సాక్షి, సిరిసల్ల క్రైం: మీ ఇంటికి తాళం వేశారా..అయితే పక్కింటి వారికి కాస్త చెప్పి వెళ్లిండి. లేకుంటే మీరు తిరిగొచ్చే లోపే మీ ఇల్లు గుల్ల కావచ్చు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు జరుగుతున్నాయి. గత నెలలో వరుసగా మూడు రోజులు క్రిస్మస్ సెలవులు రావడంతో ఇళ్లకు తాళం వేసి బంధువుల వద్దకు వెళ్లిన వారి ఇళ్ల తాళాలు పగిలిపోయాయి. బీరువాలో సొమ్ము మాయమవుతోంది. చోరీకి గురవుతున్న సొమ్మును రికవరీ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ అసలు రాత్రి వేళ గస్తీ పెంచితే దొంగతనాలను నివారించవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. డిసెంబర్‌లో వరుస దొంగతనాలు జరిగిన నేపథ్యంలో ప్రత్యేక కథనం.
దొంగతనాలు.. రికవరీ
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2017లో 90 దొంగతనాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. బంగారం వెండితోపాటు పలు ఆభరణాలు, టీవీలు చోరీకి గురికాగా వాటి విలువ రూ.15.31లక్షలు ఉన్నట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. దొంగలను అరెస్టు చేయడంతోపాటు వారి నుంచి రూ.14.97లక్షలు రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు. దొంగతనం జరిగిన తర్వాత దొంగలను అరెస్టు చేయడం, సొమ్ము రికవరీ చేయడం కంటే ముందస్తుగా గస్తీ పెంచితే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, డ్రంకెన్‌డ్రైవ్‌పై అధికంగా దృష్టి పెట్టినట్లు కేసు నమోదు, జరిమానాలతోనే తెలుస్తుంది.
మైనర్లు అధికం
దొంగతనాలు చేస్తూ ఇప్పటి వరకు పట్టుబడిన వారిలో ఎక్కువగా మైనర్లు, స్థానికులే ఉన్నట్లు పోలీసుల రికార్డులు తెలుపుతున్నాయి. స్థానికంగా ఉంటూ జులాయిగా తిరిగే వారే తాళం వేసిన ఇళ్ల సమాచారం సేకరిస్తూ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు చిక్కుతున్న వారితో బహిర్గతమైంది. దీనికి తోడు చిన్నపాటి వస్తువులు అమ్మేందుకు గల్లీల్లో తిరిగే వారు సైతం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఎక్కువమట్టుగా ఇతర ప్రాంతాలకు చెందిన వారు ముఠాలుగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు.
అవగాహన అవసరం
వరుస సెలవులు, పండుగలు ఉన్న సమయంలో ఇంటి యజమానులు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించి దొంగతనాలకు చెక్ పెట్టవచ్చు. ఇంటిలో ఎవరు లేకుంటే ఆ విషయాన్ని సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించడం ద్వారా ఆ ప్రాంతంలో పోలీసుల గస్తీ అధికంగా ఉంటుందనే విషయం తెలుసుకోకపోవడం ప్రధాన సమస్య. పోలీస్‌శాఖ సైతం ఈ దిశగా అవగాహన కల్పించకపోవడం కూడా ఓ సమస్యే.
బుగ్గారంలో పలు ఇళ్లలో చోరీ
బుగ్గారం(ధర్మపురి): బుగ్గారంలో శనివారం అర్ధరాత్రి పలు ఇళ్లలో భారీ చోరీ జరిగింది. ఏడు ఇండ్లతో పాటు, ఒక చికెన్ సెంటర్‌లో దొంగలు చొరబడి చోరీకి యత్నించగా మూడు ఇళ్లలో ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు చోరీకి గురయిన ఇళ్లను పరిశీలించారు. గ్రామానికి చెందిన కప్పల పోశవ్వ ఇంట్లో రూ. 1, 30 లక్షల నగదు, రెండుతులాల బంగారం, 75 తులాల వెండి, ఆదిమల్ల లక్ష్మీ ఇంట్లో తులంబంగారం, రూ. 1500 నగదు, పోగుల ఎల్లవ్వ ఇంట్లో అర్ధతులం బంగారం చోరీకి గురైందని ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎస్పీ అనంతశర్మ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.
ఇటీవల జరిగిన దొంగతనాలు
జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో ఓ కుటుంబం గత ఆదివారం సెలవు కావడంతో తల్లిగారింటికి వెళ్లగా..దొంగలుపడి దాదాపు రూ.50వేల విలువైన బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు.
కోరుట్ల మండలం గుమ్లాపూర్‌కు చెందిన ఓ మహిళ, బంధువుల ఇంటికి వెళ్లగా.. ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు, రూ.5వేల నగదు ఎత్తుకెళ్లారు.
క్రిస్మస్‌కు ముందు వచ్చిన వరుస సెలవులతో పలువురు ఉద్యోగస్తులు సిరిసిల్ల నుంచి వారి స్వగ్రామాలకు వెళ్లారు. ఇదే అదనుగా దొంగలు తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడ్డారు. రూ.3లక్షల వరకు ఆస్తిని కొల్లగొట్టారు. సిరిసిల్ల పాతబస్టాండ్ ఏరియాలో బ్యాగుల దొంగతనం, పిక్‌ప్యాకెటింగ్ ఘటనలతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
నైట్ పెట్రోలింగ్ పెంచుతాం
వరుస దొంగతనాలు జరుగుతున్నక్రమంలో నైట్ పెట్రోలింగ్ పెంచుతాం. సిరిసిల్లతోపాటు జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లోనూ ఒకే రోజు వరుసగా పలు ఇళ్లల్లో దొంగతనాలు జరిగాయి. వాటిపై సమీక్షించాం. ఇదంతా ఓ గ్రూప్ సభ్యుల పనిగా ప్రాథ«మిక అంచనాకు వచ్చాం. దొంగతనాల నివారణపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం.
– వెంకటరమణ, డీఎస్పీ, రాజన్న సిరిసిల్ల
జిల్లాల్లో మహబూబ్‌నగర్ గ్యాంగ్
కోరుట్ల: ఆ గ్యాంగ్ ఊళ్లోకి వచ్చిందంటే చాలు.. ఒక్క ఇంటిలో చోరీతో సరిపెట్టుకోదు. ఏకకాలంలో ఐదు నుంచి పది ఇళ్లలో చోరీలకు పాల్పడుతూ బీభత్సం సృష్టిస్తుంది. ఒకరిద్దరు కాదు.. కనీసం ఏడుగురు సభ్యులతో ఉన్న ఈ ముఠా మహబూబ్‌నగర్ పరిసరాల్లోని అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. ‘ఎర్కల గ్యాంగ్’గా పోలీసులు పిలుచుకునే ఈ ముఠా వారంరోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో హల్‌చల్ చేస్తుంది.
శివారు ఇళ్లే టార్గెట్..
ఈ గ్యాంగ్ ముఠా సభ్యులు ఏదైనా ఓ ఊళ్లోకి వెళ్లి ఎవరికి వారు విడిపోయి పొద్దంతా ఊరిలో తిరుగుతారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను గమనిస్తారు. ఒక ఊళ్లో కనీసం పదితాళం వేసి ఉన్న ఇళ్లను దొంగతనం చేస్తారు. అక్కడి నుంచి వేరే గ్రామానికి వెళ్లిపోతారు.
పోలీసులకు సవాల్..
వారం వ్యవధిలో వరుసగా చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ దొంగల ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటుచేసినట్లు తెలిసింది. జిల్లాలోని గుమ్లాపూర్, చల్‌గల్, బుగ్గారం గ్రామాల్లో దొంగలకు చెందిన ఆనవాళ్ల కోసం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంల సాయంతో పోలీసులు ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment