కాకర్లపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళన చేస్తున్న రైతులు
సాక్షి, సత్తుపల్లి: రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. అయితే రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని లారీల్లో వరంగల్‌లోని మిల్లర్ల వద్దకు తీసుకెళ్లారు. కాని రెండు రోజులుగా మిల్లర్లు కొర్రీలు పెడుతూ దిగుమతి చేసుకోవడం లేదు. 40 కేజీల బస్తాకు మూడు నుంచి ఐదు కేజీల ధాన్యం తరుగు తీసేసి దింపుకుంటామని, లేకుంటే వెనక్కి తీసుకెళ్లాలంటున్నారు. దీంతో సత్తుపల్లి మండలం కాకర్లపల్లి సొసైటీ పరిధిలోని బుగ్గపాడు, కాకర్లపల్లి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన రైతులు ఆందోళన చెందుతున్నారు.
దిగుమతి చేసుకోకుండా లారీలను వెనక్కి పంపిస్తే ఒక్కో లారీ కిరాయికి రూ.40వేల వరకు నష్టం వస్తుందని, ఆ నష్ణాన్ని రైతులే భరించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో తోచక రైతులు ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రజాప్రతినిధులు కల్పించుకొని న్యాయం చేయాలని కోరారు. దీనిపై కాకర్లపల్లి సొసైటీ చైర్మన్ తుమ్మూరి శ్రీరాంప్రసాద్ మాట్లాడారు. ఈ సమస్యను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని.. రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment