అధిక ఫీజుల వసూళ్లకు కళ్లెం
ఖమ్మం : ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లకు కళ్లెం వేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి రవీంద్రనాథ్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని పట్టణ, రూరల్ పరిధిలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలు ఏ తరగతికి ఎంత ఫీజు వసూలు చేయాలి అనే వివరాలను వెల్లడించారు. పాఠశాలల్లో కల్పించాల్సిన మౌలిక వసతులు, ఇతర వివరాలను పాటించడంతోపాటు ప్రభుత్వ నిబంధనల మేరకే ఫీజులు వసూలు చేయాలని ఆదేశించారు.
దీంతో కేజీ నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల వద్ద నుంచి వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్న పలు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు కళ్లెం పడనుంది. అడ్డూ అదుపు లేకుండా వసూలు చేస్తున్న ఫీజులను అరికట్టాలని విద్యార్థి, యువజన సంఘాలు డీఈవోకు వినతిపత్రాలు ఇవ్వడం, ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం విదితమే. దీనిపై స్పందించిన డీఈవో ఈ విషయాన్ని రాష్ట్ర అధికారులు, జిల్లా కలెక్టర్‌తో చర్చించి ప్రభుత్వ నిబంధనల మేరకు పాఠశాలల ఫీజుల వివరాలను ప్రకటించారు.
అభ్యంతరాలపై డీఎఫ్‌ఆర్‌సీకి నివేదించవచ్చు..
జిల్లాలో ప్రకటించిన ప్రైవేట్ పాఠశాలల ఫీజుల వసూళ్లపై అభ్యంతరాలు ఉంటే జిల్లా ఫీజు రెగ్యులేటరీ కమిటీ ద్వారా నివేదిక పంపించవచ్చునని డీఈవో పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఫీజులు పెంచే అవకాశం ఉంటుందన్నారు. దీనిపై జీఎఫ్‌ఆర్‌సీ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు.
డీఎఫ్‌ఆర్‌సీలో జిల్లా కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా విద్యాశాఖాధికారి కన్వీనర్‌గా, జిల్లా ఆడిట్ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి, డిప్యూటీ విద్యాశాఖాధికారులు సభ్యులుగా ఉంటారని వివరించారు. ప్రతి పాఠశాలలో ఫీజుల వసూలు వివరాలను డిస్‌ప్లే చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.