► కొడుకు హత్యకేసులో నిందితుడిని హతమార్చిన తండ్రి
► జైలు నుంచి వచ్చిన మూడు నెలలకే మట్టుపెట్టిన ప్రత్యర్థి
► తల్లి నెలమాసికానికి వచ్చి చిక్కిన వైనం
కరీంనగర్: నక్సలైట్లు, పోలీసుల తనిఖీలు, ఎన్‌కౌంటర్లతో ఒకప్పుడు అట్టుడికిన అటవీ గ్రామాల్లో ఫ్యాక్షన్‌ను తలపించేలా మంగళవారం ప్రతీకార హత్య జరిగింది. తన కొడుకును హత్య చేశాడనే కారణంలో హత్య కేసులో నిందితుడైన యువకుడిని తండ్రి దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటనతో పల్లెలన్నీ ఉలిక్కిపడ్డాయి.
సిరిసిల్ల రూరల్ సీఐ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం..మద్దిమల్లకు చెందిన సంతోష్, వీర్నపల్లికి చెందిన పిట్ల గిరిబాబు మంచి స్నేహితులు. గతంలో ఇద్దరు కలిసి అనేక మందితో వివాహేతర సంబంధాలు నెరిపారు. ఈ క్రమంలో డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో కక్ష పెంచుకున్న సంతోష్ సిద్దిపేట, సిరిసిల్లకు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలిసి సిరిసిల్ల మానేరు వాగులో ఈ ఏడాది జనవరి 4న గిరిబాబు(24)ను హత్య చేశాడు. జనవరి 27న పోలీసులు నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.
దీంతో సంతోష్‌పై గిరిబాబు తండ్రి అంజయ్య కక్ష పెంచుకున్నాడు. రెండునెలలు జైల్లో ఉన్న సంతోష్ మూడు నెలల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చాడు. సిరిసిల్లలో కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే నెలరోజులక్రితం సంతోష్ తల్లి లచ్చవ్వ అనారోగ్యంతో చనిపోయింది. దీంతో స్వగ్రామానికి వచ్చాడు. అప్పుడు సంతోష్‌ను హతమార్చేందుకు అంజయ్య రెండుసార్లు విఫలయత్నం చేశాడు. సోమవారం తల్లి నెలమాసికం ఉండడంతో మద్దిమల్లకు వచ్చిన సంతోష్ రాత్రి కుటుంబసభ్యులతో ఇంట్లోనే ఉన్నాడు. 12:30 గంటల సమయంలో అంజయ్య, అతడి వియ్యంకుడు అబ్బనవేని శంకర్‌తో మద్దిమల్లకు వచ్చాడు. సంతోష్‌ను బయటకు తీసుకెళ్తుండగా కుటుంబసభ్యులు అడ్డుకున్నారు.
వారిని బెదిరించి సంతోష్‌ను మద్దిమల్ల-కంచర్ల శివారులోని వెంకట్రాయిని చెరువు వద్దకు తీసుకెళ్లారు. బట్టలు ఊడదీసిగొడ్డళ్లతో నరికి, బండరాళ్లతో మోది, కర్రలతో కొట్టి హత్యచేశారు. మంగళవారం వేకువ జామున మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న బంధువులు సిరిసిల్లకు వెళ్లాలని సూచించినా ఇక్కడే ఉండి హత్యకు గురయ్యాడని రోదించారు. సంతోష్‌కు భార్య సుమలత, మూడునెలల కుమారుడు అశ్విక్, తండ్రి నర్సయ్య ఉన్నారు. నిందితులు పోలీసులకు లొంగిపోయారు. సుమలత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్, ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.
కరీంనగర్లో ప్రతీకార హత్య
Published Wed, Jun 29 2016 9:52 AM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM
Advertisement