
కేరళ సీఎంకు పినరయి విజయన్‌కు చెక్కు అందజేస్తున్న హోంమంత్రి నాయిని
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆదివారం త్రివేండ్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు అందజేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రం తరఫున ఆర్థిక సహాయాన్ని అందజేసేందుకు నాయిని ఆదివారం హైదరాబాద్ నుంచి త్రివేండ్రం వెళ్లారు. మానవతా దృక్పథంతో తెలంగాణ రాష్ట్రం చేయదగిన సహాయా న్ని చేస్తుందన్నారు. గత నూరేళ్లలో రాని ప్రకృతి వైపరీత్యం కేరళలో వచ్చిందని, ఈ పరిస్థితుల పట్ల చలించిన కేసీఆర్ పొరుగు రాష్ట్రానికి అండగా ఉంటామనే సందేశాన్ని తెలిపేందుకు తనను పంపారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలోని రాష్ట్ర రెసిడెంట్ కమిషనర్ అశోక్ కుమార్ పాల్గొన్నారు.
కేరళకు నీటి శుద్ధి ప్లాంట్లు..
కేరళ వరద బాధితుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రూ.2.5 కోట్ల విలువైన 50 ఆర్వో వాటర్ ప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం బేగంపేట విమానాశ్రయం నుంచి వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానం ద్వారా పంపించింది. వీటి ద్వారా రోజుకు 10 లక్షల లీటర్ల నీటిని శుద్ధి చేయవచ్చు. ఆర్వో ప్లాంట్లను వినియోగించడంలో కేరళ ప్రజలకు సహకరించేందుకు 20 మంది స్మాట్ సంస్థ ఇంజనీర్లతో పాటు మరో 10 మంది సిబ్బందిని కూడా కేరళకు పంపింది.
మంత్రులు, ఎమ్మెల్యేల విరాళాలు..
వరదల్లో చిక్కుకున్న కేరళకు ఆపన్నహస్తం అందించేందుకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ముందుకొస్తున్నారు. హోంమంత్రి నాయిని, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలు తమ ఒక నెల జీతాన్ని కేరళ సీఎం సహాయనిధికి విరాళంగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment