80 మంది రైతుల ఆత్మహత్య
టీఆర్‌ఎస్ పాలన తీరును తప్పుపట్టిన జానారెడ్డి
రుణమాఫీపై త్వరగా తేల్చండి.. విద్యార్థులపై లాఠీచార్జి అమానుషం
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ అమలుపై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 80 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎల్పీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలసి మీడియాతో ఆయన మాట్లాడారు. రుణాలు మాఫీ కాకపోవడం, కనీసం వాటిని రీషెడ్యూల్ చేయకపోవడంతో రైతులకు కొత్త రుణాలు అందడం లేదని, తద్వారాఅనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రత్యామ్నాయ ప్రణాళికను ప్రకటించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం శోచనీయమన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతోపాటు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని కోరుతున్నా పట్టించుకోకపోవడం బాధాకర మన్నారు.
గతంలో ఉస్మానియా వర్సిటీ వద్ద పోలీసు బలగాలను మోహరింపజేస్తేనే గగ్గోలు పెట్టిన టీఆర్‌ఎస్ నేతలు.. ఇప్పుడు ఏకంగా విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం అమానుషమని అన్నారు. తక్షణమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ఆకాశమే హద్దుగా టీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాల్సిందేనని పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.