ఆహ్లాదం పంచేందుకు సిద్ధమైన రాక్ గార్డెన్
విజయనగరం: విజయనగర వాసులకు విజ్ఞానం.. ఆహ్లాదాన్ని పంచేందుకు రాక్‌గార్డెన్ ముస్తాబైంది. దీనిని సందర్శించేవారికి ఔషధ విజ్ఞానం అందేలా వందలాది ఔషధ మొక్కలను నాటారు. ఆహ్లాదాన్ని పంచేలా అందమైన పూలవనాలను పెంచుతున్నారు. పెద్దపెద్ద రాళ్లను గుట్టలుగా పేర్చి పార్క్‌ను సహజసిద్ధంగా తీర్చిదిద్దారు. చిన్నారుల కోసం ప్రత్యేక ఆటపరికరాలను అమర్చారు. ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని కొత్తపేట జంక్షన్ వద్ద రూ.2.20 కోట్ల వ్యయంతో తీర్చిదిద్దిన మహరాణి అప్పలకొండమాంబ రాక్ గార్డెన్ వచ్చేఏడాది జనవరి 1 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
రాక్ గార్డెన్ ఆవరణలో వివిద జాతుల మొక్కలు
రాష్ట్రంలోనే తొలి రాక్ పార్క్..
విజయనగరం కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధిచేసిన రాక్ గార్డెన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి పార్కు ఉండగా.. ఆంధ్రాలో ఇదే మొట్టమొదటిది కావడం విశేషం. అమృత్ పథకం నిధులతో ఈ పార్కును నిర్మించారు.
విభిన్న జాతుల మొక్కలు..
నగరంలోని ఐదున్నర ఎకరాల సువిశాల స్థలంలో అభివృద్ధి చేసిన రాక్‌గార్డెన్ అరుదైన ఔషధ మొక్కలతో ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు సిద్ధమైంది. గార్డెన్ ఆవరణలో దేశ, విదేశాలకు చెందిన 118 రకాల జాతుల మొక్కలను నాటారు. వీటన్నింటినీ హైదరాబాద్ నుంచి తెప్పించారు.
విద్యార్థులకు ఉపయుక్తం
రాక్ గార్డెన్ విద్యార్థులకు ఉపయుక్తం. గార్డెన్‌లో వివిధ రకాల ఔషధ మొక్కలతో పాటు బొటానికల్ మొక్కలు ఉన్నాయి. సైన్స్ విద్యార్థులు ప్రత్యక్షంగా మొక్కలను పరిశీలించేందుకు అవకాశం కలుగుతుంది. వాటి శాస్త్రీయ నామాలను పార్క్ నిర్వహణ సిబ్బందిని అడిగి తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోనే తొలి బొటానికల్ గార్డెన్ విజయనగరంలో రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉంది. జనవరి ఒకటో తేదీ నుంచి ప్రజలు సందర్శించి విజ్ఞానం పెంచుకోవాలి.
– కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యే, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment