ఆర్‌ఎంపీ వద్ద చికిత్స పొందుతున్న రోగి , ఆర్‌ఎంపీల వద్ద నిల్వ చేసిన మందులు
శివ్వంపేట(నర్సాపూర్) : మారుమూల గ్రామాల్లో పేదవారి ఆరోగ్యంతో ఆర్‌ఎంపీలు ఆటలాడుకుంటున్నారు. తెలిసీతెలియని వైద్యానికి అమాయకులు బలవుతున్నారు. పుట్టగొడుగుల్లా గ్రామాల్లో విచ్చలవిడిగా క్లినిక్‌లు ఏర్పాటు చేసుకుంటూ కాసులు దండుకుంటున్నారు. స్థాయికి మించి చేసిన వైద్యానికి రెండు నెలల క్రితం శివంపేట మండల కేంద్రానికి చెందిన రాములు(48) వైద్యం వికటించి మృతి చెందాడు. అయినా ఆరోగ్యశాఖ అధికారులు పట్టించుకున్న పాపానపోవడం లేదు. ఉన్నాతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వీళ్ల వైద్యానికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. మండల పరిధిలో 50కిపైగా ఆర్‌ఎంపీలు ప్రత్యేకంగా క్లినిక్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రథమ చికిత్స మాత్రమే చేయాల్సిన ఆర్‌ఎంపీలు తెలియకపోయినా అన్ని రకాల రోగాలకు వైద్యం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.
దీనికితోడు మోతాదుకు మించి ఇంజక్షన్ల డోస్, మాత్రలు ఇస్తున్నారు. దీంతో ఉన్న రోగం అటుంచితే కొత్త రోగాల భారిన పడాల్సి వస్తోందని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వీళ్లు అనాధికారికంగా మందుల విక్రయాలు కూడా జరుపుతున్నారు. పలు కంపెనీలు ఇచ్చే శాంపిల్ మందులు సైతం రోగులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. రోగికి హైడోస్ మందులు ఇవ్వడం వల్ల త్వరగా తగ్గిపోతుందని నమ్మేవారికి ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలియడం లేదు. కొంత మంది ఇంకో అడుగు ముందుకేసి డెలివరీలు సైతం చేస్తున్నారు. రత్నాపూర్‌లో ఆర్‌ఎంపీ డెలివరీలు చేస్తున్న విషయం జిల్లా వైద్యాధికారి దృష్టికి వెళ్లగా తనిఖీ కోసం వైద్య సిబ్బంది రత్నపూర్ గ్రామానికి వెళ్లగా సదరు ఆర్‌ఎంపీ అసుపత్రికి తాళం వేసి ఉండడంతో సిబ్బంది వెనుతిరిగి వచ్చారు.
కార్పొరేట్ కమీషన్ దందా..
గ్రామాల నుంచి రోగులను నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రులకు తరలిస్తే ఆయా ఆస్పత్రుల నుంచి ఆర్‌ఎంపీలకు కమీషన్ సైతం అందజేస్తున్నారు. రోగికి అయిన బిల్లులో కొంత పర్సెంటీజీ ఇవ్వడంతో వారు అవసరం లేకపోయినా పెద్ద ఆస్పత్రులకు పంపిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యం సైతం ఆర్‌ఎంపీలను మచ్చిక చేసుకునేందుకు పలు బహుమతులు, పర్సెంటేజీలు ఇస్తున్నారు. పలు రకాల పరీక్షల కోసం తూప్రాన్, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లోని డయాగ్నస్టిక్ సెంటర్లకు పంపించి అక్కడి నుంచి కూడా వాటా తీసుకుంటూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారు.
పలు సందర్భాల్లో వైద్యం వికటించి రోగులు మృతి చెందిన సంఘటనలు చోటుచేసుకుంటున్నా ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. రోగి బంధువులు ఆందోళన చేపడుతుండడంతో బాధిత కుటుంబాలకు ఆర్‌ఎంపీలు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. నెల రోజుల క్రితం జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు శివ్వంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేయడానికి రాగా ఆర్‌ఎంపీల స్థాయికి మించి వైద్యం గురించి ఆయన దృష్టికి తీసుకెల్లగా పలు క్లీనిక్‌లను తనిఖీ చేయగా హైడోస్ ఇంజక్షన్లు, మందులు ఇస్తున్న విషయాన్ని గుర్తించారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
చర్యలు తీసుకుంటాం..
గ్రామాల్లో ఆర్‌ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. అంతకు మించి వైద్యం చేస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో తనీఖీలు నిర్వహించి స్థాయికి మించి వైద్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. గర్భిణులకు చికిత్సలు అస్సలు చేయరాదని సూచించారు. ఆర్‌ఎంపీలు ఇష్టరాజ్యంగా చికిత్సలు నిర్వహిస్తున్న విషయంపై రాత పూర్వకంగా ఫిర్యాదు అందజేస్తే చర్యలు తీసుకుంటాం.
–వెంకటేశ్వర్‌రావ్, జిల్లా వైద్యధికారి
Comments
Please login to add a commentAdd a comment