సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూ రికార్డుల ప్రక్షాళన రెవెన్యూ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. జిల్లాలో ఎక్కవ సంఖ్యలో భూ వివాదాలు ఉండటం, అధికారులు, సిబ్బంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, కొన్నిసార్లు పొరపాటుగా పడటం తదితర లోటుపాట్లను అధికారులు అవకాశంగా మల్చుకున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా భూ ప్రక్షాళన మొదలైనప్పటి నుంచే రెవెన్యూ అధికారులు రాబడి పది రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది. ప్రతి పనిలో అధికారులు డబ్బులు ఆశించడం సంప్రదాయంగా మారింది. ఆమ్యామ్యాలు ఇవ్వంది పని జరగడం గగణమే. చేయి తడపకుంటే నెలల తరబడి బాధితులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. ఇదంతా ఎందుకుని భావించే కొందరు.. ఎంతోకొంత డబ్బు ఇచ్చి పనులు చక్కబెట్టుకుంటున్నారు.
నగరంలో జిల్లా ఒక వైపు కలిసి ఉండటంతోపాటు శివారు ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పల్లెలు.. పట్టణాల్లా రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత భూముల ధరలు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. నగదు చేతిలో పెట్టుకోకుండా దాదాపు అందరూ వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలపై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో రియల్ భూం ఊపందుకుంది. మారుమూల మండల కేంద్రాల్లోనూ ఎకరా భూమి ధర రూ.కోటి వరకు పలుకుతోంది. కొనుగోలుదారుల డిమాండ్‌తో పల్లె పల్లెనా రియల్ వెంచర్లు వెలుస్తున్నాయి. ఈ క్రమంలో భూములు చేతులు మారుతుండటంతో రెవెన్యూ ఉద్యోగులకు కాసుల పంట పండుతోంది.
‘నాలా’.. కల్పతరువు
వ్యవసాయ భూములు రియల్ వెంచర్లుగా మారుతున్నాయి. అంతకంటే ముందు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులకు భారీ ఎత్తున డబ్బులు ముడుతున్నాయి. నాలా సర్టిఫికెట్ జారీ చేయడంలో తహసీల్దార్, ఆర్డీఓలది కీలక పాత్ర. దీన్ని అడ్డంపెట్టుకుని అధికారులు పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేస్తున్నారు. లేదంటే పలు సాకులతో తీవ్ర జాప్యం చేస్తున్నారు. కేశంపేట తహసీల్దార్ కూడా నాలా వ్యవహారంలో భారీగా డబ్బు వెనకేశారని తెలుస్తోంది. ఇందుకు అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు సహకరించినట్లు సమాచారం. ఇద్దరి మధ్యన లోపాయికారీ ఒప్పందం ఉండటంతో ‘నాలా’ని దందాగా మార్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పోస్టుకు భలే డిమాండ్
జిల్లా రెవెన్యూ శాఖలో పోస్టింగ్ పొందడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. పలు రకాలుగా డబ్బు దండుకునే అవకాశం ఉండటంతో జిల్లాలో పనిచేసేందుకు ఉద్యోగులు పోటీ పడుతున్నారు. ఉన్నత స్థాయిలో పైరవీలు చేయించుకోవడం, లేదంటే డబ్బు ముట్టజెప్పి నచ్చిన మండలంలో పోస్టింగ్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో రాజేంద్రనగర్, చేవెళ్ల డివిజన్ల పరిధిలో తనకు కావాల్సిన మండలం కోసం ఒక తహసీల్దార్ సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు చేసినట్లు చర్చ జరుగుతోంది.
ఇదే కోవలో ఏసీబీ కేసులో చిక్కుకున్న తహసీల్దార్ లావణ్య కూడా ప్రయత్నించినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. మెదక్ జిల్లా కొండాపూర్ మండలం నుంచి జిల్లాలో పోస్టింగ్ కోసం భారీగానే ఖర్చు చేసినట్లు వినికిడి. ఇంకొన్ని మండలాల్లో పనిచేస్తున్న స్థానాన్ని కాపాడుకునేందుకూ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలను అనుకూలంగా వ్యవహరించడంతోపాటు ఉన్నతస్థాయి అధికారులకూ అడపాదడపా మర్యాదలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment