
పీసీసీ కొత్త కార్యవర్గం ప్రకటన వాయిదా
మీనాక్షి వచ్చిన తర్వాతే తుది జాబితా ఖరారు
లీకైన పీసీసీ ఉపాధ్యక్షుల జాబితా
ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే అధిక పదవులు
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ కార్యవర్గ ప్రకటన తాత్కాలికంగా వాయిదా పడినట్లు తెలిసింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా తమిళనాడుకు చెందిన సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ నియమితులైన నేపథ్యంలో ఆమె రాష్ట్రానికి వచ్చి బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ఈ ప్రకటన ఉంటుందని గాంధీభవన్ వర్గాల సమాచారం.
వాస్తవానికి పీసీసీ కార్యవర్గాన్ని ఇప్పటికే ప్రకటించాల్సి ఉంది. గత నెలలో కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షలో వీలున్నంత త్వరగా పీసీసీ పదవులు భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో కూడా రెండుమూడు రోజుల్లో కార్యవర్గాన్ని ప్రకటిస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రకటించారు. అయితే, ఈ జాబితా ఖరారవుతున్న సమయంలోనే రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్‌ని మార్చటంతో జాబితా ప్రకటనను వాయిదా వేశారని తెలుస్తోంది. కాగా, మీనాక్షి నటరాజన్ ఈ నెల 23న రాష్ట్రానికి వస్తారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.
ఉపాధ్యక్షుల జాబితా లీక్..
పీసీసీ ఉపాధ్యక్షులుగా ఎంపికచేసినవారి జాబితా లీకైంది. మొత్తం 8 మందిని ఈ జాబితాలో ఫైనల్ చేశారని, అందులో ఐదుగురు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారేనని చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఎస్.వేణుగోపాలా చారి, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, నాయిని రాజేందర్‌రెడ్డి, ఫిరోజ్‌ఖాన్, ఫహీం ఖురేషీ, నీలం మధు, టి.కుమార్‌రావును పార్టీ ఉపాధ్యక్షులుగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. లీకైన ఈ జాబితాలో ఒక్క బీసీ వ్యక్తి పేరు మాత్రమే ఉండటంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment