సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతాంగానికి 24 గంటలపాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందించడం మూడున్నరేళ్ల వయసున్న తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్భుత విజయమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభివర్ణించారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగాన్ని గట్టెక్కించి అన్ని రంగాలకు 24 గంటల నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేలా తీర్చిదిద్దిన ఘనత విద్యుత్ సంస్థల ఉద్యోగులకే దక్కుతుందని సీఎం కితాబునిచ్చారు.
దేశమంతా తెలంగాణవైపు చూసే విధంగా విద్యుత్ రంగంలో విప్లవాత్మక విజయాలు సాధించారని అభినందించారు. తెలంగాణ రాష్ట్రానికి ఇంత గొప్ప ఖ్యాతిని సముపార్జించి పెట్టిన విద్యుత్ ఉద్యోగులకు అభినందనపూర్వకంగా ఈ నెల నుంచి వర్తించేలా ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణ ప్రజలంతా విద్యుత్‌శాఖ పనితీరుపట్ల తృప్తిగా, ఆనందంగా ఉన్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా అవుతున్న నేపథ్యంలో జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థల సీఎండీ డి.ప్రభాకర్‌రావు, ఇతర విద్యుత్ అధికారులతో సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు.
ప్రభాకర్‌రావును ఆలింగనం చేసుకుని అభినందించారు. విద్యుత్ సంస్థల డైరెక్టర్లు, సీనియర్ ఉద్యోగులను పేరు పేరునా పలకరించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. విద్యుత్‌శాఖ ఉద్యోగులు రాష్ట్రంలోని రైతులతోపాటు అన్ని వర్గాల నూతన సంవత్సర ఆనందాన్ని రెట్టింపు చేశారని, అందుకోసం విద్యుత్ ఉద్యోగులకు నూతన సంవత్సర కానుకగా ఒక ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇస్తున్నట్లు విద్యుత్ అధికారుల హర్షధ్వానాల మధ్య íసీఎం ప్రకటించారు. ‘‘వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయడంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ అందిస్తున్న రాష్ట్రంగా చరిత్రలో నిలిచిపోతుంది.
దశాబ్దాలపాటు రైతులు అనుభవించిన కరెంటు కష్టాలకు శాశ్వత విముక్తి కలిగించాలనే లక్ష్యంతో వ్యయ, ప్రయాసలకోడ్చి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించాలని నిర్ణయించాం. టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇవ్వలేదు. అయినా రైతులకు అత్యంత అవసరమని భావించి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించాం. 2018 ఫిబ్రవరి లేదా మార్చి నుంచి 24 గంటల సరఫరా చేయాలని మొదట భావించినా జనవరి 1 నుంచే యాసంగి పంటలు చేసుకునేలా 24 గంటల సరఫరా ప్రారంభించడం సంతోషకరం.
సాగుకు 24 గంటలపాటు ఉచితంగా కరెంటు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప దేశంలో మరేదీ లేదు. పక్కా ప్రణాళికతో, పకడ్బందీ కార్యాచరణతో ముందుకుపోవడం వల్లే ఈ విజయం సాధ్యమైంది.’’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సీఎంను కలసిన వారిలో టీఎస్‌ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్, టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, జెన్‌కో డైరెక్టర్లు అశోక్ కుమార్, వెంకటరాజం, లలిత్ కుమార్, టీఎస్‌ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ కమాలుద్దీన్ అలీఖాన్, ట్రాన్స్‌కో డైరెక్టర్ జి.నర్సింగ్‌రావు, పీజీసీఎల్ ఈడీ వి.శేఖర్, జీఎం ఎస్.రవి తదితరులున్నారు.
సీఎం కేసీఆర్‌కు ట్రాన్స్‌కో సీఎండీ కృతజ్ఞతలు
విద్యుత్‌శాఖ ఉద్యోగులందరికీ ఒక ప్రత్యేక ఇంక్రిమెంట్ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ నిర్ణయం విద్యుత్‌శాఖ ఉద్యోగుల్లో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపుతుందని, వారంతా రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి దార్శనికత, మార్గదర్శకంలో విద్యుత్ సంస్థలు రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని మెరుగుపరచగలిగాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment