రూటు మారిన ఇసుక దందా..! | Root turned the The sand danda ..! | Sakshi
Sakshi News home page

రూటు మారిన ఇసుక దందా..!

Published Fri, Feb 12 2016 2:09 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM

రూటు మారిన ఇసుక దందా..! - Sakshi

రూటు మారిన ఇసుక దందా..!

ఆరెపల్లిలో వేబిల్లులు... ఖాజీపూర్‌లో లోడింగ్
అక్రమ డంపుల నుంచి తరలుతున్న ఇసుక
ఓవర్‌లోడ్‌తో సర్కార్ ఆదాయానికి గండి

 
ఇసుక లారీని బుధవారం రాత్రి తిమ్మాపూర్ తహశీల్దార్ కోమల్‌రెడ్డి ఇందిరానగర్-నుస్తులాపూర్ మధ్యన పట్టుకున్నారు. లారీని వేబ్రిడ్జిలో తూకం వేయిస్తే దాదాపు 41 టన్నుల బరువున్నట్లు తేలింది. పరి మితికి మించి లోడ్ ఉండటంతో లారీని ఎల్‌ఎండీ ఠాణాకు తరలించారు. అదే సమయంలో లారీడ్రైవర్ చూపించిన వేబిల్లుపైనా అనుమానాలు కలుగుతున్నాయి. ఆ వేబిల్లు ఆరెపల్లి క్వారీలో ఇసుక లోడింగ్ చేసినట్లుగా ఉంది. కానీ ఆరెపల్లిలో లోడింగ్ అయిన ఇసుక లారీలన్నీ సిరిసిల్ల మీదుగా హైదరాబాద్ వెళతాయి. ఈ లారీ మాత్రం కరీంనగర్, అలుగునూరు మీదుగా హైదరాబాద్ వెళుతోంది. దీంతో ఆరెపల్లిలో ఇసుక లోడింగ్ కాలేదనే విషయం స్పష్టమవుతోంది 

కరీంనగర్ : బుధవారం రాత్రి అధికారులు పట్టుకున్న లారీ ఇసుక లారీల అసోసియేషన్ నాయకుడిది. ప్రతిరోజూ ఇట్లాంటి వేబిల్లులతో వందలాది లారీలు కరీంనగర్, అలుగునూరు మీదుగా హైదరాబాద్ వెళుతున్నట్లు తెలుస్తోంది. అసలు ఒక క్వారీ వద్ద వేబిల్లు తీసుకుని మరోచోట ఇసుకను నింపుకోవాల్సిన అవసరం ఏముందని ఆరా తీస్తే ఇసుక వ్యాపారుల దందా బయటపడింది. ఆరెపల్లితో పోలిస్తే ఖాజీపూర్, కొత్తపల్లి వద్ద ఇసుక నాణ్యమైనది. హైదరాబాద్ మార్కెట్‌లో ఆరెపల్లి ఇసుక టన్నుకు రూ.800 పలుకుతుండగా, ఖాజీపూర్, కొత్తపల్లి క్వారీల ఇసుక రూ.1600లకుపైగా పలుకుతోంది. దీంతో ఇసుక వ్యాపారాలు ఈ అక్రమ దందాకు తెరదీశారు. ఆరెపల్లి వద్ద వేబిల్లు తీసుకోవడం, ఖాజీపూర్, కొత్తపల్లి ఇసుక క్వారీల సమీపాల్లోనున్న అక్రమ డంప్‌ల వద్ద ఇసుకను లోడింగ్ చేసుకోవడం, అటునుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లి అధిక ధరకు అమ్ముకోవడం జరుగుతోంది. నిత్యం వందల కొద్ది లారీల ఇసుకను ఇలా అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం.

 ఓవర్‌లోడ్‌పై చర్యలేవీ..?
 ఇసుక లారీల ఓవర్‌లోడ్ విషయంలో కొద్ది రోజుల క్రితం అల్గునూర్ చెక్‌పోస్టు వద్ద జరిగిన తతంగాన్ని సాక్షి బయటపెట్టినప్పటికీ... ఆ తర్వాత కూడా ఇసుక లారీలు ఓవర్‌లోడ్‌తో వెళుతున్నాయి. బుధవారం రాత్రి తహశీల్దార్ పట్టుకున్న లారీలో ఓవర్‌లోడ్ కూడా బట్టబయలు కావడాన్ని చూస్తే దీనిని అడ్డుకోవడంలో అధికారులు విఫలమైనట్లు తెలుస్తోంది. పైగా ఇసుక లారీలు టార్పాలిన్లతో వెళ్లాలనే నిబంధన యజమానులకు బాగా కలిసివస్తోంది. ఓవర్‌లోడ్‌తో ఇసుక వెళుతున్నా పైన టార్పాలిన్ కప్పి ఉండటంతో అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. అనుమానం వచ్చి వేబ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి కాంటా వేయిస్తే తప్ప ఓవర్‌లోడ్ సంగతి బయటపడటం లేదు. ఇప్పటికే అనేకసార్లు ఓవర్‌లోడ్ లారీలను పట్టుకుని కేసులు నమోదు చేసినా, డ్రైవింగ్ లెసైన్సు సీజ్ చేసినా ఇసుక వ్యాపారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. కొంతమంది మాత్రం క్వారీల వద్ద ఇసుక తూకం వేయకుండా జేసీబీ ద్వారా పోస్తుండటంతో తేడా వస్తోందని చెబుతున్నారు. పైగా పరిమితికి మించి ఐదు శాతం ఇసుకను అదనంగా తీసుకెళ్లే అవకాశముందని పేర్కొంటున్నారు. సీసీ కెమెరాలెక్కడ?

ఆరెపల్లిలో వేబిల్లు తీసుకుని ఇసుక వ్యాపారులు అదే క్వారీ వద్ద ఇసుకను లోడింగ్ చేసుకుంటున్నారా.. లేదా అనే దానికి ఆధారాలు ఉండటం లేదు. ఎందుకంటే ఆ క్వారీ వద్ద ఇప్పటి వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. అవి లేకపోవడంతో ఒకచోట వే బిల్లు తీసుకుని మరోచోట ఇసుకను లోడింగ్ చేసుకునే అక్రమ దందాకు తెరదీస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండిపడే అవకాశముందని ప్రజలు కోరుతున్నారు. కొందరు లారీ యజమానులు ఒకే వేబిల్లుపై రెండుమూడు ట్రిప్పులు ఇసుకను లోడింగ్ చేసుకుంటున్నారు. తొలుత లోడింగ్ చేసుకున్న ఇసుకను కరీంనగర్‌లో విక్రయిస్తూ ఆ తరువాత లోడింగ్ చేసే ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అధికారులు పట్టుకుంటే లారీ చెడిపోవడంతో రిపేర్ చేయాల్సి వచ్చినందున ఆలస్యమైందనే సాకులు చెబుతున్నట్లు తెలుస్తోంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement