దద్దరిల్లిన అసెంబ్లీ | Ruckus in Telangana Assembly | Sakshi
Sakshi News home page

దద్దరిల్లిన అసెంబ్లీ

Published Sat, Nov 8 2014 1:59 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

దద్దరిల్లిన అసెంబ్లీ - Sakshi

దద్దరిల్లిన అసెంబ్లీ

రైతుల ఆత్మహత్యలపై చర్చకు విపక్షాల పట్టు
 ప్రశ్నోత్తరాల సమయంలో సభను అడ్డుకున్న సభ్యులు
 
  రెండో రోజు ఆరంభంలోనే
  అసెంబ్లీ రెండుసార్లు వాయిదా
  వ్యవసాయ మంత్రి పోచారం
  రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్
  రైతులపై అనుచిత వ్యాఖ్యలకు 
  క్షమాపణ చెప్పాలంటూ ఆందోళన
  పోడియం వద్ద టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ సభ్యుల నినాదాలు
  విపక్షాలపై మండిపడ్డ అధికారపక్షం
  కాంగ్రెస్, టీడీపీలపై ఎదురుదాడి
  ఉద్దేశపూర్వకంగానే సభను అడ్డుకుంటున్నారని ఆగ్రహం
  పది మంది టీడీపీ సభ్యులపై ఒకరోజు సస్పెన్షన్ వేటు
  బలవంతంగా లాక్కెళ్లిన మార్షల్స్
  బడ్జెట్‌పై చర్చను ప్రారంభించిన విపక్ష నేత జానారెడ్డి, సభ ఎల్లుండికి వాయిదా
 
 సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల రెండోరోజు శుక్రవారం రైతుల ఆత్మహత్యల అంశంపై సభ దద్దరిల్లింది. విపక్షాల ఆందోళనతో బడ్జెట్‌పై చర్చ మొదలుకాక ముందే వాయిదాలు, సస్పెన్షన్లతో అసెంబ్లీ అట్టుడికింది. సభా కార్యక్రమాలను పదే పదే అడ్డుకుంటున్న కారణంతో పది మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. ఉదయం సభ ప్రారంభంకాగానే వాయిదా తీర్మానాలపై విపక్ష సభ్యులు పట్టుబట్టారు. రైతుల ఆత్మహత్యలపై చర్చించాలంటూ సభను అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికార, విపక్షాల మధ్య రెండు గంటలకుపైగా మాటల యుద్ధం కొనసాగింది. పది గంటలకు సభ ప్రారంభమైన వెంటనే.. రైతులను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్, టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ‘షేమ్.. షేమ్’ అంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు.
 
  రైతుల ఆత్మహత్యలపై చర్చించాలని ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పందిస్తూ.. ‘సభలో అన్ని సమస్యలను సంపూర్ణంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధం. వారం పది రోజులు కాదు. నలభై రోజుైలైనా సమావేశాలు కొనసాగిస్తాం. సమస్యలపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది. బీఏసీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సభ్యులు వ్యవహరించాలి. సభ నిర్వహించేందుకు సహకరించాలి. 
 
 ఏదైనా ప్రధానాంశం ఉంటే వేరే రూపంలో చర్చకు రావాలి’ అని విజ్ఞప్తి చేశారు. అనంతరం  స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. విద్యుత్‌పై మొదటి ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమిస్తుండగానే.. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. ‘టీఆర్‌ఎస్ నుంచి తెలంగాణను కాపాడండి. 
 
 ఆత్మహత్యల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించండి. మంత్రి పోచారాన్ని వెంటనే బర్తరఫ్ చేయండి. రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి. ఆత్మహత్యలపై వెంటనే వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి..’ అంటూ ప్లకార్డులు పట్టుకొని ఆందోళనకు దిగారు. ప్రశ్నోత్తరాలకు సహకరించాలని, హుందాగా వ్యవహరించాలని స్పీకర్ నచ్చజెప్పినా సభ్యులు ఆందోళన వీడలేదు. దీంతో విధిలేక సభను పది నిమిషాల పాటు స్పీకర్ వాయిదా వేశారు. మళ్లీ సమావేశమైన తర్వాత కూడా విపక్షాల ఆందోళన కొనసాగింది. రైతులను అవమానపరిచిన పోచారంతో క్షమాపణ చెప్పించాలని నినాదాలు చేస్తూ పలువురు సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరారు. దీంతో మరోసారి సభ వాయిదా పడింది. 
 
 మళ్లీ అడ్డుకున్న విపక్షాలు
 తఠిఉదయం 11.20 గంటలకు సభ తిరిగి ప్రారంభమైంది. అప్పటికీ సభ్యులు శాంతించకుండా.. రైతు ఆత్మహత్యలపై చర్చ చేపట్టాలని పట్టుబట్టారు. సభ జరిగేందుకు సహకరించాలని శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు పదేపదే విజ్ఞప్తి చేశారు. ‘ప్రశ్నోత్తరాలు సభ్యుల హక్కు. అందుకే వాయిదా తీర్మానాలుంటే ప్రశ్నోత్తరాల తర్వాతే ప్రవేశపెట్టాలని బీఏసీ సమావేశంలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఒప్పుకొన్నాయి. ఏ అంశంపైనైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విపక్షాలు సభను అడ్డుకునేందుకే వచ్చినట్లున్నాయి. విద్యుత్‌పై చర్చ జరిగితే టీడీపీ భండారం బయటపడుతుంది. అందుకే ఉద్దేశపూర్వకంగాసభను అడ్డుకుంటున్నారు. ఇది సంస్కృతి కాదు. మీకు మైకులిస్తాం. మీరు మాట్లాడండి. సభా సమయం విలువైనది. చర్చకు సహకరించండి’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. అప్పటికీ టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వీడలేదు. జోక్యం చేసుకున్న స్పీకర్.. సీఎల్పీ నేత జానారెడ్డికి మాట్లాడే అవకాశమివ్వడంతో కాంగ్రెస్ సభ్యులు పోడియం దగ్గర ఆందోళన విరమించి, తమ తమ సీట్లలో కూర్చున్నారు. ప్రశ్నావళి జరగకూడదని తమకేమీ లేదని, రైతుల ఆత్మహత్యలు ఆందోళనకరమైన అంశమని.. విద్యుత్ అంశంతో పాటు చర్చించేందుకు వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని జానారెడ్డి కోరారు. అత్యంత ప్రాధాన్యమైన విషయమైతే ప్రశ్నోత్తరాల కంటే ముందుగా చర్చకు సహకరిస్తామని బీఏసీలో అధికార పార్టీ అంగీకరించిందన్నారు. గజ్వేల్‌లో ఇందిరాగాంధీ విగ్రహానికి చెప్పుల దండ వేసిన దోషులను శిక్షించాలని కూడా కోరారు. దీనికి హరీశ్‌రావు స్పందిస్తూ.. దోషులను శిక్షించాలని ఇప్పటికే పోలీసు శాఖను ఆదేశించినట్లు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. సభలో చర్చ జరిపేందుకు ఎలాంటి బేషజాలు లేవని, విపక్షాలు లేవనెత్తే ప్రతి అంశానికి సమాధానం చెప్తామన్నారు. పదేళ్ల నుంచి తాము ఇదే సభలో సభ్యులుగా ఉన్నామని, ఏ అంశంపైనైనా నేరుగా వాయిదా తీర్మానాన్ని స్వీకరించారా అని హరీశ్ ప్రశ్నించారు. బయట ఏదో సొంత పనులు ఉన్నందుకు... కొందరు సభ్యులు ఉద్దేశపూర్వకంగానే సభను అడ్డుకుంటున్నారన్నారు. అయితే వ్యవసాయ శాఖ మంత్రి రైతులపై చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, వాయిదా తీర్మానాన్ని అంగీకరించాలని జానారెడ్డి పట్టుబట్టారు. జోక్యం చేసుకున్న ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పూర్తిస్థాయి చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 
 
 అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం
 ప్రజల సమస్యల పరిష్కారానికి పచ్చజెండాల పార్టీకి చిత్తశుద్ధి లేదని, అందుకే సభ జరగకుండా చూస్తోందని టీడీపీ సభ్యులపై ఈటెల రాజేందర్ విరుచుకుపడ్డారు. వాళ్ల మూలాలు చంద్రబాబు వద్ద.. ఆంధ్రాలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. 1984 నుంచి 2014 వరకు 25 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇందుకు టీడీపీ, కాంగ్రెస్ కారణం కాదా? కరెంటు కష్టాలకు కారణమేంటో తేల్చుకుందాం రండి? అని సవాల్ విసిరారు. అసలు రైతులపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేశారు. రాజకీయ భవిష్యత్తు లేదనే ఆందోళనతో సభను అడ్డుకుంటోందన్నారు. 
 
 ‘ఇప్పటివరకు చేసింది చాలు.. ముంచింది చాలు.. తెలంగాణ ఉసురు పోసుకున్నది చాలు.. కూర్చొండి’ అంటూ మండిపడ్డారు. దీంతో టీడీపీ సభ్యులు ఎదురుదాడి చేశారు. తాము సమస్యలను లేవనెత్తుతుంటే.. మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. ఈ సమయంలో హరీశ్‌రావు అడ్డుపడేందుకు ప్రయత్నించగా.. ఎదురుదాడి చేయడం మానుకోవాలని, ఎవరూ భయపడేవారు లేరని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. ఆత్మహత్యలపై చర్చను ప్రారంభించాలని, రాష్ట్రంలో ఇప్పటికే 363 మంది రైతులు చనిపోయారని, గజ్వేల్‌లోనే అధికంగా ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. 
 
 పోచారంతో క్షమాపణ చెప్పించిన తర్వాతే చర్చ ప్రారంభించాలని పట్టుబట్టారు. దీంతో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘విద్యుత్‌పై ఆందోళన చేసిన రైతులపై బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపింది చంద్రబాబు.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే హిస్టీరియాతో రైతులు చనిపోతున్నారని అన్నది చంద్రబాబు.. ఇలా చెప్పుకొంటూపోతే గంట సేపైనా మాట్లాడుతా’ అని మంత్రి ఆవేశంగా అన్నారు. చర్చకు ప్రభుత్వం వెనక్కి పోవడం లేదని స్పష్టం చేశారు. కేవలం రాజకీయం చేసేందుకే సభా సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ఆత్మస్థైరం కోల్పోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పుండు మీద కారం చల్లినట్లుగా మంత్రి పోచారం వ్యాఖ్యానించడంపై సంజాయిషీ చెప్పాలని బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. 
 
 
 ఆత్మహత్యల నివారణకు అందరి సలహాలు, సూచనలు స్వీకరించాలని అధికార పార్టీకి సూచించారు. అదే సమయంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి పత్రికల క్లిప్పింగ్‌లు చూపుతూ అధికార పార్టీ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యలపై చర్చించడం ఇష్టం లేని విపక్షాలు సభలో డ్రామాలు.. తమాషాలు చేస్తున్నాయన్నారు. మాట్లాడేందుకు ఏమీ లేనందుకే విపక్షాలు తప్పించుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. సభ జరగకుండా అడ్డుకునే సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానమైన ప్రశ్నలుంటే ప్రశ్నోత్తరాల వ్యవధి తర్వాత మరో అరగంట సమయం చర్చకు కేటాయించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించినట్లు గుర్తుచేశారు. 
 
 టీడీపీ సభ్యుల సస్పెన్షన్
 టీడీపీ సభ్యులు ఎంతకీ ఆందోళన విరమించకపోవడంతో.. సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్న వారిని సస్పెండ్ చేయాలని మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదించారు. దీంతో స్పీకర్ టీడీపీకి చెందిన పది మంది సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, అరికపూడి గాంధి, మాగంటి గోపినాధ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జి.సాయన్న, రాజేశ్వర్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, మాధవరం కృష్ణారావు సస్పెన్షన్‌కు గురయ్యారు. వీరంతా పోడియం నుంచి కదలకపోవడంతో మార్షల్స్ రంగ ప్రవేశం చేశారు. ఎర్రబెల్లి, వెంకటవీరయ్య, రేవంత్‌రెడ్డిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. తప్పనిసరి పరిస్థితుల్లో సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు హరీశ్‌రావు ప్రకటించారు. దీనిపై జానారెడ్డి మాట్లాడుతూ.. తొలి శాసనసభలోనే సభ్యుల సస్పెన్షన్ చాలా దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ సభ్యులు టీడీపీతో జత కడుతున్నారని మంత్రి ఈటెల చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. సభ్యులు డ్రామాలాడుతున్నారంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలనూ ఉపసంహరించుకోవాలన్నారు. విద్యుత్, రైతు సమస్యలపై చర్చించాకే ముందుకు వెళదామన్నారు. దీంతో అక్బరుద్దీన్ స్పందిస్తూ.. తన మాటలకు సభ్యులు బాధపడినట్టున్నారని, అయితే ప్రధాన ప్రతిపక్షానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రశ్నోత్తరాలు జరగనీయాలని, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపాలని సూచించారు. కాగా, అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెబుతున్నా సభను అడ్డుకోవడం విజ్ఞత కాదని, ముందుగా బడ్జెట్‌ను ఆమోదించాల్సిన అవసరముందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సభ్యులను సస్పెండ్ చేయడం తమ అభిమతం కాదని వివరణ  ఇచ్చారు.
 
 బడ్జెట్‌పై చర్చ ప్రారంభం
 అనంతరం బడ్జెట్‌పై చర్చ ప్రారంభించాలని జానారెడ్డికి స్పీకర్ మధుసూదనాచారి సూచించారు. అయితే జానారెడ్డి మాట్లాడకుండా కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్కకు మాట్లాడే అవకాశమివ్వాలని పేర్కొన్నారు. దీంతో కేసీఆర్ మళ్లీ స్పందిస్తూ.. ‘నేను అప్పీల్ చేశాను. సాయంత్రం వేళ చర్చకు కూడా సిద్ధమని చెప్పాను. అయినా సభకు పదే పదే అడ్డుపడితే ఎలా? బడ్జెట్‌ను పాస్ చే యడం ప్రధానం. ప్రజా సమస్యలపై ప్రాధాన్య క్రమంలో చర్చిద్దాం’ అని సీఎం పేర్కొన్నారు. అయినా కాంగ్రెస్ సభ్యులు సభను అడ్డుకునే వైఖరినే కొనసాగించడంతో వారితో మాట్లాడేందుకు వీలుగా టీ బ్రేక్ ఇవ్వాలని స్పీకర్‌కు కేసీఆర్ సూచించారు. దీంతో ఆయన టీ బ్రేక్ ఇచ్చారు. ఈ సమయంలో విపక్షాలతో సీఎం మాట్లాడారు. మధ్యాహ్నం 1.45 గంటలకు సభ తిరిగి సమావేశమైన తర్వాత బడ్జెట్‌పై చర్చను జానారెడ్డి ప్రారంభించారు. అయితే దీన్ని సోమవారం కొనసాగిస్తానని ఆయన కోరడంతో స్పీకర్ ఆ మేరకు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement