సారుకో షాడో..! | rta office in timmapur | Sakshi
Sakshi News home page

సారుకో షాడో..!

Published Tue, Dec 2 2014 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM

సారుకో షాడో..!

సారుకో షాడో..!

తిమ్మాపూర్ : ఆర్టీఏ కార్యాలయంలో క్లర్క్‌స్థాయి నుంచి డీటీసీ వరకు 28 మంది ఉద్యోగులుండగా, మరో 18 మంది హోంగార్డులున్నారు. వీరుగాకుండా అనధికారికంగా 12 మంది ప్రైవేటు ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారు. కార్యాలయంలో ఫీజు వసూలు నుంచి ఆన్‌లైన్ చేసే వరకు ఒరిజినల్ ఉద్యోగులు పని చేస్తుండగా, వాటికి సంబంధించిన రికార్డుల నిర్వహణ, పత్రాల సమర్పణకు ప్రైవేటు ఉద్యోగులు పని చేస్తున్నారు.

అట్లాగే వివిధ రకాల లెసైన్సులకు సంబంధించిన దరఖాస్తులపై సంతకాలు చేయడం అసలు ఉద్యోగుల పనైతే, సదరు ఫైళ్లపై ఉన్న కోడ్‌ల ఆధారంగా బ్రోకర్ల వద్దకు వెళ్లి డబ్బులు వసూలు చేసుకోవడం ప్రైవేటు ఉద్యోగుల పని. ఈ లెక్కన ఏరోజుకు ఆరోజు తమ సారు ఎన్ని ఫైళ్లపై సంతకాలు చేశారో... అన్ని ఫైళ్లకు సంబంధించిన అమ్యామ్యాలను నిక్కచ్చిగా వసూలు చేసి బాస్‌కు అందజేస్తున్నారు. ఆ వెంటనే సదరు సారు తనకు అందిన డబ్బును లెక్క చూసుకుని అందులోంచి 20 శాతం సొమ్మును ప్రైవేటు ఉద్యోగికి అందజేస్తారు. అవినీతి నిరోధక శాఖ అధికారుల కంట పడకుండా, ఒకవేళ ప్రైవేటు వ్యక్తి పట్టుపడినా తన చేతికి మట్టి అంటకుండా ఉండేందుకే ఆర్టీఏలో ఈ డూప్లికేట్ ఉద్యోగులను నియమించుకున్నారు.
 
దళారీల వద్దకు వెళితేనే లెసైన్సు
ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసినా ఆర్టీఏ కార్యాలయ సమీపంలో దళారీ వ్యవస్థ యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. ఆర్టీఏ కార్యాలయానికి వచ్చే దరఖాస్తులు 80 శాతం దళారుల ప్రమేయంతోనే వస్తున్నాయి. లెర్నింగ్ లెసైన్సు నుంచి మొదలుకుని ప్రతీ పనికి దళారులు ఒక రేట్ ఫిక్స్ చేసుకుని వ్యవహారం నడిపిస్తున్నారు. ప్రభుత్వానికి చెందాల్సిన డబ్బు కంటే ఎక్కువగా దళారులు వసూలు చేస్తున్నారు.

ఒకవేళ ఎవరైనా దరఖాస్తుదారుడు నేరుగా ఆఫీసుకు వస్తే పత్రాలు సరిగా లేవంటూసాకులు చెబుతూ తిప్పుతుంటారనే విమర్శలున్నాయి. దీంతో విసిగిపోయిన దరఖాస్తుదారులు ఇష్టం లేకపోయినా దళారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో తిమ్మాపూర్‌లోని ఆర్టీఏ కార్యాలయం వద్ద దాదాపు యాభై మందికి పైగా దళారులున్నట్లు తెలుస్తోంది. వీరంతా తాము పంపే దరఖాస్తులపై కోడ్ మార్కు పెట్టుకుంటారు. సదరు కోడ్ మార్క్‌ను చూసిన అధికారులు వాటిపై ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా సంతకాలు పెట్టేస్తున్నట్లు తెలుస్తోంది.
 
తప్పనిసరి పనులకూ దళారీ తోడు
కొన్ని పనులకు సంబంధించి దరఖాస్తుదారుడు తప్పనిసరిగా ఆఫీసుకు రావాల్సి ఉంది. ఆ సమయంలోనూ దళారులు ఆయన పక్కనే ఉండి వ్యవహారం నడిపిస్తున్నారు. లర్నింగ్ లెసైన్సు, పర్మినెంట్ లెసైన్సు, వాహన రిజిస్ట్రేషన్, పన్ను చెల్లింపులు, ఫిట్‌నెస్, పట్టుబడిన వాహనాల రిలీజ్‌తోపాటు శాఖాపరంగా ఇతర పనులను దళారులు తమకున్న అనుభవంతో చకచకా పనులు పూర్తి చేయిస్తారు.

వాహనదారులకే అన్ని పత్రాలు ఇచ్చి వారు నేరుగా ఆఫీసుకు వచ్చేలా చూడాలని ఇటీవల షోరూం డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీటీసీ స్పష్టం చేసినప్పటికీ దానిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. కొందరు షోరూం నిర్వాహకులు సైతం వాహన రిజిస్ట్రేషన్ తామే చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేసి ఆ ఫైళ్లను దళారులకు అప్పగిస్తున్నారు.
 
ఆర్టీఏలో ఇంకా పాత పట్టికే...
ఆర్టీఏ కార్యాలయంలో అందిస్తున్న సేవలు, వాటి ఫీజుల పట్టికకు, ప్రస్తుతం అధికారులు వసూలు చేస్తున్న చాలా వ్యత్యాసం కన్పిస్తోంది. ఈ విషయాన్ని కొందరు దరఖాస్తుదారులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఇప్పటికీ ఆఫీసు వద్ద పాత ఫీజు పట్టికే దర్శనమిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా స్మార్ట్ కార్డులు రావడంతో ఒక్కో కార్డుకు రూ.200 అదనంగా పెరిగినట్లు చెబుతున్నారు. పట్టికలో చూపించిన ఫీజులతో పాటు అదనంగా పోస్టల్ చార్జీలు వసూలు చేస్తుండగా, ఆ మొత్తం ఫీజు చలాన్ రూపంలోనే చూపించి రశీదు ఇస్తున్నారు. కొందరు నేరుగా, మరికొందరు ఏజెంట్ల ద్వారా కార్డులు తీసుకోవడంతో పోస్టల్ ద్వారా వెళ్తున్న కార్డులు తక్కువనే చెప్పొచ్చు.
 
జేబులకు చిల్లు ఇలా...

- లెసైన్స్ కోసం వచ్చే దరఖాస్తుదారునికి లెర్నింగ్ సమయంలో గరిష్టంగా రూ.90, పర్మినెంట్ లెసైన్స్ కోసం రూ.440 మాత్రమే ఆఫీసులో ఖర్చు ఉంటుంది. అయితే వీరి వద్ద దళారులు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తుంటారు.
- బైక్‌ల రిజిస్ట్రేషన్‌కు రూ.395, కార్లకు రూ.650 ఫీజుంటే రూ.1200 నుంచి 2 వేల వరకు, టాక్సీ కార్లకు పర్మిట్, ఫిట్‌నెస్, రిజిష్ట్రేషన్‌కు రూ.2250 వరకు ఫీజుండగా, రూ.4వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారు.
- లారీలకు ఫిట్‌నెస్‌కు రూ.1150 ఫీజుంటే రూ.3వేల వరకు, ట్రాక్టర్లకు రూ.550 ఉంటే రూ.వెయ్యి వరకు వసూలు చేస్తుంటారు.
- హార్వెస్టర్‌కు రూ.3600 ఫీజుంటే రూ.10వేల వరకు వసూలు చేస్తుంటారు.
- దళారులు వసూలు చేసిన మొత్తంలో ఒక్కో పనికి ఒక్కో విధంగా రూ.వంద నుంచి రూ.2వేల వరకు కార్యాలయంలో క్లర్క్ నుంచి మొదలు అధికారి వరకు ముట్టజెప్పుతారని బహిరంగంగానే చర్చ జరుగుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement