తల్లడిల్లి‘పోయిన’ పసిప్రాయం
ఉదయం పాఠశాలకు వెళ్లే ముందు ఆ పసిప్రాయానికి తెలియదు.. అమ్మచేతి గోరుముద్ద ఇదే ఆఖరు అని.. ఆ చిన్నారికి తెలియదు.. స్నేహితులతో అల్లరిచేష్టలకు ఇక సెలవని.. ఆ బాలుడికి అప్పటి వరకు తెలియదు.. మృత్యుమార్గంలో పయనిస్తున్నానని.. కాసేట్లో ఇంటికి చేరతాననేలోగా మృత్యువు లారీ రూపంలో వచ్చి కబళించేసింది. స్థానికులు, పోలీసుల కథనం
- తిరుమలగిరి
తమిళనాడు రాష్ట్రానికి చెందిన బాల మురుగన్, భాగ్యలక్ష్మి దంపతులు పొట్టచేతపట్టుకొని బతుకుదెరువుకోసం పదేళ్ల క్రితం తిరుమలగిరి మండల కేంద్రానికి వచ్చారు. మార్కెట్ సమీపంలో నివాసముంటూ అప్పడాలు తయారు చేసి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శెల్వన్, చిన్న కుమారుడు అలక్ రాజు (9) మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 5, 3వ తరగతి చదువుతున్నారు. రోజూ మాదిరిగానే పాఠశాల ముగియడంతో సోదరులిద్దరూ నడుచుకుంటూ ఇంటికి వెళుతున్నారు. ఈక్రమంలో తిరుమలగిరి ఎక్స్‌రోడ్డు నుంచి ధాన్యాన్ని తీసుకెళ్లేందుకు వేగంగా వస్తున్న లారీ మార్కెట్ గేటు వద్దే నడుచుకుంటూ వెళ్తున్న అలక్‌రాజును ఢీకొట్టింది. లారీ ముందు టైరు బాలుడిపై నుంచి వెళ్లడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. కాగా లారీడ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు.
సొమసిల్లిన తల్లితండ్రి
లారీ ఢీకొనడంతో బాలుడు మృతిచెందాడన్న వార్త మండల కేంద్రంలో దావానంలా వ్యాపించింది. తనతో పాటే వస్తున్న తమ్ముడిని లారీ ఢీకొనడంతో మృతిచెందాడన్న చేదువార్తను శెల్వన్ ఇంటికెళ్లి తల్లితండ్రికి తెలిపాడు. పరుగున అక్కడికి వచ్చిన వారు కళ్ల ముందే విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి బోరున విలపించారు. ‘బతుకుదెరువు కోసం వస్తే.. పుత్రశోకం మిగిల్చావా దేవుడా’ అంటూ వారు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కుమారుడి మరణాన్ని తట్టుకోలేక ఆ దంపతులు అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు.
స్థానికుల రాస్తారోకో.. పోలీసుల లాఠీచార్జ్
బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలని స్థానికులు ఘటనాస్థలిలోనే రాస్తారోకో చేపట్టారు. తల్లిదండ్రి రాకముందే బాలుడి మృతదేహాన్ని లారీకింద నుంచి ఎందుకు తీశారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో స్థానికులు రాస్తారోకో చేయడంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకుని సీఐ గంగారాం వచ్చి సముదాయించిన ఆందోనకారులు పట్టువీడలేదు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను అక్కడి నుంచి చెదరగొట్టారు. సీఐ ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.