
పంట రుణాలు రూ.3,811 కోట్లు
లెక్కతేల్చిన బ్యాంకులు
రైతు రుణాలు.. రూ. 2,314.91 కోట్లు
కాలపరిమితి రుణాలు..రూ. 1,496.78 కోట్లు
లబ్ధి పొందనున్న రైతులు 95,455 మంది
రంగారెడ్డి జిల్లా:
ఎట్టకేలకు పంటరుణాల లెక్క తేలింది. మొత్తం పంట రుణాలు రూ.3,811 కోట్లు ఉందని లీడ్ బ్యాంకు అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇక రుణ మాఫీ ద్వారా జిల్లాలో 95,455 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. రైతులు తీసుకున్న రుణాల్లో లక్షలోపు రుణమొత్తాన్ని మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో యంత్రాంగం.. సుధీర్ఘ మదింపు తర్వాత రుణాల లెక్కలు తేల్చింది. ఈనెల 2న ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్.. రుణ మాఫీకి సంబంధించి జిల్లాలవారీగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఆనా టి నుంచి బ్యాంకర్లు లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పలు జిల్లాల్లో బ్యాంకు అధికారులు రుణాల లెక్కలు సమర్పించినప్పటికీ.. జిల్లాలో మాత్రం లెక్కల్లో స్పష్టత రావడానికి చాలా సమయమే పట్టింది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మార్చి 31 నాటికి 95,455 మంది రైతులు వివిధ కేటగిరీల కింద రూ.3811.69కోట్ల రుణాలు తీసుకున్నారు. ఇందులో 77,387 మంది రైతులు పంట ఉత్పత్తులకోసం రూ.2314.91 కోట్లు ణంగా తీసుకున్నారు. అదేవిధంగా కాలపరిమితి కేటగిరీలో 18,068 మంది రైతులు రూ.1,496.78 కోట్లు రుణంగా తీసుకున్నారు.
మాఫీ రూ.లక్షలోపే..
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం రైతు తీసుకున్న పంట రుణంపై గరిష్టంగా రూ.లక్ష వరకు మాత్రమే మాఫీ చేయనుంది. అయితే బ్యాంకర్లు తయారుచేసిన జాబితా ప్రకారం అన్ని రకాల రుణాలను పేర్కొంటూ నివేదిక రూపొందించారు.ఇందులో కనిష్టం, గరి ష్టం అంటూ ప్రత్యేకంగా పేర్కొనలేదు. సగటు రూ.లక్షలోపు రుణం పొందిన రైతులందరికీ పూర్తిగా మాఫీ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా రూ.లక్ష కంటే ఎక్కువ మొత్తంలో రుణం తీసుకున్న వారికి గరిష్ట మాఫీ వర్తించనుంది. జిల్లా వ్యాప్తంగా రైతులకు ఏ మేరకు లబ్ధి చేకూరనుందనే అంశంపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. ప్రస్తుతం రైతు రుణాలను పంట రుణాలు, కాలపరిమిత రుణాలుగా విభజించారు. అయితే బంగారంపై తీసుకున్న ఇతర రుణాలను ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. జిల్లాలోని బ్యాంకుల పరిధిలో అన్ని రకాల రుణాలు కలుపుకుంటే రూ.13,199.98 కోట్లుగా ఉన్నాయి.