'ముందే సాధ్యాసాధ్యాలపై ఆలోచించుకోవాలి'
హైదరాబాద్: రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి కేసీఆర్ షరతులు పెట్టడం సరికాదని మాజీమంత్రి,కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకె అరుణ వ్యాఖ్యానించారు. నాలుగు నెలలుగా రైతులు కరువుతో సతమతం అవుతున్నారని ఆమె గురువారమిక్కడ అన్నారు. ప్రభుత్వం ఆంక్షలు లేని రుణమాఫీని అమలు చేయాలని డీకె అరుణ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలన్నారు.
హామీలు ఇచ్చేముందు సాధ్యాసాధ్యాలపై ముందే ఆలోచించుకోవాలని ఆమె పేర్కొన్నారు. రుణమాఫీ హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలి, లేకుంటే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోతుందన్నారు. గతంలో కాంగ్రెస్ సర్కార్ రైతుల అన్నిరకాల రుణాలను మాఫీ చేసి రైతులను ప్రోత్సహించిందన్నారు. కేసీఆర్ సర్కార్ కూడా అలానే చేయాలని ఆమె సూచించారు.