రాస్తారోకో చేస్తున్న రెడ్డిపల్లి వాసులు, లాలయ్య మృతదేహం
సాక్షి, చేగుంట(తూప్రాన్): గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన చేగుంట శివారులోని రెడ్డిపల్లి బైపాస్ చౌరస్తా వద్ద ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కర్రెపల్లి లాలం (60) (లాలయ్య) రెడ్డిపల్లి నుంచి సైకిల్‌పై వస్తున్నాడు. రెడ్డిపల్లి రోడ్డు నుంచి జాతీయ రహదారిపైకి వచ్చిన లాలయ్యను వెనుక నుంచి వేగంగా వస్తున్న వాహనం ఢీకొనడంతో ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ప్రమాద విషయం తెలుసుకున్న లాలం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేశారు. గ్రామస్తులు పలువురు ఇదే తరహాలో మృతి చెందుతున్నారని ఆగ్రహించి రోడ్డుపైనే బైఠాయించారు. బైపాస్ చౌరస్తా వద్ద ప్రమాదాల నివారణకు బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరినా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ట్రాఫిక్‌లో ఎమ్మెల్యే బాజిరెడ్డి..
గ్రామస్తులు ఆందోళన చేస్తుండటంతో పోలీసులు వారిని సముదాయించారు. అయినా వినకుండా ప్రమాదాలు జరగకుండా బ్రిడ్జి ఎందుకు నిర్మించలేదో అధికారులు తెలిపే వరకు రాస్తారోకో విరమించేది లేదని పట్టుబట్టి కూర్చున్నారు. ఒంటి గంట నుంచి దాదాపు 3 గంటల వరకు రాస్తారోకో నిర్వహించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. బస్సుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించకూడదని పోలీసులు సముదాయించినా గ్రామస్తులు వినలేదు. టీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు వెంగళ్‌రావుతో పాటు పలువురు గ్రామ నాయకులు ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడించారు. బ్రిడ్జి నిర్మాణం కోసం చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ, ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ సైతం ట్రాఫిక్‌లో చిక్కుకోగా రాస్తారోకో విరమించిన అనంతరం వెళ్లిపోయారు. ఈ మేరకు కేసు నమోదుచేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. లాలయ్యను ఢీకొట్టిన వాహనం కోసం విచారణ జరుపుతున్నామని ఎస్‌ఐ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment