సాయంత్రం మూడు గంటలే కీలకం.. | Road Accidents Special Story | Sakshi
Sakshi News home page

120 రోజులు.. 534 ప్రాణాలు

Published Fri, Jun 7 2019 7:41 AM | Last Updated on Mon, Jun 10 2019 11:59 AM

Road Accidents Special Story - Sakshi

రహదారులు రక్తమోడుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌తో అమాయకుల ప్రాణాలు గాల్లోకలిసిపోతున్నాయి. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌ పరిధుల్లో ఈ ఏడాది జనవరి నుంచిఏప్రిల్‌ వరకు (120 రోజులు) 2,100 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ దుర్ఘటనల్లో534 మంది మరణించగా 1,995 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు కమిషనరేట్ల ట్రాఫిక్‌ పోలీసులు రోడ్డు ప్రమాదాలపై అధ్యయనం చేయగా వివిధ అంశాలు వెలుగులోకి వచ్చాయి.మృతుల్లో పాదచారులు 155 మంది ఉండగా, ద్విచక్ర వాహనదారులు 150 మంది ఉన్నట్లు వెల్లడైంది. రెండు కమిషనరేట్ల పరిధిలో బైకర్లు 93 ప్రమాదాలకు పాల్పడినట్లు తేలింది. ఉదయం 6–9గంటలు, సాయంత్రం 6–9గంటల మధ్యే ప్రమాదాలు జరుగుతున్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది.  

సాక్షి, సిటీబ్యూరో: పట్టణ, గ్రామీణప్రాంతాలతో మిళితమైన సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోరహదారులు రక్తమోడుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు అంటే 120 రోజుల్లో ఈ కమిషనరేట్ల పరిధిలోని రోడ్లపై 2,100 ప్రమాదాలు జరిగితే 534 మంది దుర్మరణం చెందారు. 1,995 మందికి తీవ్ర గాయాల పాలయ్యారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో పాటు అంతర్గత రహదారుల్లోనూ వాహనాల అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌ వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయనిఇరు కమిషనరేట్ల ట్రాఫిక్‌ పోలీసులఅధ్యయనంలో తేల్చారు. చాలావరకుప్రమాదాలు వాహన చోదకుల స్వయం తప్పిదం వల్లనేజరుగుతున్నాయని, ఇందులో తమతో పాటు ఎదుటి వారి ప్రాణాలు సైతం తీస్తున్నారనే విషయంస్పష్టమవుతోంది. కొన్ని ప్రమాదాలు మద్యం మత్తులో జరిగినట్టుగా ట్రాఫిక్‌ పోలీసులు నిర్థారించారు. అలాగే వర్షాకాలం మొదలవుతుండడంతో రహదారులను మెరుగుపరిచేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్‌ పోలీసులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. 

బెంబేలెత్తిస్తున్న బైకర్లు  
రెండు కమిషనరేట్ల పరిధిలోని రహదారులు నిర్మానుష్యంగా ఉన్నా, జనాల రద్దీతో ఉన్నా ద్విచక్ర వాహనచోదకులు మాత్రం దూకుడుగా దూసుకెళుతున్నారు. వెనుక నుంచి, పక్క నుంచి ఏ వాహనాలు వస్తున్నాయో చూసుకోకుండా డ్రైవింగ్‌ చేస్తున్నారు. కాలేజీ, ఆఫీసు ఆలస్యమవుతుందనే తొందరలో అధిక వేగంతో వెళుతూ ముందు వాహనాలను ఢీకొట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎదుటి వారి ప్రాణాలు పోయేందుకు కూడా కారణమవుతున్నారు. ఇలా రెండు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 93 మంది బైకర్లు ప్రమాదాలు చేసినట్టుగా ట్రాఫిక్‌పోలీసుల గణాంకాలు చెబుతున్నాయి.  

మృతుల్లో పాదచారులే అధికం
ఉద్యోగం కోసం, ఆఫీసు కోసం, ఇతర పనుల కోసం శివారు ప్రాంతాల్లోని రోడ్లను దాటే క్రమంలో పాదచారులు వాహనదారుల వేగానికి బలవుతున్నారు. జీబ్రా క్రాసింగ్, జంక్షన్లు దగ్గర కూడా వాహన చోదకులు అతి వేగంతో వెళుతూ ఏకంగా పాదచారులను ఢీకొడుతున్నారు. ఈ ప్రమాదాలోల బాటసారులు అక్కడికక్కడే మృతి చెందుతుండగా, ఇంకొందరు గాయపడుతున్నారు. ఇలా రెండు కమిషనరేట్ల పరిధిలో 155 మంది పాదచారులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. తర్వాతి స్థానంలో 150 మంది ద్విచక్ర వాహనచోదకులు ఉన్నారు.

సాయంత్రం మూడు గంటలే కీలకం  
ఈ నాలుగు నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల తీరుతెన్నును పరిశీలిస్తే అధికంగా సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్యనే జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆ సమయంలో ట్రాఫిక్‌ రద్దీ ఉండడంతో ఇంటికి వెళ్లాలనే తొందరలో ఈ దారుణాలు జరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు. తర్వాత రాత్రి 9 నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య ప్రమాదాల తీవ్రత ఎక్కువ ఉందంటున్నారు. ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ సమయాల్లో వాహన చోదకులు జాగ్రత్తగా డ్రైవ్‌ చేయడం వల్ల ఇటు తమ ప్రాణాలు, ఎదుటి వారి ప్రాణాలు నిలిపినవారవుతారని సూచిస్తున్నారు.

 అదుపు తప్పుతున్న అనుభవం
ఇరు కమిషనరేట్ల పరిధిలో రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారిలో 40 ఏళ్లు పైబడిన వాళ్లే ఎక్కువ. ఈ వయసు వారు సైబరాబాద్‌లో 63 మంది దుర్మరణం చెందితే, రాచకొండలో 107 మంది ప్రాణాలొదిలారు. యువతకు ఆదర్శంగా ఉండాల్సిన అనుభవమున్న వారే ఇలా రోడ్డు ప్రమాదాలు చేస్తూ మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. వీరికి తామేమీ తీసిపోమన్నట్టు 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లు 135 మంది మృత్యువాత పడటం గమనార్హం. ఇటు అనుభవజ్ఞులు, అటు యువకులు చేసే పొరపాటు ఎన్నో కుటంబాల్లో తీరని శోకాన్ని మిగులుస్తోందని ట్రాఫిక్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు చెబుతున్నారు.  

మీకోసం చూస్తుంటారు..
విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు.. ఏ రంగం వారిని తీసుకున్నా ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి చేరేదాకా వాహనాలను జాగ్రత్తగా నడపాలి. మీరు చేసే చిన్నపాటి నిర్లక్ష్యం మీ కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది. మీపైనే ఆధారపడ్డవారు, మీ భవిష్యత్‌ను కోరుకునే తల్లిదండ్రులు ఇంటి వద్ద వేచిచూస్తుంటారన్న విషయాన్ని మర్చిపొవద్దు. జాగ్రత్తగా వాహనాలు నడిపి ఇంటికి చేరుకుంటే అందరూ ఆనందంగా ఉంటారు.– వీసీ సజ్జనార్, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌

బ్లాక్‌స్పాట్స్‌పై దృష్టి
రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపైనే దృష్టి సారించాం. వర్షాకాలం వస్తుండడంతో రోడ్ల పరిస్థితులను మెరుగుపరిచేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేస్తున్నాం. రోడ్లు ఎంత బాగుచేసినా వాహన చోదకులు డ్రైవింగ్‌ చేసేటప్పుగు కూడా జాగ్రత్తగా ఉండాలి. స్వయంకృతపారాధంతోనే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలంటే మీరు డ్రైవింగ్‌ బాగా చేయాలి.– మహేష్‌ భగవత్, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌  

శివారు ప్రాంతాలతో ఉన్న ఈ కమిషనరేట్లలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు ఆది, గురువారాల్లో జరుగుతున్నాయి. సెలవురోజైనా ఆదివారం కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి వినోదం, షాపింగ్, చారిత్రక కట్టడాల సందర్శన, పార్టీల కోసం బయటకు వస్తుండటంతో రోడ్డు ప్రమాదాలు అధికంగానే జరుగుతున్నట్టు ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు. గురువారం కూడా ఇదే రేంజ్‌లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement