పట్టపగలే దోచేశారు
సుల్తానాబాద్ (కరీంనగర్ జిల్లా) : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని బ్యాంకు కాలనీలో ఆకుల సరిత- శ్రీనివాస్ దంపతుల ఇంట్లో శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. ఇంటి వెనుక తాళాన్ని పగులగొట్టి దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. తాము తెచ్చుకున్న రాడ్డుతో వంటగది, పూజగది, బెడ్‌రూమ్‌లలో సోదాలు చేశారు. ఇల్లంతా చిందరవందర చేశారు. 5 తులాల బంగారం (నెక్లెస్, చైన్, రెండు రింగులు)తో పాటు రూ. 58 వేల నగదును ఎత్తుకెళ్లారు.
కాగా సరిత ఓదెల మండలం మడక గ్రామంలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. విధుల కోసం వెళ్లగా, భర్త ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ పని ఉండడంతో పెద్దపల్లికి వెళ్లాడు. పెద్దపల్లికి వెళ్లగానే దొంగలు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో సుమారుగా 16 తులాల బంగారం ఉందని, రోల్డ్‌గోల్డ్‌గా భావించి వదిలి వెళ్లుంటారని బాధితులు చెబుతున్నారు. దొంగతనం జరిగిందని స్థానికులు బాధితులకు ఫోన్‌చేసి సమాచారం అందించడంతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీం వచ్చి నమూనాలను సేకరించింది. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ తులా శ్రీనివాస్‌రావు, ఎస్సై ఇంద్రసేనారెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మండల కేంద్రమే టార్గెట్
దొంగతనాలకు సుల్తానాబాద్ మండల కేంద్రాన్నే టార్గెట్‌గా దొంగలు ఎంచుకున్నట్లు కనబడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 15 రోజుల్లో పలు దొంగతనాలకు పాల్పడినట్లు కనబడుతుంది. ఎస్సై తిరుమల్ నివాసం ఉండే ఇంటి యజమాని ఇంట్లో పట్టపగలే దొంగతనం జరిగి 5వేల నగదు ఎత్తుకుని వెళ్లారు. స్థానిక వైశ్యభవన్‌లో లక్ష రూపాయల విలువ చేసే టెంట్‌హౌజ్ సామాగ్రిని ఎత్తుకుని వెళ్లారు. వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.