విధి వంచితుడు..! | RTC Temporary Conductor Leg Injured In Accident | Sakshi
Sakshi News home page

విధి వంచితుడు..!

Published Tue, Feb 4 2020 10:10 AM | Last Updated on Tue, Feb 4 2020 10:10 AM

RTC Temporary Conductor Leg Injured In Accident - Sakshi

సాక్షి, నల్లగొండ: కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు ఉపాధి కోసం వెళ్తే.. అతనికి శాశ్వత వైకల్యం మిగిలింది. తలరాతో.. లేక విధి వెక్కిరించిందో.. కానీ అతని కుటుంబంలో మాత్రం తీరని విషాదం నింపింది. తన పిల్లలను ఎత్తుకుని ఆడుతూ పాడుతూ వారిని లాలించాలి్సన తండ్రి ఇప్పుడు వాకర్‌ సాయం లేనిదే అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి దాపురించింది. ఆర్టీసీ సమ్మె కాలంలో తాత్కాలిక కండక్టర్‌గా పనిచేస్తున్న అతడిని తాను డ్యూటీ చేస్తున్న బస్సు ఢీ కొట్టింది. దీంతో కాలు నుజ్జునుజ్జయింది. మోకాలి కింది వరకు కాలు తొలగించారు. 23 రోజులు అతనితో పని చేయించుకున్న ఆర్టీసీ సంస్థ అతన్ని పట్టించుకున్న పాపానపోలేదు. బస్టాండ్‌లో ఘటన జరిగినా కనీసం మందలించిన వారు కూడా లేరు. దీంతో తనను ఆదుకోవాలని సోమవారం గ్రీవెన్స్‌లో ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ ఎదుట తన గోడు వెల్లబోసుకున్నాడు మిర్యాలగూడ మండలం గోగువారిగూడెం గ్రామానికి చెందిన పురం జానయ్య.

వైద్యానికి రూ.4.70 లక్షల ఖర్చు..
జానయ్య పొటోగ్రాఫర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గతేడాది అక్టోబర్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రభుత్వం తాత్కాలిక కార్మికులు కావాలని పత్రికల్లో ప్రకటించడంతో మిర్యాలగూడ డిపోలో దరఖాస్తు చేసుకున్నాడు. కండక్టర్‌గా ఎంపికై 23 రోజుల పాటు విధులు నిర్వర్తించాడు. మిర్యాలగూడ బస్టాండ్‌లో బస్సులో ప్రయాణికులను ఎక్కిస్తున్నాడు. కానీ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా బస్సును ముందుకు కదిలించడంతో జానయ్య ఎడమ కాలు నుజ్జునుజ్జయింది. వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు హైదరాబాద్‌కు రెఫర్‌ చేశారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఆపరేషన్‌ చేసి మొదట పాదం వరకు పూర్తిగా తొలగించారు. తరువాత కూడా కాలుకు గాయాలు ఏ మాత్రం మానకపోవడంతో మరోసారి ఆపరేషన్‌ చేసి మోకాలి కింది భాగం వరకు తొలగించారు. ఇలా రెండుసార్లు ఆపరేషన్‌ చేయడంతో రూ.4.70 లక్షల ఖర్చు అయింది. రెక్కాడితేగానీ డొక్క నిండని ఆ కుటుంబ సభ్యులు తెలిసిన వారి దగ్గర అప్పు తెచ్చి.. వైద్యం చేయించారు.

నయా పైసా ఇవ్వని ఆర్టీసీ...
జానయ్య చేత 23 రోజులు పని చేయించుకుని ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రాణాప్రాయ స్థితిలో ఉన్నా.. ఆ సంస్థ అధికారులు ఏ మాత్రం కనికరం చూపించలేదు. కుటుంబ పెద్ద  మంచానికే పరిమితమయ్యాడు. జానయ్య భార్య స్వాతి వీబీకేగా పని చేస్తే నెలకు రూ.3 వేలు మాత్రమే వస్తున్నాయి. ఆ మొత్తంతో కుటుంబ పోషణకు కూడా భారంగా మారిందని బాధితుడు కన్నీరుమన్నీరవుతున్నాడు. డిగ్రీ వరకు చదివిన తనకు ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా ఉపాధి కల్పించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని సోమవారం గ్రీవెన్స్‌ సెల్‌లో దరఖాస్తు చేసుకున్నాడు.
గ్రీవెన్స్‌ సెల్‌కు వచ్చిన పురం జానయ్య 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement