రుణమాఫీ ప్రక్రియ షురూ..! | telangana government to start waiver crop loan! | Sakshi
Sakshi News home page

రుణమాఫీ ప్రక్రియ షురూ..!

Published Tue, Sep 2 2014 2:02 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

telangana government to start waiver crop loan!

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుల రుణమాఫీ అమలుకు రంగం సిద్ధమైంది. కొన్ని బ్యాంకులు ఇప్పటికే రుణాలను రెన్యువల్ చేయడం మొదలుపెట్టాయి. రైతుల నుంచి రుణాలు కట్టించుకుని ఆ వెంటనే కొత్త రుణాన్ని మంజూరు చేస్తున్నాయి. ఇలా రెన్యువల్ చేయించుకున్న రైతులకు ఈ నెల రెండో వారంలోగా తొలి విడత సొమ్మును అందించాలని టీ సర్కార్ నిర్ణయించింది. నేరుగా వారి ఖాతాల్లోనే 20 నుంచి 30 శాతం రుణ మొత్తం చేరుతుంది. రెన్యువల్ చేయించుకున్న వారికే రుణ మాఫీ నిధులు అందుతాయి. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతులు తమ రుణాలను రెన్యువల్ చేయించుకోకుంటే వారికి పంటల బీమా వర్తించకుండాపోయే ప్రమాదం ఉన్నందున త్వరగా ఈ ప్రక్రియను  పూర్తి చేయాలని బ్యాంకర్లను కోరింది.

 

అందుకు బ్యాంకర్లు కూడా అంగీకరించారు. రెన్యూవల్ చేసుకున్న రైతుల వివరాలను బ్యాంకులు అందించగానే.. వారి ఖాతాల్లోరుణ మాఫీ నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం రైతులు, గ్రామాలు, బ్యాంకులవారీగా రుణాల వివరాలు సేకరిస్తున్న బ్యాంకర్లు.. లక్ష రూపాయల్లోపు రుణ మాఫీకి అర్హులైన రైతుల జాబితాను శనివారం నాటికి ప్రభుత్వానికి సమర్పించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. సోమవారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన రుణ మాఫీ అమలు కమిటీ సమావేశానికి హాజరైన నాబార్డు, ఆర్‌ఆర్‌బీ, వాణిజ్య బ్యాంకుల ప్రతినిధులు ఈ మేరకు ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ నెల 4వ తేదీ నుంచి మూడు నాలుగు రోజుల పాటు గ్రామాల్లో సామాజిక తనిఖీలు నిర్వహించి అర్హుల తుది జాబితాను రూపొందిస్తారు. ఈ సమయంలోనే నకిలీ పాస్ పుస్తకాలుంటే వాటిని ఎమ్మార్వోలు తనిఖీ చేసి నిర్ధారిస్తారు. సామాజిక తనిఖీల అనంతరం ప్రభుత్వం ఎంత మొత్తంలో నిధులు చెల్లించాలన్న స్పష్టత వస్తుందని అధికార వర్గాలు వివరించాయి.

 

రూ. 30 వేలలోపున్న రుణాలను ఒకే విడతలో మాఫీ చేయనున్నట్లు పేర్కొన్నాయి. లక్ష వరకు ఉన్న రుణాల విషయంలో మాఫీ నిధులను రెండు మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపాయి. కాగా రైతుల రుణాలను ఇప్పటికే రెన్యువల్ చేస్తున్నట్లు దక్కన్ గ్రామీణ బ్యాంకు, సహకార బ్యాంకు, కొన్ని వాణిజ్య బ్యాంకులు ప్రభుత్వానికి సమాచారమిచ్చాయి. దక్కన్ గ్రామీణ బ్యాంకు రూ. 116 కోట్ల మేర కొత్త రుణాలు ఇచ్చినట్లు, అలాగే సహకార బ్యాంకులు కూడా కొత్త రుణాలు ఇచ్చినట్లు వెల్లడైంది. రైతులు రుణం చెల్లించిన మరుసటి రోజే కొత్త రుణాలు ఇస్తున్నామని, కొన్నిచోట్ల అదే రోజు రుణాలు మంజూరు చేస్తున్నట్లు బ్యాంకులు ప్రభుత్వానికి వివరించాయి. రైతులు ముందుగా బ్యాంకులకు రుణాలు చెల్లిస్తే వారికి ఆ మొత్తాన్ని వడ్డీతో సహా ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.


 ఈ వారంలోనే రీషెడ్యూల్..


 మూడు జిల్లాల్లో రుణాల రీ షెడ్యూల్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అనుమతించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. శనివారంలోగా ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కూడా బ్యాంకర్లను కోరింది. దీంతో ఆయా జిల్లాల్లో రైతుల నుంచి రుణాల రీషెడ్యూల్ పత్రాలపై సంతకాలు తీసుకుని కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు అంగీకరించాయి. ఆర్‌బీఐ అంగీకరించిన మేరకు రీషెడ్యూల్ రుణాలను మూడేళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మొదటి ఏడాది మారటోరియం విధిస్తారు. అంటే ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం ఉండదు.
 
 మిగిలిన రెండేళ్ల వ్యవధిలో అసలు, వడ్డీతో సహా ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. మూడు జిల్లాల్లో మొత్తం వంద మండలాల్లో దాదాపు రూ. 4000 కోట్ల వరకు రుణాలు రీషెడ్యూల్ అవుతాయని ఆంధ్రా బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు ఆర్థిక శాఖ అధికారులకు వివరించారు. కాగా, మాఫీ చేయాల్సిన రైతు రుణాల మొత్తం రూ. 17,337 కోట్లుగా మొదట అంచనా వేయగా.. ఆ భారం ప్రస్తుతం వడ్డీతో సహా రూ. 17,680 కోట్లకు చేరింది. వాస్తవంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు వడ్డీతో సహా మొత్తం రూ. 18,023 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తొలుత భావించారు. అయితే ఒకటి కన్నా ఎక్కువ ఖా తాలుంటే ఒకే ఖాతాను పరిగణనలోకి తీసుకోవడం, కుటుంబానికి లక్ష వరకే మాఫీ చేయడం వంటి నిర్ణయాల వల్ల ఈ భారం తగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement