తాండూరు : కోడి కొండెక్కి కూర్చుంది. ఎంతకీ దిగిరానంటోంది. మండుతున్న ఎండలకు పోటీగా చికెన్ ధరలు పెరుగుతున్నాయి. ఎండ దెబ్బకు చికెన్ ధరలు దిగిరావాల్సింది పోయి భారీగా పెరుగుతున్నాయి. వేసవి కాలంలో కావడంతో కోళ్ల ఫారాల్లో ఉత్పత్తి భారీగా తగ్గిపోతోంది. ఎండల తీవ్రతకు కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో ఫారాల్లో ఉత్పత్తి క్రమంగా తగ్గిపోతోంది. దీంతో మరో నెలరోజుల వరకు కోడి కూర ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
చికెన్ కిలో రూ.170
తాండూరులో నెలరోజుల కిందట లైవ్ కోడి రూ.63, డ్రెస్సుడ్ చికెన్ రూ.130, స్కిన్ లేకుండా రూ.140 వరకు విక్రయించారు. వారం రోజులుగా చికెన్ ధర కిలోకు రూ.170 అమ్ముతున్నారు. తాండూరులో కిలో చికెన్ ధర (స్నేహ ఫ్రెష్ చికెన్ సెంటర్‌లో) లైవ్ రూ.101, డ్రెస్సుడ్ రూ.150, స్కిన్‌లెస్ రూ.170 అమ్ముతున్నారు. ఈ నెలలో ధరలు రోజురోజుకి పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని చికెన్ దుకాణాల నిర్వాహకులు చెబుతున్నారు.
గతేడాది గరిష్టంగా కిలోకు రూ.260
గతేడాది ఏప్రిల్, మే నెలల్లో కిలో కోడి కూరకు రూ.250 నుంచి రూ.260 వరకు ధర పలికింది. ఈ ఏడాది కూడా చికెన్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్ది చికెన్ ధరలపై ప్రభావం ఉంటుందని కోళ్లఫారాల నిర్వాహకులు చెబుతున్నారు. పెళ్లీళ్లు, శుభకార్యాలు ఉండడంతో ఒక్కసారిగా చికెన్ ధరలు తాండూరులో ఆకాశాన్నంటాయి. వేసవి కావడంతో పౌల్ట్రీఫారాల నుంచి కోళ్ల పంపిణీ సంఖ్య బాగా తగ్గింది. పౌల్ట్రీఫారాల్లో బాయిలర్ కోళ్ల కొరత ఉండడంతో కోడికూర ధరలు పెరుగుతున్నాయని చికెన్ దుకాణాల నిర్వాహకులు చెబుతున్నారు.
శుభకార్యాలతో ధరలపై ప్రభావం
వేసవి కాలంలో ఏప్రిల్, మే రెండు నెలల పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలు వందల సంఖ్యలో జరుగుతుండడంతో చికెన్ వాడకం అధికంగా ఉంటోంది. దీంతో చికెన్ ధరలపై ప్రభావం చూపుతోంది. కోళ్ల ఫారాల్లో ఉత్పత్తులు తగ్గిపోవడంతో కోడి కూర ప్రియులపై ధర ప్రభావం చూపుతుంది.
Comments
Please login to add a commentAdd a comment