శుభకార్యానికి వెళ్లి వస్తూ..
♦ బస్సు, బైక్ ఢీ.. ముగ్గురి దుర్మరణం
♦ మృతుల్లో నవదంపతులు, చిన్నారి
వేములవాడరూరల్/కొడిమ్యాల: వారంతా బంధువుల ఇంట్లో జరిగిన విందుకు హాజరై సంతోషంగా గడిపారు. వెళ్లొస్తామంటూ బైక్‌పై తిరుగుపయనమవ్వగా.. బస్సు రూపంలో వారిని మృత్యువు కబళించింది. మృతుల బంధువుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గౌరపురం గ్రామానికి చెందిన నవదంపతులు కాసాని శ్రీనివాస్(28), లావణ్య(22), వారి బంధువు కూతురు ప్రతిజ్ఞ(5)తో కలిసి వేములవాడ మండలం నమిలగొండుపల్లి గ్రామంలోని బంధువుల ఇంట్లో జరిగిన కర్ణవేదనం కార్యక్రమానికి హాజరయ్యారు.
సోమవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై తిరుగుపయనమయ్యారు. వేములవాడ మండలం ఫాజుల్‌నగర్ గ్రామ శివారులో వెనకనుంచి వచ్చిన వేములవాడ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో శ్రీనివాస్, లావణ్య, ప్రతిజ్ఞ మృతిచెందారు. డ్రైవర్ పరారయ్యాడు. మృతుల బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారమిచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ అవధాని చంద్రశేఖర్, రూరల్ సీఐ మాధవి, ఎస్సై రాజశేఖర్ జోక్యం చేసుకోవడంతో శాంతించారు.
కంటతడి పెట్టించిన చిన్నారి మృతి
కొత్త దంపతులతోపాటు బాలిక మృతిచెందడం విషాదాన్ని నింపింది. శ్రీనివాస్‌కు లావణ్యతో గతేడా ది డిసెంబర్‌లో వివాహమైంది. శ్రీనివాస్ కొడిమ్యాల వ్యవసాయ మార్కెట్ గోడౌన్‌లో పని చేస్తున్నాడు. శ్రీనివాస్, లావణ్య నవదంపతులు కావడంతో వేములవాడ మండలం నమిలిగుండుపల్లిలోని వారి బంధువు ఇంటికి విందుకోసం వచ్చారు. వస్తూవస్తూ చిన్నప్పట్నుంచి సన్నిహితంగా ఉండే అన్న కూతురు ప్రతిజ్ఞను తీసుకొచ్చారు. ప్రమాదంలో దంపతులతోపాటు బాలిక మరణించడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. బస్సు ఢీకొన్న అనంతరం ద్విచక్రవాహనంపైనుంచి కింద పడిన శ్రీనివాస్, ప్రతిజ్ఞ అక్కడికక్కడే మృతిచెందగా, లావణ్య మాత్రం బైక్‌పైనుంచి పడి వెంటనే లేచి కూర్చున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆమె వెంటనే 108కు ఫోన్ చేయండంటూనే పక్కనే శ్రీనివాస్, ప్రతిజ్ఞ మృతి చెందినట్లు భావించి హఠాత్తుగా చనిపోయినట్లు పేర్కొంటున్నారు.