మేం చేసిన అవినీతి ఆరోపణలకు బదులివ్వలేక, అసెంబ్లీలో ప్రభుత్వ అవినీతి బాగోతాన్ని బయటపెడతామని భయపడి మా పార్టీ సభ్యులను సాకులతో సభ నుంచి సస్పెండ్ చేశారు. మైహోం ప్రాపర్టీస్ అధినేత రామేశ్వరరావుకు గచ్చిబౌలిలోని మెట్రో భూములను ప్రభుత్వం అక్రమంగా కేటాయించింది. దీనివల్ల ఖజానాకు అధికారికంగా రూ.300 కోట్లు, అనధికారికంగా రూ.1,000 కోట్లదాకా నష్టం వాటిల్లింది. దీనిపై నావద్ద పూర్తి ఆధారాలున్నాయి. నన్ను సభకు అనుమతిస్తే వాటిని సభముందు పెడతా. మమ్మల్ని సస్పెండ్ చేసినందున మెట్రో భూముల కేటాయింపు కుంభకోణంపై పూర్తి ఆధారాలను ఎంఐఎం, కాంగ్రెస్ సభ్యులకు అందజేసి, సభలో చర్చకు పట్టుబట్టాల్సిందిగా కోరా. నేను రామేశ్వరరావుకు అమ్ముడుపోయానని దుష్ర్పచారం చేస్తున్నారు. నా చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు.
- రేవంత్‌రెడ్డి, టీడీపీ
కాంగ్రెస్ తీరు దారుణం
టీఆర్‌ఎస్, కాంగ్రెస్ స్వప్రయోజనాల కోసం సభా సమయాన్ని వృథా చేస్తున్నాయి. క్వశ్చన్ అవర్ కాంగ్రెస్సే అడ్డుపడింది. కీలకమైన ఎస్టీల రిజర్వేషన్లపై ప్రశ్నించేందుకు కూడా అవకాశం లేకుండా చేశారు. సొంత పార్టీ సభ్యుల వలసలను అడ్డుకోలేక సభలో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ తీరును ఖండిస్తున్నాం.
- తాటి వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష నేత
పింఛన్‌దార్లను తగ్గిస్తున్నారేం?
ఆసరా పథకానికి 40 లక్షలమందికి పైగా దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం వాటిని 20 లక్షలకు కుదించింది. హైదరాబాద్‌లో నాలుగు లక్షల మంది పింఛన్లు కోరుకుంటే 82 వేల మందే అర్హులని తేల్చింది. అంటే హైదరాబాద్‌లో పేదల్లేరా? లబ్ధిదారులను ఎందుకు తగ్గిస్తున్నారో సభలో చర్చించాలి.
- బీజేపీ శాసనసభాపక్ష నేత కె.లక్ష్మణ్
అప్పుడు గుర్తు లేదా?
కాంగ్రెస్ నేతల తీరు దెయ్యాలు, వేదాలు వల్లించినట్టుంది. ఎన్నికలకు ముందు విజయశాంతి, అరవిందరావును పార్టీలోకి చేర్చుకున్నప్పుడు కాంగ్రెస్ నేతలకు రాజ్యాంగం గుర్తురాలేదా?.
- శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్