రాక్‌గార్డెన్‌లో ఉన్న చెరువు
బంజారాహిల్స్: రాజధానిలోని విలువైన ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతమవుతుంటే పాలకులు చోద్యం చూస్తున్నారు. కళ్ల ముందే ఖరీదైన మున్సిపల్ స్థలాలు హారతిలా కరిగిపోతుంటే జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. అడిగేవారు లేక కబ్జాదారులు పేట్రేగిపోతున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.86లోని రాక్‌గార్డెన్‌కు కేటాయించిన స్థలమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 1985లో జూబ్లీహిల్స్ సొసైటీ ఏర్పడింది. ఆనాడు సొసైటీ పరిధిలోని హకీంబాబా దర్గా వెనుకాల రాక్‌గార్డెన్ నిర్మాణానికి లే అవుట్‌లోనే 30 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.
ఇందుకు సంబంధించిన మ్యాప్ కూడా సిద్ధం చేశారు. ఈ స్థలంలో పచ్చదనం పెంచాలని, సహజసిద్ధంగా ఏర్పడ్డ రాళ్లను దెబ్బతీయకుండా వాటికి చక్కని ఆకృతులు మలిచి స్థలం మధ్యలో ఉన్న చెరువును సుందరీకరించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2009 జూలై 16న రాక్‌గార్డెన్ నిర్మాణానికి సైతం శంకుస్థాపన చేశారు. మూడు నెలల వ్యవధిలో ఈ స్థలాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని అప్పటికప్పుడే మూడున్నరకోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం.. అనంతరం వారంరోజుల్లో పనులు చేపట్టడం చకచకా జరిగిపోయాయి. గార్డెన్ లోపల ట్రాక్ నిర్మాణంతో పాటు చుట్టూ ప్రహరీ నిర్మాణం కూడా పూర్తయ్యాయి. దురదృష్టవశాత్తు పనులు ప్రారం భమైన కొద్ది నెలలకే వైఎస్సార్ మృతి చెందడంతో రాక్ గార్డెన్ నిర్మాణ పనులు అటకెక్కాయి.
30 ఎకరాల్లో సగం ఆక్రమణ
జూబ్లీహిల్స్ సొసైటీ లే అవుట్‌లో రాక్‌గార్డెన్ కోసం 30 ఎకరాల స్థలం కేటాయించగా ఈ మధ్య కాలంలో చుట్టూ కబ్జాలు పెరిగిపోయి 2009 నాటికి 20 ఎకరాలు మాత్రమే మిగిలింది. మిగతా పది ఎకరాల స్థలం అన్యాక్రాంతమైంది. సరిగ్గా వైఎస్సార్ శంకుస్థాపన చేసేనాటికి ఈ పార్కు స్థలం 20 ఎకరాలు ఉండగా ఆయన మరణానంతరం పనులు అటకెక్కి ఫైళ్లు మూలనపడి నిధులు మురిగిపోయి ఒక్క అంగుళం అభివృద్ధి కూడా జరగలేదు. ఉన్న 20 ఎకరాల్లో ఈ తొమ్మిదేళ్లలో మరో ఐదెకరాలు అన్యాక్రాంతమైంది. ఇక మిగిలింది 15 ఎకరాలేనని స్థానికులు చెబుతున్నారు. కనీసం ఉన్న స్థలంలోనైనా రాక్‌గార్డెన్‌ను నిర్మిస్తే కబ్జాలకు అడ్డుకట్ట పడుతుందని ఇక్కడివారు ఎన్నోసార్లు జీహెచ్‌ఎంసీ అధికారులకు విన్నవించినా అటునుంచి స్పందన లేకపోయింది.
మంత్రి ఆదేశాలు బుట్టదాఖలు..
స్థానికుల విజ్ఞప్తి మేరకు మంత్రి హరీష్‌రావు రెండేళ్ల క్రితం రాక్‌గార్డెన్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. సహజసిద్ధంగా ఏర్పడ్డ చెరువుతో పాటు చుట్టూ కనువిందు చేసే రాళ్లు, ఏపుగా పెరిగిన చెట్లు చూసి ఆయన ముచ్చటపడ్డారు. ఫైల్‌ను దుమ్ముదులిపి వెంటనే సుందరంగా పార్కును తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. అప్పుడు ఓకే అన్న అధికారులు మంత్రి అటు వెళ్లగానే ఆ ఆదేశాలను పట్టించుకోవడం మానేశారు. హరీష్‌రావు పరిశీలించి వెళ్లిన తర్వాత ఇంకో రెండెకరాల స్థలం కబ్జాకు గురైందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రాత్రివేళల్లో డంపింగ్‌లు..
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, టోలిచౌకీ ప్రాంతాల్లో జరుగుతున్న భవన నిర్మాణాల్లో భాగంగా తొలిగించే మట్టిని లారీలతో తెచ్చి రాత్రివేళల్లో రాక్‌గార్డెన్ స్థలంలోనే డంపింగ్ చేస్తున్నారు. ప్రతిరోజూ వందల టన్నుల మట్టిని తెచ్చి పోస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అక్రమ డంపింగ్‌ను అడ్డుకోవాలని పలుమార్లు పోలీసులకు, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. భవన నిర్మాణ వ్యర్థాలు తెచ్చే లారీలను స్థానికులు అడ్డుకుని ప్రశ్నిస్తే వారిపై దాడులు జరుగుతుంటడంతో ఎవరూ నోరు మెదపడం లేదు.
ఎందుకింత నిర్లక్ష్యం!
మహానగరంలో ఖాళీ స్థలాలు లేక చాలా కాలనీలు ఇబ్బందులు పడుతుంటే.. ఇక్కడ మాత్రం ఉన్న స్థలాన్ని కాపాడుకోలేని పరిస్థితిలో జీహెచ్‌ఎంసీ ఉంది. జీహెచ్‌ఎంసీ నిర్వాకం వల్లనే 30 ఎకరాల రాక్‌గార్డెన్ స్థలం ఇప్పుడు సగానికి ఆక్రమణకు గురైందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి, మంత్రి కేటీఆర్ స్పందించి నిధులు విడుదల చేస్తే ఈ పార్కు నిర్మాణం జరుగుతుంది. లేదంటే మిగిలిన స్థలం సైతం కబ్జా అవుతుందని స్థానిక అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే రాక్‌గార్డెన్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
ప్రభుత్వానికి లేఖలు రాశాం
మూడు దశాబ్దాల క్రితం వరకు ఫిలింనగర్ కాలనీతో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 86,87 కొండ ప్రాంతం. ఇళ్ల నిర్మాణాల కోసం రాళ్లను ధ్వంసం చేశారు. అదృష్టవశాత్తు ఫిలింనగర్ గుట్టకు ఆనుకుని ఈ రాక్ గార్డెన్ స్థలం ఉంది. దీన్ని రక్షించుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. పార్కును సుందరంగా తీర్చిదిద్ది చారిత్రక వారసత్వంగా నేటి తరానికి అందించాలని పలుమార్లు సేవ్‌రాక్ సొసైటీ తరఫున మేం ప్రభుత్వానికి లేఖలు రాశాం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి.– ఫ్రాక్, సేవ్‌రాక్ సొసైటీ వ్యవస్థాపకురాలు
పర్యావరణంపై శ్రద్ధేది!
నగరంలో రోజురోజుకు ఖాళీ స్థలాలు తగ్గిపోతున్నాయి. ఆహ్లాదాన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉన్న ఖాళీ స్థలాలను కాపాడుకొని వాటికి రక్షణ ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. రాక్‌గార్డెన్‌కు కేటాయించిన స్థలంలో ఇప్పుడున్న చెట్లను రక్షిస్తూనే కొత్తగా మరింత పచ్చదనాన్ని తీర్చిదిద్దవచ్చు. ఏళ్ల తరబడి ఈ ప్రతిపాదనలు అటకెక్కాయి. ఏనాడో అభివృద్ధి చేసి ఉంటే ఈ భూములకు రక్షణ ఉండేది. పర్యావరణం బాగుండేది.– కెప్టెన్ జె.రామారావు, పర్యావరణవేత్త
ప్రభుత్వ నిర్వాకమే
నేను 20 ఏళ్లుగా ఈ రాక్‌గార్డెన్ ప్రాంతాన్ని చూస్తూనే ఉన్నాను. అభివృద్ధికి నోచుకున్న పాపాన పోలేదు. చుట్టూ మట్టి డంపింగ్ చేస్తుండడంతో కుదించుకుపోతోంది. రెండేళ్ల క్రితం మంత్రి హరీష్‌రావు వచ్చి పార్కును అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఆ రోజు చేసి ఉంటే ఈ రెండేళ్లలో కనీసం ఎకరం స్థలమైనా కాపాడేవారం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మంత్రి కేటీఆర్ స్పందించి ఈ స్థలాన్ని అభివృద్ధి చేయకపోతే ఏడాదిలో మొత్తం ఆక్రమించేస్తారు.– నాగమధు, సినీమేనేజర్, జూబ్లీహిల్స్
Comments
Please login to add a commentAdd a comment