
మృతులిద్దరూ తండ్రీకొడుకులే...
- అబ్ధుల్లాపూర్‌మెట్ వద్ద ప్రమాదం...
- మృతులది ప్రకాశంజిల్లా
హయత్‌నగర్: అబ్ధుల్లాపూర్‌మెట్‌లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ట్యాంకర్ లారీ డ్రైవర్, క్లీనర్ తండ్రీకొడుకులేనని తేలింది. పోలీసుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా పెద్దతోరణాల మండలం రామచంద్రకోట గ్రామానికి చెందిన మర్రి చెన్నయ్య (55), అతని కొడుకు గాలయ్య (36)లు సొంత లారీని నడుపుకుంటూ జీవిస్తున్నారు. కాగా, బుధవారం రాత్రి గాలయ్య వాహనం నడుపుతుండగా... తండ్రి చెనయ్య క్లీనర్‌గా పక్కనే కూర్చున్నాడు. చెన్నయ్య ప్రమాదం జరిగిన వెంటనే మృతి చెందగా, గాలయ్యను ఆసుపత్రికి తరలించగా మృతి చెందిన విషయం తెలిసిందే.
గంట పాటు నరకయాతన...
ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ గాలయ్యకు ఇనుప చువ్వలు శరీరంలో గుచ్చుకోవడంతో క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయాడు. సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నా ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకవుతుందనే భయంతో సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. క్యాబిన్‌ను తొలగించేందుకు క్రేన్‌ను రప్పించేందుకు పోలీసులు అనేకచోట్ల ప్రయత్నించారు. చివరకు క్రేన్ ద్వారా శకలాలు తొలగించి గాలయ్యను బయటికి తీశారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో కొద్దిసేపటికే అతను మృతి చెందాడు. సహాయం కోసం గంటపాటు నరకయాతన అనుభవించిన గాలయ్యను చూసి స్థానికులు చలించిపోయారు.
పోలీసుల తిప్పలు...
ఓ వైపు ట్యాంకర్ ప్రమాదంలో గ్యాస్ లీకవుతుందనే పుకార్లు వస్తుండగా అదే సమయంలో నల్లగొండ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ నగరానికి వస్తున్నారు. క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్ ఆర్తనాదాలు చేస్తున్నాడు. ఇదే సమయంలో వర్షం మొదలైంది. జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు ట్రాఫిక్‌ను జాతీయ రహదారిపై ఓ వైపు మళ్లించి ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను మళ్లించడంతో ఊపిరి పీల్చుకున్నారు.
భారీ క్రేన్‌తో శకలాల తొలగింపు..
ట్యాంకర్, టిప్పర్లు నడిరోడ్డుపై నిలిచి ఉండటంతో జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గురువారం సాయంత్రం వరకు కూడా వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. పోలీసులు వంద టన్నుల కెపాసిటీ గల క్రేన్‌ను పిలిపించి అతికష్టం మీద శకలాలను తొలగించారు.