మాఫీ కావాల్సిన రుణాలు రూ.3,971 కోట్లు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్.. రుణమాఫీ ఫైల్‌పై మొదటి సంతకం చేస్తారని జిల్లా రైతులు ఎంతో ఆశతో ఉన్నారు. వచ్చే నెల 2న ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో.. ఆయన ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రుణమాఫీ హామీ అమలు కోసం ఎదురు చూస్తున్నారు. అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన వాగ్దానం టీఆర్‌ఎస్ అధినేత నిలబెట్టుకుంటారనే విశ్వాసం అన్నదాతల్లో వ్యక్తమవుతోంది.
వరంగల్, న్యూస్‌లైన్: ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం రుణమాఫీ చేస్తే జిల్లాలో సుమారుగా 4లక్షల 50వేల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అధికారుల అంచనా. జిల్లాలో రైతుల రుణాలు మొత్తం రూ.3,971 కోట్లు ఉన్నాయి. వాణిజ్య, సహకార బ్యాంకుల నుంచి రైతులు ఈ రుణాలను తమ వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ అవసరాల కోసం తీసుకున్నారు.
సాగుకు అవసరమైన పెట్టుబడులు, ఇతరత్రా ఖర్చుల నిమిత్తం 3లక్షల 50వేల మంది రైతులు వివిధ బ్యాంకుల వద్ద రూ.1835 కోట్ల రుణం తీసుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వ్యవసాయ అవసరాలకు వివిధ వాణిజ్య బ్యాంకుల వద్ద పాస్‌బుక్ ఆధారంగా బంగారాన్ని తాకట్టు పెట్టి 40వేల మంది రైతులు రూ.550 కోట్ల రుణాలు తీసుకున్నారు. సాగు అవసరాల నిమిత్తం దీర్ఘకాలిక చెల్లింపుల ప్రాతిపదికన, వ్యవసాయ అనుబంధంగా బర్రెలు, గొర్రెల పెంపకానికి, బోర్లు వేసేందుకు, నూతన యంత్రాల కొనుగోలుకు 60వేల మంది రైతులు రూ.1586 కోట్ల మేరకు రుణాలు తీసుకున్నారు.
గంపెడాశతో..
అప్పుల్లో ఉన్న తమకు తెలంగాణ తొలి ప్రభుత్వం రుణమాఫీ చేసి అండగా నిలుస్తుందని రైతులు గంపెడాశతో ఉన్నారు. జిల్లాలో 40 వరకు సహకార, వాణిజ్య, ప్రైవేటు బ్యాంకులున్నాయి. వీటిలో 31 బ్యాంకు లు రైతులకు రుణాలిచ్చాయి. జిల్లాలో 2013 -14 ఆర్థిక సంవత్సరంలో క్రాఫ్, టర్మ్, వ్యవసాయ అనుబంధ రుణాలు 2,290 కోట్లు అందజేశారుు. 2012 -13 సంవత్సరంలో రూ.1810 కోట్లు అందజేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లా లీడ్ బ్యాంకు కమిటీ నిర్ణ యం మేరకు పంట రుణాలు హెక్టార్ యూనిట్‌గా అందించే మోతాదు పెంచా రు. వరికి రూ.24,200, జొన్నకు రూ.8, 800, మొక్కజొన్నకు రూ.12,100, వాణిజ్యపంటలైన మిర్చికి రూ.33వేల నుంచి 49వేలు, పత్తికి రూ.27500గా నిర్ణయించి ఈ విధంగా రుణాలు అందించేందుకు చర్యలు తీసుకున్నారు.
అప్పులపాలవుతున్న అన్నదాత
సాగునీటి వసతిలేక అనేక మంది రైతులు వర్షాధార వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. చెరువులు, కుంటలు, భూగర్భ జలాలపై ఆధారపడి వివిధ పంటలు పండిస్తున్న విషయం తెలిసిందే. కరెంట్, బోర్ల నమ్ముకొని సాగు చేస్తున్నప్పటికీ విద్యుత్ కోతలు రైతులపాలిట శాపంగా మారుతున్నాయి. చిన్న, సన్నకారు రైతులు కరెంట్‌పై ఆధారపడి పంటలు వేసి పెట్టుబడి రాక అప్పులపాలవుతున్నారు. దీనికి తోడు ఇటీవల విత్తనాలు, ఎరువుల మందుల ధరలు పెరిగాయి. పెట్టుబడికి ప్రభుత్వ, సహకార బ్యాంకుల కంటే ప్రైవేటు వడ్డీవ్యాపారలపైనే రైతులు ఎక్కువగా ఆధారపడుతున్నారు. అకాల వర్షాలు, వడగళ్ళు, ఇతరత్రా ప్రకృతి వైపరీత్యాలు సైతం రైతుల నడ్డి విరిచాయి. మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేక ఆదాయం కోల్పోతున్నారు.
దీంతో రైతుల బతుకులు చితికిపోయాయి. సాగు నిమిత్తం సహకార, ప్రైవేటు బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రుణాలు చెల్లించలేక వడ్డీలు కడుతూ కాలం వెల్లదీస్తున్నారు. వాస్తవానికి సీజన్‌లో అప్పుకంటే రీషెడ్యూల్ చేస్తున్న రుణాలే ఎక్కువగా ఉంటున్నారుు. అయితే ప్రభుత్వం రూ.లక్ష మేరకే రుణమాఫీ చేస్తుందా? ఏ పద్ధతి పాటిస్తుంది? అనే సంశయం రైతుల్లో నెలకొంది. టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీ మేరకు అన్ని రకాల రుణాలు మాఫీ చేయడమే కాకుండా మళ్లీ రుణాలు ఇచ్చి వ్యవసాయానికి, రైతులకు అండగా నిలవాలని కోరుతున్నారు.