
డ్రైవింగ్ లెసైన్స్‌ల పునరుద్ధరణకు ఎస్సెమ్మెస్
వాహనాల తాత్కాలిక రిజిస్ట్రేషన్‌లకు కూడా..
శ్రీకారం చుట్టిన హైదరాబాద్ ఆర్టీఏ
సాక్షి,హైదరాబాద్: డ్రైవింగ్ లెసైన్స్ రెన్యూవల్‌కు సంబంధించి సంక్షిప్త సందేశం (ఎస్సెమ్మెస్) ద్వారా వాహనదారుడిని అప్రమత్తం చేసే సరికొత్త కార్యక్రమానికి హైదరాబాద్ ఆర్టీఏ శ్రీకారం చుట్టింది. రెండు రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించిన రవాణ శాఖ అధికారులు తాజాగా ఈ సదుపాయాన్ని వాహనదారులకు అందుబాటులోకి తెచ్చారు. దీంతో హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల్లోని వివిధ ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో డ్రైవింగ్ లెసైన్సుల పునరుద్ధరణకు వచ్చే వేలాది మంది వాహనదారులకు ప్రయోజనం కలగనుంది.
ఇప్పటివరకు వాహనాల రిజిస్ట్రేషన్లు, ఫిట్‌నెస్ ధ్రువీకర ణ, పర్మిట్‌లకు సంబంధించి మాత్రమే రవాణా శాఖ.. వాహనదారుల ఫోన్‌కు సంక్షిప్త సందేశాలు పంపి అప్రమత్తం చేసేది. ఇప్పుడు డ్రైవింగ్ లెసైన్సుల పునరుద్ధరణ, వాహనాల తాత్కాలిక రిజిస్ట్రేషన్లకు సైతం ఈ సేవలను విస్తరించింది. డ్రైవింగ్ లెసైన్సుల గడువు ముగియనున్న తేదీకి నెల రోజులు ముందుగానే వాహనదారుడి ఫోన్‌కు సంక్షిప్త సందేశం వెళ్లేలా రవాణ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీఏ నిబంధనల ప్రకారం వాహనదారుడు కొత్త వాహనం కొనుగోలు చేశాక 30 రోజుల్లో శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. గడువులోగా రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే ఇకపై వాహనదారుల ఫోన్‌కు సంక్షిప్త సందేశాలు వస్తాయి. వాహనాల రిజిస్ట్రేషన్‌లు, పర్మిట్లు తదితరాలపై ఎస్సెమ్మెస్ సేవలకు వాహనదారుల నుంచి మంచి స్పందన లభించడంతో ఈ సేవలను డ్రైవింగ్ లెసైన్సులు, తాత్కాలిక రిజిస్ట్రేషన్‌లకూ విస్తరించినట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.