నిందితుడిని చూపుతున్న పోలీసులు
సాక్షి, కరీంనగర్: కరీంనగర్‌తోపాటు మరో రెండు జి ల్లాల్లో వివిధ నేరాలు చేశాడు.. జైలుకు వెళ్లి విడుదలయ్యాడు.. తర్వాత పేరు మార్చుకొని అజ్ఞాతంలోకి వెళ్లిన నేరస్థుడిని కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్ టౌన్ అడిషనల్ డీసీపీ పి.అశోక్ బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించాడు. కేశవపట్నం మండలం తాడి కల్ గ్రామానికి చెందిన మొలుగూరి విద్యాసాగర్(32) డిగ్రీ వరకు చదువుకున్నాడు. భూపాలపట్నంకు చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. 2015–16 మధ్య నేరాలు చేయడం ప్రారంభించాడు. అతనిపై కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో 12 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలయ్యాడు. తర్వాత శిక్ష తప్పించుకునేందుకు స్వగ్రామంతో సంబంధాలు తెంచుకున్నాడు.
హైదరాబాద్‌లోని సఫీల్ గూడకు మకాం మార్చాడు. 2017లో విజయ్‌గా పేరు మార్చుకొని, అంజలి అనే యువతిని రెండో వివాహం చేసుకొని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నకిలీ వివాహ ధ్రువపత్రం పొందాడు. ఈ క్రమంలో విద్యాసాగర్‌పై పలు కోర్టులు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడంతో అతడిని పట్టుకునేందుకు కరీంనగర్ టౌన్ ఏసీపీ ఆధ్వర్యంలో ఆపరేషన్ తలాష్‌లో భాగంగా ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి, అతని బంధువుల నుంచి వివరాలు సేకరించారు. తుదకు నకిలీ ఆధార్‌కార్డుతో తీసుకున్న ఫోన్ నంబర్ కనిపెట్టి, హైదరాబాద్ వెళ్లి విద్యాసాగర్‌ను అరెస్టు చేశారు. బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు ఎన్.సుజాత, జి.కృష్ణకుమార్ తదితరులను సీపీ కమలాసన్‌రెడ్డి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment