సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కొత్త ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. ఒకవైపు నిర్దేశిత అవసరాలకు కేటాయించిన భూములను వినియోగించుకోకుండా అట్టిపెట్టుకున్నవాటిని వెనక్కి తీసుకుంటూనే.. మరోవైపు విలువైన సర్కారు స్థలాలు అక్రమార్కుల గుప్పిట్లోకి వెళ్లకుండా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అసైన్డ్, సీలింగ్, యూఎల్‌సీ భూములు సహా వివిధ సంస్థలకు కేటాయించిన స్థలాల వివరాలను సేకరించింది.
వీటిని కాపాడేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్న యంత్రాంగం... కొత్త పరిశ్రమలకు ఈ భూములను కేటాయించాలని నిర్ణయించింది. నూతన పారిశ్రామిక విధానంతో పెట్టుబడులు వెల్లువలా వస్తాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రాయితీలు, భూ కేటాయింపుల్లో సరళీకృత విధానాలు అవలంబిస్తే పారిశ్రామికంగా అభివృద్ధి సాధించవచ్చని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూముల స్థితిగతులపై సమీక్షించేందుకు మంగళవారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఎస్.కె.సిన్హా జిల్లా కలెక్టరేట్‌కు రానున్నారు.
జిల్లావ్యాప్తంగా 5.21 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, వీటిలో భూమిలేని నిరుపేదలకు సుమారు 1.76లక్షల ఎకరాలను పంపిణీ చేశారు. మరో 39వేల ఎకరాలను పారిశ్రామిక అవసరాలు, ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటు, ప్రజోపయోగాలకుగాను ఏపీఐఐసీ, హెచ్‌ఎండీఏ, రాజీవ్ స్వగృహ, దిల్ తదితర సంస్థలకు బదలాయించారు. ఇలా జరిగిన భూ పందేరంలో ఎంత మేర వినియోగంలోకి వచ్చింది.. ఎంత చేతులు మారింది.. ఎంత మేర న్యాయ వివాదంలో చిక్కుకుంది.. కబ్జాలో ఉన్నదెం త.. క్లియర్‌గా ఉన్నదెంత..? తది తర అంశాలపై జిల్లా యంత్రాంగం పక్షం రోజులుగా కసరత్తు చేస్తోంది. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ఖాళీగా ఉన్న భూముల వివరాలను లెక్కగట్టింది.
10వేల ఎకరాలు క్లియర్!
నగర శివార్లలో వివిధ సంస్థలకు 39వేల ఎకరాల భూమిని కేటాయించారు. దీంట్లో సుమారు 23వేల ఎకరాలు ఆయా సంస్థలు వినియోగించుకుంటున్నట్లు తాజాగా తేల్చింది. మిగతా దాంట్లో 16వేల ఎకరాలు అట్టిపెట్టుకోగా.. ఆరు వేల ఎకరాల న్యాయపరమైన చిక్కుల్లో ఉందని సర్వేలో గుర్తించింది. కాగా, తక్షణ కేటాయింపులకు అనువుగా 10,916 ఎకరాలు ఉన్నట్లు స్పష్టమైంది.
ఐటీ ఆధారిత, పరిశ్రమల తాకిడికి అనుగుణంగా తొలి దశలో వీటిని కేటాయించాలని, మలి విడతలో మిగతా చోట్ల ఖాళీగా ఉన్న సర్కారు భూములను గుర్తించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. కేసీఆర్ సర్కారు రంగారెడ్డి జిల్లాలోని భూములపై నజర్ పెట్టడంతో అధికారులు ఇతర పనులు పక్కనపెట్టి.. వీటిని గణించే పనిలో నిమగ్నమయ్యారు.
రక్షణే లక్ష్యం
Published Mon, Jul 7 2014 11:42 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement