ఆర్టీసీ చార్జీల మోత! | RTC charges to be hike in telangana state | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ చార్జీల మోత!

Published Fri, May 22 2015 1:58 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM

ఆర్టీసీ చార్జీల మోత!

ఆర్టీసీ చార్జీల మోత!

* బస్సు చార్జీల పెంపునకు సర్కారు నిర్ణయం
* సంస్థపై వేతన సవరణ భారాన్ని తగ్గించేందుకే...

 
సాక్షి, హైదరాబాద్: బస్సు ప్రయాణికులపై ఆర్టీసీ చార్జీల మోత మోగించేందుకు సర్కారు సిద్ధమైంది. ఇటీవల ఆర్టీసీ కార్మికుల వేతనాలను భారీగా పెంచిన నేపథ్యంలో సంస్థపైపడ్డ భారాన్ని కొంతమేర తగ్గించేందుకు చార్జీలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. కర్ణాటక, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో చార్జీలు తక్కువగా ఉన్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులపై పెద్దగా భారం పడకుండా చార్జీలను సవరించనున్నట్లు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా రూపొందించిన చిహ్నాన్ని మహేందర్‌రెడ్డి ఆవిష్కరించారు.
 
 అలాగే పల్లెవెలుగు బస్సులకు కొత్త రంగులు వేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కొత్త రంగులతో తీర్చిదిద్దిన పల్లె వెలుగు బస్సును కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న బస్సుల పర్మిట్ కాలపరిమితి పూర్తయ్యాక ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి వచ్చే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులకు ప్రవేశ పన్ను విధించాలని నిర్ణయించామన్నారు. ఇతర వాణిజ్య వాహనాలకు అమలు చేస్తున్నట్లుగానే ఆర్టీసీ బస్సులను కూడా పన్ను పరిధిలోకి తీసుకురానున్నట్లు చెప్పారు.
 
 28 నుంచి విడివిడిగా ఆర్టీసీ కార్యకలాపాలు...
 ఆర్టీసీ విభజన అంశాన్ని ప్రస్తుతం కేంద్రం ఏర్పాటు చేసిన షీలాభిడే కమిటీ పర్యవేక్షిస్తోందని...అయితే పని విభజన కోసం రెండు ఆర్టీసీల మధ్య సిబ్బంది కేటాయింపును పూర్తి చేశామని మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 28 నుంచి పూర్తిగా రెండు ఆర్టీసీలు విడివిడిగా పనిచేస్తాయని చెప్పారు. దీనికి సంబంధించి ఈనెల 25న నిర్వహించే ఆర్టీసీ బోర్డు సమావేశంలో తీర్మానం చేయనున్నట్లు వివరించారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్న నేపథ్యంలో ఆదుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాశామన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకోబోతోందని, దీనికి సంబంధించి అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి ఏసీ బస్సులు నడిపే ఆలోచనలో ఉన్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఎండీ రమణరావు, ఈడీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
 
 
 రాజధాని పేరుతో కొత్త బస్సులు
 అన్ని పట్టణాల నుంచి రాజధానిని అనుసంధానిస్తూ రూ. 20 కోట్లతో కొత్తగా 60 ‘రాజధాని’ పేరిట ఏసీ (ఇంద్ర తరహాలో) బస్సులు ప్రారంభించాలని నిర్ణయించారు. రూ. 10 కోట్లతో కొత్తగా 10 గరుడ ప్లస్ మల్టీయాక్సిల్ బస్సులు సమకూర్చనున్నట్లు అధికారులు తెలిపారు. ఇవి ఈ నెలాఖరుకు రోడ్డెక్కనున్నాయి.
 
 తెలంగాణ ఆర్టీసీ చిహ్నం ఇలా...
 లోగో వెలుపలి బంగారు వృత్తం బంగారు తెలంగాణకు, ఆకుపచ్చని వృత్తం హరితహారానికి, మధ్యలోని కాకతీయ ద్వారం తెలంగాణను ప్రతిబింబిస్తుందని, మధ్యభాగంలో పచ్చిక పల్లెలకు, చార్మినార్ చిత్రం నగరాలు, పట్టణాలకు సూచిక అని అధికారులు అభివర్ణిస్తున్నారు. దీన్ని నలంద అడ్వర్టయిజింగ్ అసోసియేట్స్ ప్రతినిధి జ్ఞానేశ్వర్ రూపొందించారు. మెట్రోరైల్, ఉమ్మడి రాష్ట్ర స్వర్ణోత్సవ లోగోలను కూడా ఆయనే రూపొందించారు.
 
 పల్లెవెలుగుకు రంగులు..
 ఇప్పటి వరకు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులు ముదురు ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో  ఉండేవి.  ఇకపై పల్లెవెలుగు బస్సులు లేత ఆకుపచ్చ రంగు, పైన వెడల్పాటి గులాబీ రంగు గీతతో కనిపించనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement