గులాబీలో గుబులు | Rose thicket | Sakshi
Sakshi News home page

గులాబీలో గుబులు

Published Sat, Nov 1 2014 2:53 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

గులాబీలో గుబులు - Sakshi

గులాబీలో గుబులు

  • ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పరేషాన్
  •  కవిత చేరికతో మానుకోటలో ఇబ్బందులు
  •  కేసీఆర్‌ను కలిసి నిలువరించే ప్రయత్నం
  •  నిర్ణయంపై పునరాలోచన లేదన్న అధినేత
  •  డోర్నకల్‌లోనూ రాథోడ్‌కు ఇదే పరిస్థితి
  • సాక్షి ప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్‌కు చెందిన ముఖ్యనేతల చేరికలు టీఆర్‌ఎస్‌లోని ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవితలు టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకోవడంతో ఈ నియోజకవర్గాల్లోని టీఆర్‌ఎస్ ముఖ్య నేతల రాజకీయ భవిష్యత్తుకు కష్టాలు మొదలయ్యాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌కు చెందిన ఈ ఇద్దరు ముఖ్య నేతల చేరికలతో ఈ రెండు నియోజకవర్గాల్లోని టీఆర్‌ఎస్ నేతల్లో ఉత్కం ఠ మొదలైంది.

    ముఖ్యంగా మహబూబాబాద్ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉం ది. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి బానోత్ శంకర్‌నాయక్ మహబూబాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాలోత్ కవితపై 9,602 ఓట్ల మెజారిటీతో శంకర్‌నాయక్ విజయం సాధిం చారు. సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన మండల పరిషత్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో శంకర్‌నాయక్, కవితలు రాజకీయంగా తీవ్రస్థాయిలో పోటీపడ్డారు. మాలోత్ కవిత టీఆర్‌ఎస్‌లో చేరుతుండడం శంకర్‌నాయక్‌కు ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టింది. కవిత టీఆర్‌ఎస్‌లో చేరాలనే నిర్ణయంపై శంకర్‌నాయక్ ప్రస్తుతానికి వ్యతిరేకంగా మాట్లాడకున్నా.. వ్యక్తిగతంగా అసంతృప్తితో ఉన్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
     
    సీఎంను కలిసిన శంకర్‌నాయక్

    శంకర్‌నాయక్ కూడా ఇదే విషయంపై సీఎం కేసీఆర్‌ను గురువారం రాత్రి హైదరాబాద్‌లో కలిశారు. కవితను పార్టీలో చేర్చుకునే నిర్ణయంపై పునరాలోచించాలని కోరే ప్రయత్నం చేశారు. కేసీఆర్ మాత్రం దీనిపై పునరాలోచన లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్‌నాయక్‌కు ఇబ్బంది ఉండదని భరోసా ఇచ్చినట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇప్పటికిప్పుడు శంకర్‌నాయక్‌కు ఇబ్బంది లేకున్నా.. కవిత చేరిన తర్వాత నియోజకవర్గంలో వర్గపోరు మొదలువుతుందని టీఆర్‌ఎస్ ముఖ్య నేతలే చెబుతున్నారు.

    మహబూబాబాద్ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి. ఇటీవలి ఎన్నికల్లో నాలుగు మండలాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే జెడ్పీటీసీలుగా గెలిచారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో నెల్లికుదురు జెడ్పీటీసీ టీఆర్‌ఎస్‌కు ఓటు వేశారు. మహబూబాబాద్, గూడూరు, కేసముద్రం జెడ్పీటీసీలు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. నియోజకవర్గంలో గూడూరు ఎంపీపీ పదవి కాంగ్రెస్‌కు దక్కింది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న వీరు కవిత టీఆర్‌ఎస్‌లో చేరుతారా? లేదా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను రాజకీయ ప్రత్యర్థిగా భావించి ఇన్నాళ్లు పోరాడిన నేతలు ఇప్పుడు కవిత వెంట టీఆర్‌ఎస్‌లో చేరితే రెండు పార్టీల నేతల మధ్య సత్సంబంధాలు ఎంతవరకు సాధ్యమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
     
    ఆయన వ్యవహార శైలి వల్లే..

    కవిత చేరిక అంశం పూర్తిగా టీఆర్‌ఎస్ అధినాయకత్వ నిర్ణయమే అయినా.. శంకర్‌నాయక్ వ్యవహారశైలి వల్లే దీనికి కారణమనే అభిప్రాయం గులాబీ పార్టీలో వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత శంకర్‌నాయక్ నియోజకవర్గంలో మొదటి నుంచి పార్టీలో ఉన్న టీఆర్‌ఎస్ కార్యకర్తలను కలుపుకునిపోవడం లేదని విమర్శలు ఉన్నాయి. టీఆర్‌ఎస్ శ్రేణులతో సమన్వయం లేకపోవడం పక్కనబెడితే పార్టీతో ఎలాంటి సంబంధంలేని వారికి ప్రాధాన్యత ఇస్తున్నారనే ఫిర్యాదులు టీఆర్‌ఎస్ అధిష్టానికి వెళ్లినట్లు గులాబీ పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యే తీరుపై కొందరు ప్రభుత్వ అధికారులు ఉద్యోగ సంఘాల నేతలో కలిసి టీఆర్‌ఎస్ ముఖ్యనేతల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలాంటి కారణాలతోనే కవిత చేరిక విషయాన్ని ఉన్నతస్థాయిలో ఖరారు చేసినట్లు టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.
     
    డోర్నకల్‌లో ఇలాగే..

    డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ చేరిక విషయంలోనూ ఇక్కడి టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి సత్యవతి రాథోడ్ అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. రెడ్యానాయక్ చేరిక ప్రకటన నేపథ్యంలో సత్యవతి రాథోడ్ గురువారం సాయంత్రం కేసీఆర్ వద్దకు వెళ్లారు. రాజకీయ భవిష్యత్తు విషయంలో ఇబ్బంది ఉండదని కేసీఆర్ ఈ సందర్భంగా ఆమెకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. సుదీర్ఘకాలంగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న రెడ్యానాయక్, సత్యవతి రాథోడ్‌లు ఎలా సర్దుకుంటారనేది భవిష్యత్తులో తేలనుంది. పరకాల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేరిక నిర్ణయంపై టీఆర్‌ఎస్‌లో నెలకొన్న వ్యతిరేకత ఇంకా సమసిపోలేదు.
     
    మళ్లీ కేసీఆర్‌తో భేటీ..

    ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవితలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్న నేపథ్యంలో వీరి నియోజకవర్గాలకు చెందిన టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు శుక్రవారం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. రాజకీయ భవిష్యత్తు విషయంలో వీరందరికీ కేసీఆర్ భరోసా ఇచ్చినట్లు తెలిసింది. రెడ్యానాయక్, మాలోత్ కవిత నవంబరు 4న, చల్లా ధర్మారెడ్డి 9న టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement