
ఎక్సైజ్ విధానాన్ని పునస్సమీక్షించాలి
► కేంద్రమంత్రి దత్తాత్రేయ
► మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు
► శేషగిరిరావు దీక్ష ప్రభుత్వానికి కనువిప్పు కావాలని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యం ముఖ్యమని, అందువల్ల ప్రస్తుత ఎక్సైజ్ పాలసీని పునస్సమీక్షించాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం కన్నా బార్‌షాపులపైనే మక్కువ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కాస్తా బార్ల తెలంగాణగా మారకుండా చూడాలన్నారు. పట్టణాల్లో 11 వేల జనాభా, గ్రామీణ ప్రాంతాల్లో 25 వేల జనాభా ఉంటే బార్‌షాప్ తెరవాలని ఎక్సైజ్ పాలసీలో పెట్టడం బాధాకరమన్నారు.
దీన్ని కేవలం ఆదాయ వనరుగా చూడడం సరైంది కాదన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్ వన్‌గా ఉన్న తెలంగాణ, మద్యంపై ప్రజలను చైతన్యవంతులను చేయడంలో మాత్రం వెనుకబడి ఉందన్నారు. ఈ విషయంలో కూడా నంబర్ వన్ స్థానానికి రావాలన్నారు. త్వరలోనే ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ను కలిసి చర్చించడంతో పాటు, ఆయా అంశాలను ప్రస్తావిస్తూ లేఖ రాస్తామన్నారు. కార్మికశాఖ ద్వారా మద్యం మహమ్మారి, దుష్పరిణా మాలపై సింగరేణి, ఇతర పరిశ్రమల్లో అవగాహన కార్యక్రమాలను చేపడతామ న్నారు. బడుగు, బలహీనవర్గాలు, పేదల్లో దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను చేపడతామన్నారు.
శేషగరిరావు దీక్ష విరమణ..
నాంపల్లిలోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట సీనియర్ నేత ప్రొ.ఎస్వీ శేషగిరిరావు మద్యం సమస్యపై చేపట్టిన ఒకరోజు దీక్షను దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు శనివారం నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. మద్యం సమస్యపై 81 ఏళ్ల వయసులో శేషగిరి రావు చేసిన దీక్ష టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ దీక్షను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మద్యం విధానంలో సమూల మార్పుల కోసం బీజేపీ ఉద్యమం చేస్తుందని, శేషగిరిరావు దీక్ష అందుకు అంకురార్పణ అని మురళీధర్‌రావు పేర్కొన్నారు.
పెద్దనోట్లు రద్దు చేయడంతో కొందరి గుండెల్లో గుబులు పుట్టిందన్నారు. డబ్బుతో నడుస్తున్న కుటుంపార్టీల జేబులకు ఇప్పుడు ప్రమాదం రావడంతో పుట్టల్లోంచి పాముల్లాగా నోట్ల కట్టలు బయటకు వస్తున్నాయన్నారు. అంతకు ముందు టీజేఎసీ చైర్మన్ ప్రొ.కోదండరాం, తదితరులు దీక్షకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీలు, ఎన్.రామచంద్రరావు, సోము వీర్రాజు, నల్లు ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, పేరాల శేఖర్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఎం.ధర్మారావు, ఆకుల విజయ తదితరులు పాల్గొన్నారు.