‘మెట్రో’ మార్పుల భారం రూ.600 కోట్లు
‘మెట్రో’ మార్పుల భారం రూ.600 కోట్లు
4.2 కిలోమీటర్ల నుంచి 7.4 కిలోమీటర్లకు పెరిగిన ట్రాక్
లక్డీకాపూల్, సుల్తాన్‌బజార్‌లలో తగ్గుదల.. పాతబస్తీలో పెరుగుదల
ప్రత్యామ్నాయమార్గాలను సూచిస్తూ ప్రభుత్వం అధికారిక లేఖ
మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి అందించిన సీఎస్
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు మార్గంలో మూడు మార్పులు చేపట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయమార్గాలను సూచిస్తూ ఎల్‌అండ్‌టీ యాజమాన్యానికి అధికారికంగా లేఖ పంపించింది. మెట్రో అలైన్‌మెంట్ కారణంగా దాదాపు రూ.600 కోట్ల భారం పడనుంది. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. రాజధానిలో మొత్తం మూడుమార్గాల్లో 72 కిలోమీటర్ల మేర మెట్రోను నిర్మించేందుకు ఎల్‌అండ్‌టీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి విదితమే.
చారిత్రాత్మక కట్టడాలు, ప్రార్థనా మందిరాలు, ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న చిహ్నాలకు విఘాతం కలగకుండా ‘మైట్రో’లో మార్పులు చేసిన నేపథ్యంలో అది 75.2 కిలోమీటర్లకు పెరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడుచోట్ల మార్పుల్లో అసెంబ్లీ, సుల్తాన్‌బజార్ వద్ద మార్పులతో స్పల్పంగా ట్రాక్ తగ్గితే.. పాతబస్తీ అలైన్‌మెంట్ మార్పుతో మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ పెరగనుంది. అధికారంలోకి రాకముందే మెట్రో అలైన్‌మెంట్ మార్చాలంటూ టీఆర్‌ఎస్ గట్టిగా పట్టుబట్టింది. అధికారంలోకి వచ్చాక.. దీనిపై మరింత పట్టుదలతో ఉండడంతో.. ఎల్‌అండ్‌టీకి ప్రభుత్వానికి మధ్య కొంత ప్రతిష్టంభన ఏర్పడింది.
మెట్రోరైలు మార్పులకు సంబంధించి ఈనెల 15న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ, మెట్రోరైలు ఎండీ ఎన్వీస్‌రెడ్డితో సహా ఎల్‌అండ్‌టీ సంస్థల గ్రూపు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎ ఎం నాయక్, ఎల్‌అండ్‌టీ మెట్రోరైలు చైర్మన్ దేవస్థలి, ఎండీ వీబీ గాడ్గిల్‌లతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అలైన్‌మెంట్ మార్పు గురించి వివరించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీతో సమావేశం తరువాత పాతబస్తీ అలైన్‌మెంట్‌పై తుది నిర్ణయం తీసుకున్నారు. ఎల్‌బీనగర్ నుంచి మియాపూర్ వరకు ఉన్న మొదటి కారిడార్‌లో అసెంబ్లీ వద్ద ఒక మార్పు ఉండగా, జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు ఉన్న రెండో కారిడార్‌లో రెండుచోట్ల అలైన్‌మెంట్ మార్పు ఉంటుంది.