rock garden
-
ప్రకృతి చెక్కిన శిల్పాలు
కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలోని రాక్‌గార్డెన్‌లో ఎటుచూసినా ప్రకృతి చెక్కిన శిల్పాలే. ఏ రాయి చూసినా ఏదో ఒక రూపం కనిపిస్తుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయానికి ఎదురుగా ఉన్న రాక్‌గార్డెన్‌ను ప్రతి రోజూ వందల మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు. ప్రకృతి చెక్కిన అపురూప దృశ్యాలను చూసి ఆశ్చర్యచకితులవుతున్నారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
Andhra Pradesh: రాష్ట్రంలోనే తొలి రాక్ పార్క్..
విజయనగరం: విజయనగర వాసులకు విజ్ఞానం.. ఆహ్లాదాన్ని పంచేందుకు రాక్‌గార్డెన్ ముస్తాబైంది. దీనిని సందర్శించేవారికి ఔషధ విజ్ఞానం అందేలా వందలాది ఔషధ మొక్కలను నాటారు. ఆహ్లాదాన్ని పంచేలా అందమైన పూలవనాలను పెంచుతున్నారు. పెద్దపెద్ద రాళ్లను గుట్టలుగా పేర్చి పార్క్‌ను సహజసిద్ధంగా తీర్చిదిద్దారు. చిన్నారుల కోసం ప్రత్యేక ఆటపరికరాలను అమర్చారు. ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని కొత్తపేట జంక్షన్ వద్ద రూ.2.20 కోట్ల వ్యయంతో తీర్చిదిద్దిన మహరాణి అప్పలకొండమాంబ రాక్ గార్డెన్ వచ్చేఏడాది జనవరి 1 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాక్ గార్డెన్ ఆవరణలో వివిద జాతుల మొక్కలు రాష్ట్రంలోనే తొలి రాక్ పార్క్.. విజయనగరం కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధిచేసిన రాక్ గార్డెన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి పార్కు ఉండగా.. ఆంధ్రాలో ఇదే మొట్టమొదటిది కావడం విశేషం. అమృత్ పథకం నిధులతో ఈ పార్కును నిర్మించారు. విభిన్న జాతుల మొక్కలు.. నగరంలోని ఐదున్నర ఎకరాల సువిశాల స్థలంలో అభివృద్ధి చేసిన రాక్‌గార్డెన్ అరుదైన ఔషధ మొక్కలతో ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు సిద్ధమైంది. గార్డెన్ ఆవరణలో దేశ, విదేశాలకు చెందిన 118 రకాల జాతుల మొక్కలను నాటారు. వీటన్నింటినీ హైదరాబాద్ నుంచి తెప్పించారు. విద్యార్థులకు ఉపయుక్తం రాక్ గార్డెన్ విద్యార్థులకు ఉపయుక్తం. గార్డెన్లో వివిధ రకాల ఔషధ మొక్కలతో పాటు బొటానికల్ మొక్కలు ఉన్నాయి. సైన్స్ విద్యార్థులు ప్రత్యక్షంగా మొక్కలను పరిశీలించేందుకు అవకాశం కలుగుతుంది. వాటి శాస్త్రీయ నామాలను పార్క్ నిర్వహణ సిబ్బందిని అడిగి తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోనే తొలి బొటానికల్ గార్డెన్ విజయనగరంలో రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉంది. జనవరి ఒకటో తేదీ నుంచి ప్రజలు సందర్శించి విజ్ఞానం పెంచుకోవాలి. – కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యే, విజయనగరం -
ఆసియా ఖండంలోనే అతి పెద్ద ‘రాక్ గార్డెన్స్’
సాక్షి, కర్నూలు : కర్నూలు – వైఎస్సార్ కడప జాతీయ రహదారిలోని ఓర్వకల్ సమీపంలో ఉన్న రాక్ గార్డెన్స్ ఆసియా ఖండంలోనే అతి పెద్దదిగా ప్రసిద్ధి చెందింది. కర్నూలు నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రాక్‌గార్డెన్‌లో పురాతన కొండలు, సహజసిద్ధమైన గుట్టలతో పాటు రెండు కొండల మధ్య చెరువు ఉంది. శిల్ప చాతుర్యంతో మలిచినట్లు వివిధ ఆకృతుల్లో రాతివనాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఉదయం, సాయంత్రం చల్లని గాలుల పలకరింపులు, పక్షుల కిలకిలరావాలతో ప్రశాంత వాతావరణం అగుపిస్తోంది. సినిమా షూటింగ్‌లకు ప్రత్యేకమైన స్పాట్‌గా మారింది. శని, ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లో ఇక్కడ పర్యాటకుల సందడి ఉంటుంది. -
బహుప'రాక్' బ్రదర్
బంజారాహిల్స్: రాజధానిలోని విలువైన ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతమవుతుంటే పాలకులు చోద్యం చూస్తున్నారు. కళ్ల ముందే ఖరీదైన మున్సిపల్ స్థలాలు హారతిలా కరిగిపోతుంటే జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. అడిగేవారు లేక కబ్జాదారులు పేట్రేగిపోతున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.86లోని రాక్‌గార్డెన్‌కు కేటాయించిన స్థలమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 1985లో జూబ్లీహిల్స్ సొసైటీ ఏర్పడింది. ఆనాడు సొసైటీ పరిధిలోని హకీంబాబా దర్గా వెనుకాల రాక్‌గార్డెన్ నిర్మాణానికి లే అవుట్‌లోనే 30 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇందుకు సంబంధించిన మ్యాప్ కూడా సిద్ధం చేశారు. ఈ స్థలంలో పచ్చదనం పెంచాలని, సహజసిద్ధంగా ఏర్పడ్డ రాళ్లను దెబ్బతీయకుండా వాటికి చక్కని ఆకృతులు మలిచి స్థలం మధ్యలో ఉన్న చెరువును సుందరీకరించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2009 జూలై 16న రాక్‌గార్డెన్ నిర్మాణానికి సైతం శంకుస్థాపన చేశారు. మూడు నెలల వ్యవధిలో ఈ స్థలాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని అప్పటికప్పుడే మూడున్నరకోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం.. అనంతరం వారంరోజుల్లో పనులు చేపట్టడం చకచకా జరిగిపోయాయి. గార్డెన్ లోపల ట్రాక్ నిర్మాణంతో పాటు చుట్టూ ప్రహరీ నిర్మాణం కూడా పూర్తయ్యాయి. దురదృష్టవశాత్తు పనులు ప్రారం భమైన కొద్ది నెలలకే వైఎస్సార్ మృతి చెందడంతో రాక్ గార్డెన్ నిర్మాణ పనులు అటకెక్కాయి. 30 ఎకరాల్లో సగం ఆక్రమణ జూబ్లీహిల్స్ సొసైటీ లే అవుట్లో రాక్‌గార్డెన్ కోసం 30 ఎకరాల స్థలం కేటాయించగా ఈ మధ్య కాలంలో చుట్టూ కబ్జాలు పెరిగిపోయి 2009 నాటికి 20 ఎకరాలు మాత్రమే మిగిలింది. మిగతా పది ఎకరాల స్థలం అన్యాక్రాంతమైంది. సరిగ్గా వైఎస్సార్ శంకుస్థాపన చేసేనాటికి ఈ పార్కు స్థలం 20 ఎకరాలు ఉండగా ఆయన మరణానంతరం పనులు అటకెక్కి ఫైళ్లు మూలనపడి నిధులు మురిగిపోయి ఒక్క అంగుళం అభివృద్ధి కూడా జరగలేదు. ఉన్న 20 ఎకరాల్లో ఈ తొమ్మిదేళ్లలో మరో ఐదెకరాలు అన్యాక్రాంతమైంది. ఇక మిగిలింది 15 ఎకరాలేనని స్థానికులు చెబుతున్నారు. కనీసం ఉన్న స్థలంలోనైనా రాక్‌గార్డెన్‌ను నిర్మిస్తే కబ్జాలకు అడ్డుకట్ట పడుతుందని ఇక్కడివారు ఎన్నోసార్లు జీహెచ్ఎంసీ అధికారులకు విన్నవించినా అటునుంచి స్పందన లేకపోయింది. మంత్రి ఆదేశాలు బుట్టదాఖలు.. స్థానికుల విజ్ఞప్తి మేరకు మంత్రి హరీష్‌రావు రెండేళ్ల క్రితం రాక్‌గార్డెన్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. సహజసిద్ధంగా ఏర్పడ్డ చెరువుతో పాటు చుట్టూ కనువిందు చేసే రాళ్లు, ఏపుగా పెరిగిన చెట్లు చూసి ఆయన ముచ్చటపడ్డారు. ఫైల్‌ను దుమ్ముదులిపి వెంటనే సుందరంగా పార్కును తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. అప్పుడు ఓకే అన్న అధికారులు మంత్రి అటు వెళ్లగానే ఆ ఆదేశాలను పట్టించుకోవడం మానేశారు. హరీష్‌రావు పరిశీలించి వెళ్లిన తర్వాత ఇంకో రెండెకరాల స్థలం కబ్జాకు గురైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రివేళల్లో డంపింగ్‌లు.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, టోలిచౌకీ ప్రాంతాల్లో జరుగుతున్న భవన నిర్మాణాల్లో భాగంగా తొలిగించే మట్టిని లారీలతో తెచ్చి రాత్రివేళల్లో రాక్‌గార్డెన్ స్థలంలోనే డంపింగ్ చేస్తున్నారు. ప్రతిరోజూ వందల టన్నుల మట్టిని తెచ్చి పోస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అక్రమ డంపింగ్‌ను అడ్డుకోవాలని పలుమార్లు పోలీసులకు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. భవన నిర్మాణ వ్యర్థాలు తెచ్చే లారీలను స్థానికులు అడ్డుకుని ప్రశ్నిస్తే వారిపై దాడులు జరుగుతుంటడంతో ఎవరూ నోరు మెదపడం లేదు. ఎందుకింత నిర్లక్ష్యం! మహానగరంలో ఖాళీ స్థలాలు లేక చాలా కాలనీలు ఇబ్బందులు పడుతుంటే.. ఇక్కడ మాత్రం ఉన్న స్థలాన్ని కాపాడుకోలేని పరిస్థితిలో జీహెచ్ఎంసీ ఉంది. జీహెచ్ఎంసీ నిర్వాకం వల్లనే 30 ఎకరాల రాక్‌గార్డెన్ స్థలం ఇప్పుడు సగానికి ఆక్రమణకు గురైందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి, మంత్రి కేటీఆర్ స్పందించి నిధులు విడుదల చేస్తే ఈ పార్కు నిర్మాణం జరుగుతుంది. లేదంటే మిగిలిన స్థలం సైతం కబ్జా అవుతుందని స్థానిక అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే రాక్‌గార్డెన్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రభుత్వానికి లేఖలు రాశాం మూడు దశాబ్దాల క్రితం వరకు ఫిలింనగర్ కాలనీతో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 86,87 కొండ ప్రాంతం. ఇళ్ల నిర్మాణాల కోసం రాళ్లను ధ్వంసం చేశారు. అదృష్టవశాత్తు ఫిలింనగర్ గుట్టకు ఆనుకుని ఈ రాక్ గార్డెన్ స్థలం ఉంది. దీన్ని రక్షించుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. పార్కును సుందరంగా తీర్చిదిద్ది చారిత్రక వారసత్వంగా నేటి తరానికి అందించాలని పలుమార్లు సేవ్‌రాక్ సొసైటీ తరఫున మేం ప్రభుత్వానికి లేఖలు రాశాం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి.– ఫ్రాక్, సేవ్‌రాక్ సొసైటీ వ్యవస్థాపకురాలు పర్యావరణంపై శ్రద్ధేది! నగరంలో రోజురోజుకు ఖాళీ స్థలాలు తగ్గిపోతున్నాయి. ఆహ్లాదాన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉన్న ఖాళీ స్థలాలను కాపాడుకొని వాటికి రక్షణ ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. రాక్‌గార్డెన్‌కు కేటాయించిన స్థలంలో ఇప్పుడున్న చెట్లను రక్షిస్తూనే కొత్తగా మరింత పచ్చదనాన్ని తీర్చిదిద్దవచ్చు. ఏళ్ల తరబడి ఈ ప్రతిపాదనలు అటకెక్కాయి. ఏనాడో అభివృద్ధి చేసి ఉంటే ఈ భూములకు రక్షణ ఉండేది. పర్యావరణం బాగుండేది.– కెప్టెన్ జె.రామారావు, పర్యావరణవేత్త ప్రభుత్వ నిర్వాకమే నేను 20 ఏళ్లుగా ఈ రాక్‌గార్డెన్ ప్రాంతాన్ని చూస్తూనే ఉన్నాను. అభివృద్ధికి నోచుకున్న పాపాన పోలేదు. చుట్టూ మట్టి డంపింగ్ చేస్తుండడంతో కుదించుకుపోతోంది. రెండేళ్ల క్రితం మంత్రి హరీష్‌రావు వచ్చి పార్కును అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఆ రోజు చేసి ఉంటే ఈ రెండేళ్లలో కనీసం ఎకరం స్థలమైనా కాపాడేవారం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మంత్రి కేటీఆర్ స్పందించి ఈ స్థలాన్ని అభివృద్ధి చేయకపోతే ఏడాదిలో మొత్తం ఆక్రమించేస్తారు.– నాగమధు, సినీమేనేజర్, జూబ్లీహిల్స్ -
రాతివనం మెరిసింది.. పర్యాటకం మురిసింది
- వైభవంగా ప్రారంభమైన పున్నమి ఉత్సవాలు - ఓర్వకల్‌కు గుర్తింపు తెస్తామన్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి - జిల్లాను పర్యాటక కేంద్రంగా మారుస్తానన్న మంత్రి అఖిల ప్రియ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఓర్వకల్ సమీపంలోని రాక్‌గార్డెన్స్ పున్నమి ఉత్సవాలు–2017 అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మిరుగొట్లుగొలిపే కాంతిలో అందంగా తయారైన రాక్‌గార్డెన్స్‌లో అహ్లాదకరమైన వాతావరణంలో శుక్రవారం రాత్రి ఏడు గంటలకు ఎద్దులు, నాగలి పూజతో ఉత్సవాలకు మంత్రులు కేఈ కృష్ణమూర్తి, భూమా అఖిల ప్రియ శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతూ దేశంలోనే మొదటిసారిగా పున్నమి ఉత్సవాలకుసిద్ధమవడం కర్నూలుకు గర్వకారణమన్నారు. మంత్రి అఖిల ప్రియ మాట్లాడుతూ..పర్యాటక శాఖ మంత్రిగా ఉండి పున్నమి ఉత్సవాలను జరుపుతుండడంతో ఎంతో సంతోషకంగా ఉందన్నారు. ఓర్వకల్‌లోని పలు ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఐడీసీ చైర్మన్కేఈ ప్రభాకర్, శాలివాహన కుమ్మర కార్పొరేషన్ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. - ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు స్టెమ్ డ్యాన్స్ అనేది జీవితమని బెంగుళూరుకు చెందిన మధు నాటరాజ్ వివరించారు.అనంతరం తన నాట్య కళా సమితిలో శిక్షణ పొందిన నటులతో స్టెమ్ డ్యాన్స్ నృత్యం చేయించారు. త్రీడీ స్క్రీన్ ఎదుట కదిలే నాటరాజుల చిత్రాల వలే వారు చేసిన నృత్యాలు చూపురులను ఆకట్టుకున్నాయి. ఇండియన్ ఐడల్–2017గా నిలిచిన విశాఖపట్నానికి చెందిన రేవంత్‌రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జబర్దస్ ఫేమ్ చమక్‌చంద్ర వేసిన స్టెమ్ డ్యాన్స్, నవ్వుల హరివిల్లులో భాగంగా నవ్వులు పూయించడం ఆకట్టుకున్నాయి. త్రీడీ ప్రింటుతో సమీపంలోని రాక్‌గార్డెన్స్ కొండలపై లేజర్ కిరణాలతో వేసిన వీడియో ఆకట్టుకుంది. పున్నమి ఉత్సవాలను కెమెరాల్లో బంధించేందుకు పర్యాటక శాఖ డ్రోన్, క్రేన్ కెమరాలను వాడింది. అంతేకాక ప్యారచూట్ ద్వారా ఉత్సవాల ప్రారంభ సమయంలో పువ్వులను చల్లించారు. -
బెలుం గుహల్లో ఆర్మీ కల్నల్
కొలిమిగుండ్ల: బెలుం గుహలను శనివారం సికింద్రాబాద్‌కు చెందిన ఇండియన్ ఆర్మీ కల్నల్(ఐజీ) అతుల్గోషిక్ కుటుంబ సభ్యులతో కలసి సందర్శించారు. గుహల సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం గుహ లోపల ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన పలు ఆకారాలను తిలకించారు. భూమి లోపల గుహలు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. ఆధ్మాత్మిక సంగీతం ఏర్పాటు చేస్తే బావుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. విహార యాత్రలో భాగంగా జిల్లాలోని రాక్గార్డెన్స్తో పాటు అవుకు రిజర్వాయర్ తిలకించామన్నారు. అనంతరం మార్గమధ్యలో కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్ వద్ద ఆగి ఎస్ఐ బీటీ వెంకటసుబ్బయ్యతో ముచ్చటించారు. -
ప్రధాని రాకముందే నన్ను వెళ్లగొట్టారు!
చండీగఢ్: 'రాక్ గార్డెన్ లోపల నేను నిలబడి ఉన్నాను. మరికాసేపట్లో ప్రధానమంత్రి రాక్ గార్డెన్‌లోకి ఫ్రెంచ్ అధ్యక్షుడిని ఆహ్వానించాల్సి ఉంది. నా దగ్గర సరైన అనుమతి పత్రాలు కూడా ఉన్నాయి. అయినా ప్రధాని మోదీ రావడానికి పది నిమిషాల ముందే నన్ను అక్కడి నుంచి వెళ్లిపోమ్మన్నారు. నేను అక్కడ ఉండటానికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాలేదని చెప్తూ ప్రధాని భద్రతా అధికారి ఏఐజీ బల్వాన్ సింగ్ నన్ను పంపించేశారు' అని అంజుసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. చండీగఢ్‌లోని ప్రఖ్యాత 'రాక్ గార్డెన్' సృష్టికర్త నెక్ చంద్ తనయుడు ఆయన. ఆదివారం ప్రధాని రావడానికి ముందే తనను 'రాక్ గార్డెన్' నుంచి పంపించివేయడం తీవ్ర అవమానకరమని, చండీగఢ్ అధికారులు తనకు అనుమతి ఇచ్చినా ఈ విధంగా వ్యవహరించడం.. తనను బయటకు గెంటివేయడమేనని, దీనిని తనకు తీవ్ర అవమానకరమని ఆయన ఆవేదన వెల్లిబుచ్చారు. చండీగఢ్‌లోని ప్రఖ్యాత పర్యాటక ప్రదేశమైన రాక్ గార్డెన్‌ను 1976లో నెక్చంద్ సైనీ నిర్మించారు. శిల్పి అయిన ఆయన గత ఏడాది మరణించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత మనీష్ తివారీ ట్విట్టర్లో స్పందించారు. రాక్ గార్డెన్లో మోదీ, హోలాండ్ ఆనందంగా విహరిస్తుంటే.. రాక్ గార్డెన్ సృష్టికర్త అయిన నెక్ చంద్ కొడుకు పట్ల దారుణంగా వ్యవహరించి బయటకు గెంటేశారని ఆయన విమర్శించారు. -
రాక్‌గార్డెన్ సృష్టికర్త ఇక లేరు
దేశంలోనే కాక ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన చండీగఢ్ రాక్ గార్డెన్ సృష్టికర్త నేక్ చంద్ గుండెపోటుతో మరణించారు. 90 ఏళ్ల నేక్ చంద్ మధుమేహం, రక్తపోటుతో పాటు కేన్సర్‌తో కూడా బాధపడుతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆర్కిటెక్టు మృతికి సంతాప సూచకంగా చండీగఢ్ ప్రభుత్వం తన కార్యాలయాలన్నింటికీ ఒక రోజు సెలవు ప్రకటించింది. ప్రజల సందర్శనార్థం ఆయన మృతదేహాన్ని రాక్‌గార్డెన్‌లో ఉంచారు. నేక్ చంద్ అంత్యక్రియలు శనివారం నిర్వహిస్తారు. గత డిసెంబర్ నెలలోనే ఆయన తన 90వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ట్విట్టర్ ద్వారా నేక్ చంద్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో కూడా ఇక్కడి లాంటి రాక్ గార్డెన్ నమూనాను ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరిగాయి. అంటే ఈయన స్ఫూర్తి దిగంతాలకు కూడా పాకిందన్నమాట.