సాక్షి, హైదరాబాద్: కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఎగవేతదారులపై కఠిన చర్యలకు పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది. ప్రభుత్వానికి బకాయిలు చెల్లించని మిల్లర్లపై రెవెన్యూ రికవరీ చట్టాన్ని (ఆర్.ఆర్.యాక్ట్) ప్రయోగించాలని నిర్ణయించింది. ఈ చట్టాన్ని వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలు చేయడానికి కార్యాచరణ రూపొందించింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు కస్టమ్ మిల్లింగ్ విధానం కింద పౌరసరఫరాల శాఖ మిల్లర్లకు ధాన్యం అప్పగిస్తోంది. ఈ నేపథ్యంలో 2010–11 నుంచి 2013–14 వరకు 115 మంది మిల్లర్లు బియ్యం ఇవ్వకుండా ఎగ్గొట్టారని, వాటి విలువ రూ.150 కోట్ల వరకు ఉంటుందని ఆ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ బియ్యాన్ని సొంత అవసరాల కోసం వాడుకుని బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న వ్యాపారులతో ఇప్పటికే ఆ శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు.
బకాయి చెల్లింపులకు ఏడాది పాటు వెసులుబాటు కల్పించారు. బకాయిలు చెల్లిస్తే కేసులు ఎత్తివేస్తామని హామీ కూడా ఇచ్చారు. అయినా మిల్లర్ల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో ఆర్.ఆర్.యాక్టు కింద కేసులు నమోదు చేసి ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి కసరత్తు ప్రారంభించారు. ఈ చట్టం ద్వారా ముందుగా నోటీసులు జారీ చేసి, తర్వాత కొంత సమయం ఇచ్చి సదరు మిల్లర్ బ్యాంక్ అకౌంట్ అటాచ్ చేసుకుంటారు. అవసరమైతే స్థిర, చరాస్తులను వేలం వేస్తారు. బకాయిలను రాబట్టుకునేందుకు బకాయిదారులు ఆస్తులను గుర్తించాలని ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా 115 మంది మిల్లర్లలో 24 మంది మిల్లర్లు మాత్రమే రూ.22.54 కోట్ల విలువైన బియ్యం బకాయిలు చెల్లించగా, 91 మంది మిల్లర్ల నుంచి రూ.128 కోట్లు విలువ చేసే బియ్యం రావాల్సి ఉంది. ఈ ఖరీఫ్‌లోనైనా మొత్తం బకాయిలో 50 శాతం అప్పగించడానికి వీలుగా ఈనెల 30వ తేదీ వరకు గడువు విధించారు.
ఎవరూ తప్పించుకోలేరు: సీవీ ఆనంద్
‘బకాయిల విషయంలో మిల్లర్లతో అనేకమార్లు సంప్రదింపులు జరిపాం. 2016–17 రబీ సీజన్‌లో ధాన్యం కేటాయింపులకు సంబంధించి పాత బకాయిల్లో 50 శాతం సీఎంఆర్ బకాయిలను ’రా’ రైస్ రూపంలో కానీ, చెక్కులు, డీడీల రూపంలో కానీ చెల్లించాలని, మిగిలిన 50 శాతానికి సంబంధించి బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని కోరాం. పూచీకత్తు మీద మరో ఇద్దరు రైస్ మిల్లర్ల హామీ ఇవ్వాలని, రైస్ మిల్లర్ల సంఘం పూచీ పెట్టాలన్న నిబంధనల్లో వెసులుబాటు కల్పించి, ఏడాదిపాటు సమయం ఇచ్చాం. బకాయిలు చెల్లించని వారిపై ఆర్.ఆర్.యాక్టు ప్రయోగిస్తాం. 91 మంది మిల్లర్లలో కొంతమంది అందుబాటులో ఉన్నారు. కొందరు అజ్ఞాతంలో ఉన్నారు. వారిని వెతికి పట్టుకుని కేసులు నమోదు చేస్తాం. బకాయిలు చెల్లించకుండా ఎవరూ తప్పించుకోలేరు’.
ఎగవేతదారులపై ‘రికవరీ’ అస్త్రం!
Published Wed, Nov 22 2017 2:04 AM | Last Updated on Wed, Nov 22 2017 2:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment