యాక్టరీ యాజమాన్యం అంగీకరించే స్థితిలో లేదు. ప్రస్తుతం ఫ్యాక్టరీ యాజమాన్యం వేతన సవరణకు సానుకూలతతో లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. గత్యంతరం లేని పరిస్థితిలో సమ్మె నోటీసు ఇచ్చామంటున్నారు. వేతన సవరణతో పాటు 15 శాతం హెచ్ఆర్ఏ పెంచాలని, ఇంక్రిమెంట్‌ను కనీసం రూ. 500 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వేతన సవరణ ఒప్పందం ముగిసి ఏడాది పైగా కావస్తున్నా ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించడం లేదని కార్మిక సంఘాలు మండి పడుతున్నాయి. 2014-15 క్రషింగ్ ప్రారంభానికి ఫ్యాక్టరీ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంలో యాజమాన్యంపై ఒత్తిడి పెంచి వేతన సవరణ సాధించుకోవాలని కార్మిక సంఘాలు సమ్మె యోచనలో ఉన్నాయి. ఈ మేరకు ఎన్డీఎస్ఎల్ కార్మిక సంఘాలు శుక్రవారం యాజమాన్యానికి సమ్మె నోటీసు అందించాయి. వేతన సవరణతో పాటు మరో 40 డిమాండ్ల పరిష్కరించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఎన్డీఎస్ఎల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ),ఎన్డీఎస్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్(బీఎంఎస్) సుగర్‌ఫ్యాక్టరీ మజ్దూర్ సభ ప్రతినిధులు ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ జానకీ మనోహర్‌కు సమ్మె నోటీసు అందించారు. డిసెంబర్ 5 లోపు వేతన సవరణతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరించక పోతే సమ్మె చేపడుతామని హెచ్చరించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. కార్మికుల బతుకులు దయనీయం ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని 2002 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 51 శాతం ప్రైవేట్, 49 శాతం ప్రభుత్వ వాటాలతో ప్రైవేటీకరించారు. రూ. 350 కోట్ల నిజాంషుగర్స్‌ను ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. ఫ్యాక్టరీ ప్రైవేట్ సంస్థ గుప్పెట్లోకి వెళ్లిన తర్వాత వీఆర్ఎస్ పేరుతో వందలాది మంది కార్మికులు తొలగించబడ్డారు. ప్రస్తుతం పని చేస్తున్న కార్మికుల బతుకులు దయనీయంగా మారాయి. ఇటు కార్మికులు,అటు రైతులు ఇబ్బందుల పాలైయ్యారు. ఫ్యాక్టరీ యాజమాన్యం సానుకూలంగా స్పందించాలి ఫ్యాక్టరీ యాజమాన్యం వేతన సవరణ, ఇతర డిమాండల పై సానుకూలంగా స్పందించాలని సీఐటీయూ అనుబంధ ఎన్డీఎస్ఎల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కుమార్ స్వామి డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం యాజమాన్యం బాధ్యతని అన్నారు. యాజమాన్యం దిగిరాకపోతే సమ్మెకు చేపడుతామని తెలిపారు. మీడియాను అనుమతించని ఫ్యాక్టరీ అధికారులు. కార్మిక సంఘాల ప్రతినిధులు సమ్మెనోటీసు ఇచ్చేందుకు ఫ్యాక్టరీ లోపలికి వెళ్లగా, ఈవిషయం తెలుసుకుని మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లారు. ఫ్యాక్టరీ లోపలికి మీడియాను అనుమతించ లేదు. -
సింగరేణి కార్మికుల ఆశలు...
కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక తమ కలలు సాకారమవుతాయని, వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తారని సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి వారి ఆశలు రెట్టింపయ్యాయి. సీఎం ఎప్పుడు సానుకూల నిర్ణయం తీసుకుంటారోనని ఎదురుచూస్తున్నారు. రెండు, మూడేళ్లలో ఉద్యోగ విరమణ పొందే కార్మికులు 12వేల నుంచి 15వేల వరకు ఉంటారు. వీరంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్.. సింగరేణిలో పర్యటించిన ప్రతీసారి కార్మికుల కలలను నెరవేర్చుతానని హామీ ఇస్తూ వచ్చారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి అన్నట్టుగానే అమలు చేశారు. లాభాల్లో వాటాశాతాన్ని పెంచేలా చర్యలు చేపట్టారు. అలాగే వారసత్వ ఉద్యోగాలను ఇప్పిస్తామని భరోసా ఇచ్చిన కేసీఆర్... ఆ హామీని నెరవేర్చాలని కార్మికులు కోరుతున్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ కూడా ఈ అంశంపైనే కార్మికులకు మాటిచ్చిందని, ఆ మేరకు ఇటు ప్రభుత్వం, అటు సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చి కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వెక్కిరిస్తున్న ఖాళీలు సింగరేణిలో ఇప్పటివరకు ఏర్పడిన ఉద్యోగ ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. కంపెనీలో 35 భూ గర్భ గనులు, 15 ఓసీపీలు ఉన్నాయి. 62 వేల పైచిలుకు కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో 55 ఏళ్ల వయసు ఉన్నవారు 70 శాతం మంది ఉంటారు. దీనికి తోడు ఇతర కేటగిరీల్లో ఇప్పటికే ఖాళీలు ఉన్నాయి. మైనింగ్ స్టాఫ్ నుంచి మొదలు కొని ట్రేడ్స్‌మెన్ వరకు కొరత తీవ్రం గా ఉంది. సూపర్వైజర్ సిబ్బంది పోస్టులే 1,500 వరకు ఖాళీ ఉన్నాయి. క్లర్కులు, ఆఫీస్ బాయ్‌లు కూడా సరిపడా లేరు. ఈ క్రమంలో వారసత్వ ఉద్యోగ హక్కును పునరుద్ధరిస్తే, ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా కార్మిక కుటుంబాలకు ఆధారం లభించినట్లవుతుందనే చర్చ సాగుతోంది. -
సర్వే డ్యూటీకి రాకుంటే ఇంక్రిమెంట్ నిలిపివేస్తాం
హన్మకొండ అర్బన్:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర సర్వే విధులపై నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్న ఉద్యోగులపై జిల్లా కలెక్టర్ జి.కిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు కేటాయించిన ఎన్యూమరేటర్లు సర్వేకు సంబంధించిన శిక్షణకు గానీ, విధులకు గానీ రాకపోతే సదరు ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ నిలిపివేసేవిధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్వే పనులు, శిక్షణ కార్యక్రమాలపై శనివారం రాత్రి కలెక్టరేట్లో సమీక్షించారు. ఇటీవల నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలకు సుమారు 2వేల మంది ఉద్యోగులు హాజరుకాకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శిక్షణకు రానివారు, కొత్తగా సమాచారం అందుకున్న ప్రైవేటు ఉద్యోగులు ఆదివారం(17న) ఉదయం కలెక్టరేట్లో రిపోర్ట్ చేయాలని చెప్పారు. సిబ్బంది కొరత కారణంగా ప్రైవేటు ఇంజనీరింగ్, జూనియర్ కళాశాలల సిబ్బంది, పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సిబ్బంది, ఎన్ఐటీ, సీకేఎం కళాశాల సిబ్బందిని సర్వే విధులకు ఎంపిక చే స్తున్నామని, వీరికి శిక్షణ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జేసీ పౌసుమిబసు, నగర కమిషనర్ పాండాదాస్, డీఆర్వో సురేందర్‌కరణ్, సీపీవో బీఎన్‌రావు, ఈడీవో విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
టి. ఇంక్రిమెంట్ ప్రత్యేకం..!
రూ.300 నుంచి రూ.1000 వరకు చెల్లింపు 2010 పే స్కేలు ఆధారంగా.. వర్తింపు నాలుగు లక్షల మంది ఉద్యోగులకు లాభం హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చే ఇంక్రిమెంట్.. మూలవేతనంలో విలీనం చేయకుండా ప్రత్యేకంగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంక్రిమెంట్‌ను మూలవేతనంలో విలీనం చేస్తే.. దాన్ని మరిచిపోతారని, వారికి నెలనెలా వచ్చే వేతన స్లిప్పుల్లో.. తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్ ఉండేలా చూస్తారు. ఈ ఇంక్రిమెంట్‌తో డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ వంటి అలవెన్సులు పొందడానికి అవకాశం లేదని, అలాగే వేతన సవరణ ఒప్పందం జరిగినప్పుడు, ఈ ఇంక్రిమెంట్లో పెరుగుదల ఉండదని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉద్యోగులు పదవీ విరమణ చేసే వరకు వారి పే స్లిప్పుల్లో ప్రతీనెలా తెలంగాణ ఇంక్రిమెంట్ (ప్రస్తుతం నిర్ణయించిన మేరకు మాత్రమే) వస్తుంది. ప్రత్యేక ఇంక్రిమెంట్‌తో నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు లబ్దిచేకూరనుంది. తెలంగాణ కోసం ఉద్యోగ సంఘాలు చేసిన సుదీర్ఘ సమ్మెను ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి జారీచేసిన ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. ఉద్యోగ సంఘాల పోరాటానికి గుర్తింపుగా ప్రత్యేక ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందనివివరించారు. ఉద్యోగులు తాజాగా పొందిన ఇంక్రిమెంట్‌తో సమానంగా తెలంగాణ ఇంక్రిమెంట్ ఉంటుందన్నారు. 2010 వేతన సవరణ ఒప్పందం ద్వారా రెగ్యులర్ వేతనం పొందే వారికి ఇది వర్తిస్తుంది. స్థానిక సంస్థలు, మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, ఎయిడెడ్ సంస్థలు, వర్క్చార్జ్డ్ ఉద్యోగులు, యూనివర్సిటీల్లో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతరులకు కూడా వర్తిస్తుందన్నారు. శాశ్వతంగా తెలంగాణకు కేటాయించే ఉద్యోగులకు కూడా.. వారు తెలంగాణ ప్రభుత్వంలో రిపోర్టు చేసే తేదీ నుంచి వర్తింప చేస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఇంక్రిమెంట్ మొత్తం శాశ్వతమని, ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు. తెలంగాణ ఇంక్రిమెంట్‌ను పెన్షన్ నిర్ణయంలో పరిగణలోకి తీసుకోరని, ఆగస్టు వేతనం నుంచి ఈ ఇంక్రిమెంట్ అమలులోకి వస్తుందని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి స్పష్టం చేశారు. కాగా, ఈ ఇంక్రిమెంట్‌తో దిగువ స్థాయిలోని ఉద్యోగులకు నెలకు రూ. 300, ఉన్నతస్థాయిలోని ఉద్యోగులకు నెలకు రూ.వెయ్యి వరకు అదనంగా వేతనంతోపాటు లభించనున్నట్లు తెలిసింది. ఈ ఇంక్రిమెంట్ కోసం ప్రతీనెలా రూ. 15 కోట్లు వ్యయం అవుతుందని, ఏటా రూ. 180 కోట్లు భారం పడుతుందని అధికారవర్గాలు వివరించాయి. -
తెలంగాణ ఉద్యోగులకు ఇంక్రిమెంట్
-
తెలంగాణ ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్లు
వచ్చేది ఉద్యోగమిత్ర ప్రభుత్వం: కేసీఆర్ ‘ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఇక ఏ శక్తీ అడ్డుకోలేదు... నూటికి నూరుశాతం తెలంగాణ కల సాకారమైతది...ఫోర్త్‌క్లాస్ ఎంప్లాయూస్ నుంచి ఐఏఎస్ వరకు అందరం కలిసి పిడికెలెత్తినం.. కాబట్టే కేంద్రం దిగి వస్తుంది’ అని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం హన్మకొండలో జరిగిన టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి కుమార్తె వివాహానికి ఆయన హాజరయ్యూరు. అనంతరం తనను సన్మానించిన ఉద్యోగ సంఘాల నాయకులతో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఈ ప్రాంత ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి స్కేల్ ఇప్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఉద్యమంలో మాదిరిగానే తెలంగాణ వచ్చిన తర్వాత పునర్నిర్మాణంలో కూడా భాగస్వాములు కావాలని వారిని కోరారు. టీఎన్జీవోల ఉద్యమానికి నిజాం కాలం నుంచి పనిచేస్తున్న చరిత్ర ఉందని చెప్పారు. 1969లోనే తెలంగాణ కోసం సువర్ణాక్షరాలతో లిఖించదగిన పాత్ర నిర్వహించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమవుతుందని 2001లో టీఆర్ఎస్ను ఏర్పాటు చేసిన రోజే స్పష్టం చేశానన్నారు. ప్రారంభం నుంచి పట్టు విడవకుండా లక్ష్యం చేరేవరకు భర్తృహరి చెప్పిన ప్రకారం ముందుకు సాగామంటూ శ్లోకాన్ని వినిపించారు. ఉద్యోగ మిత్ర ప్రభుత్వం రానుందని అన్నారు. పార్టీలు, పాలసీలు ఏవైనా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఆ ఫలాలు అందించేది ఉద్యోగులేననే విషయం గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ పచ్చ బడాలె.. పరిశ్రమలు అభివృద్ధి చెందాలె.. నిరుద్యోగ భూతాన్ని పారదోలాలే.. ఇదంతా సాగాలంటే కలిసి పనిచేయాల్సి ఉంటుందని ‘నవ్వెటోని ముందు జారి పడొద్దం’టూ కేసీఆర్ హెచ్చరించారు. ఉద్యోగుల హౌసింగ్, క్వార్టర్ల నిర్మాణం తదితర అవసరాలను తీర్చే పథకానికి రూపకల్పన చేయాల్సి ఉందని తెలిపారు. తొలి నుంచి అన్ని విధాలుగా తనకు సహకారం అందించిన ఉద్యోగులకు తలవంచి నమస్కరిస్తున్నానని, జన్మంతా వారికి రుణపడి ఉంటానని చెప్పారు. అంతకుముందు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు కొలా రాజేష్ గౌడ్, హుస్సేన్ తదితరులు కేసీఆర్‌కు తలపాగా పెట్టి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు పేర్వారం రాములు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, జిల్లా ఇన్చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తక్కెళ్ళపల్లి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ నిరంతర సమీక్ష అసెంబ్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలతో టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఎప్పటికప్పుడు సమీక్షించారు. వరంగల్‌లో శుక్రవారం జరిగిన పార్టీ నేత కడియం శ్రీహరి కుమార్తె వివాహానికి హాజరైన కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, కె.తారక రామారావు, టి.హరీష్‌రావుతో ఎప్పటికప్పుడు ఫోనులో మాట్లాడారు. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వచ్చిందా, రాకుంటే ఎవరిని కలిసి ఒత్తిడి చేయాలి, అధికారపార్టీతో పాటు మిగిలిన పార్టీల్లోని తెలంగాణ ఎమ్మెల్యేలతో సమన్వయం వంటివాటిపై ఎప్పటికప్పుడు సమీక్షించారు. మధ్యాహ్నానికీ రాకపోవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ఇవ్వాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సూచించారు. కేసీఆర్ సూచనల మేరకే సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసును స్పీకర్‌కు అందించారు. కడియం శ్రీహరి కుమార్తె వివాహానికి పార్టీ అధినేతగా హాజరు అవుతున్నందున ఎమ్మెల్యేలు హాజరుకాకపోయినా ఫర్వాలేదని, శాసనసభలో ముఖ్యమైన రోజు కాబట్టి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా హాజరుకావాలని గట్టిగా సూచించారు.